Rice flour
-
సమ్మర్ సీజన్ వేడిలో.. వడియాలకై కాచుకోండి!
మార్చి మూడు వంతులు గడిచింది. ఆహారం ఎండబెట్టే కాలం వచ్చింది. ఏడాదికి సరిపడా నిల్వ చేయాలి. వానల్లో వెచ్చగా వేయించుకు తినాలి. చలిలో కరకరలాడే రుచిని ఆస్వాదించాలి. ఏప్రిల్ నెలకు ఎండ తీవ్రత పెరుగుతుంది. వడగాలి వచ్చి దుమ్మెత్తి పోయకముందే... వడియాలకు దినుసులు సిద్ధం చేద్దాం. ఎండబెట్టమని సూర్యుడికి పని చెబుదాం. బియ్యప్పిండి వడియాలు కావలసినవి: బియ్యప్పిండి – ఒక గ్లాసు సగ్గుబియ్యం – పావు కప్పు ఎండుమిర్చి – 2 జీలకర్ర – టీ స్పూన్ ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి నూనె – వేయించడానికి తగినంత. తయారీ విధానం: ఒక పాత్రలో బియ్యప్పిండి వేసి అందులో రెండు గ్లాసుల నీటిని పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి. ఒక పాత్రలో సగ్గుబియ్యం వేసి మునిగేలా నీటిని పోసి పక్కన పెట్టాలి. మిక్సీలో ఎండుమిర్చిని గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. మెత్తగా గ్రైండ్ కావాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద పాత్రలో ఆరుగ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. నీరు వేడెక్కిన తర్వాత ఉప్పు కలపాలి. నీరు మరగడం మొదలైన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలిపి మూత పెట్టాలి. సగ్గుబియ్యం ఉడకడం మొదలైన తర్వాత నానబెట్టిన బియ్యప్పిండిని పోసి కలపాలి. పిండి అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి. పిండి ఉడికేటప్పుడు ఎండుమిర్చి పొడి, జీలకర్ర వేసి కలిపి దించేయాలి. వడియాల పిండి వేడి తగ్గేలోపు నూలు వస్త్రాన్ని తడిపి నేల మీద పరిచి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని స్పూన్‌తో వడియాలుగా పెట్టాలి. రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత క్లాత్‌కు వెనుకవైపు నీటిని చల్లి వడియాలను వలిచి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ వడియాలు చాలా త్వరగా వేగుతాయి. నూనెలో వేసిన తర్వాత పొంగి పువ్వుల్లా విచ్చుకోవడం మొదలవుతుంది. అప్పుడు చిల్లుల గరిటెతో నూనెలో ముంచినట్లయితే రెండు వైపులా సమంగా వేగుతాయి. వీటిని తెల్లగా ఉండగానే నూనెలో నుంచి తీసేయాలి. తీయడం ఆలస్యమైతే ఎరుపురంగులోకి మారిపోయి చేదు వస్తుంది. బియ్యం..సగ్గుబియ్యం వడియాలు కావలసినవి: బియ్యం – ఒక గ్లాసు సగ్గుబియ్యం – పావు గ్లాసు పచ్చిమిర్చి – 2 అల్లం – అంగుళం ముక్క జీలకర్ర – టీ స్పూన్ ఉప్పు – పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి తయారీ విధానం: బియ్యం, సగ్గుబియ్యాన్ని కడిగి మంచినీటిలో నానబెట్టాలి. ఆరు గంటల తర్వాత మిక్సీ జార్లో వేసి, తగినంత నీటిని పోస్తూ, ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి. దోసెల పిండిలాగ మెత్తగా గరిటె జారుడుగా రుబ్బుకోవాలి. మరొక జార్లో పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. పెద్ద పాత్రలో ఐదు గ్లాసుల నీటిని పోసి మరిగిన తర్వాత బియ్యప్పిండి మిశ్రమాన్ని పోసి గరిటెతో కలపాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు అల్లం, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర వేసి కలపాలి. మిశ్రమం బాగా దగ్గరయ్యి సంగటిలా ముద్దగా అవుతుంది. పాత్రను స్టవ్ మీద నుంచి దించేసి చల్లారనివ్వాలి. పాలిథిన్ షీట్ మీద వడియాల్లాగ పెట్టాలి. ఈ వడియాలను స్పూన్‌తో పెట్టడం కుదరదు. చేత్తోనే పెట్టాలి. కాబట్టి వేడి తగ్గిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని పిండి కొద్దికొద్దిగా పడేటట్లు మునివేళ్లతో పేపర్ మీద పెట్టాలి. ఈ వడియాలు ఒక్కరోజులోనే ఎండిపోతాయి. ఉదయం పెడితే సాయంత్రానికి ఎండతాయి. వేళ్లతో కదిలించగానే పేపర్ మీద నుంచి ఊడి వచ్చేస్తాయి. లోపల కొద్దిపాటి పచ్చి ఉన్నప్పటికీ అదే రోజు వలిచి పేపర్ మీద ఆరబోసి రెండవ రోజు ఎండలో పెట్టాలి. ఈ వడియాలను వేయించేటప్పుడు కూడా కొద్దిపాటి జాగ్రత్త అవసరం. నూనె వేడెక్కిన తర్వాత వడియాలను నూనెలో వేసిన వెంటనే చిల్లుల గరిటెతో నూనెలో ముంచి కొద్ది సెకన్లపాటు ఉంచితే లోపల కూడా బాగా కాలి పువ్వులా విచ్చుకుంటాయి. రవ్వ వడియాలు కావలసినవి: బొంబాయి రవ్వ – కేజీ పచ్చిమిర్చి– పది జీలకర్ర: టేబుల్ స్పూన్ అల్లం – 50 గ్రాములు ఉప్పు– టేబుల్ స్పూన్ లేదా రుచిని బట్టి నీరు – 8 లీటర్లు సగ్గుబియ్యం – పావు కేజీ నూనె – వేయించడానికి తగినంత తయారీ విధానం: రవ్వను ఒక పాత్రలో వేసి మునిగేటట్లు నీటిని పోసి పక్కన ఉంచాలి. అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి మిక్సీ జార్లో వేయాలి, అందులో జీలకర్ర, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేయాలి. పెద్ద పాత్రలో నీటిని పోసి వేడి చేయాలి. నీరు మరగడం మొదలైన తర్వాత గ్రైండ్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. ఆ తరవాత సగ్గుబియ్యాన్ని, నానబెట్టిన రవ్వను వేసి కలియబెట్టాలి. రవ్వ ఉడికి దగ్గరవుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. ఒక నూలు వస్త్రాన్ని తడిపి నేల మీద పరిచి వడియాలు పెట్టాలి. మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని టీ స్పూన్‌తో ఒక్కో స్పూన్ మిశ్రమాన్ని వస్త్రం మీద వేయాలి. ఇలా రవ్వ మిశ్రమం మొత్తాన్ని వడియాలుగా పెట్టాలి. మంచి ఎండల్లో ఒక రోజుకే ముప్పావు వంతు ఎండిపోతాయి. లోపల ఉన్న పచ్చి రెండవ రోజుకు ఎండిపోతుంది. ఇలా రెండు రోజులు ఎండిన తర్వాత వస్త్రానికి వెనుక వైపు నీటిని చల్లి వడియాలను వలవాలి. వలిచిన తరవాత ఒక రోజు ఎండబెట్టాలి. ఇలా తయారైన వడియాలు ఏడాదంతా నిల్వ ఉంటాయి. భోజనానికి పదిమినిషాల ముందు నూనెలో వేయించుకుంటే కరకరలాడే వడియాలు రెడీ. గమనిక: 1. వడియాల మిశ్రమం వేడి తగ్గిన తర్వాత పూర్తిగా చల్లారే లోపు వడియాలు పెట్టేయాలి. మరీ చల్లారితే మిశ్రమం గట్టి పడిపోయి స్పూన్‌తో తీసి వస్త్రం మీద పెట్టేటప్పుడు స్పూన్‌ను వదలకుండా ఇబ్బంది పెడుతుంది. 2. వడియాలు పెట్టడానికి నూలు వస్త్రం లేకపోతే పాలిథిన్ షీట్ మీద పెట్టవచ్చు. మినప్పప్పు వడియాలు కావలసినవి: చాయ మినప్పప్పు – అర కేజీ పచ్చిమిర్చి – 4 అల్లం – అంగుళం ముక్క జీలకర్ర – టేబుల్ స్పూన్ ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ఇంగువ – పావు స్పూన్ నూనె – వేయించడానికి సరిపడినంత తయారీ విధానం: మినప్పప్పును శుభ్రంగా కడిగి మంచినీటిలో నాలుగు గంటలసేపు నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని వంపేసి పప్పును వెట్గ్రైండర్లో రుబ్బాలి (మిక్సీలో గ్రైండ్ చేస్తే వడియం గట్టిగా వస్తుంది, రుచిగా ఉండదు). పప్పు మెదిగేలోపు అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేయాలి. మెత్తగా మెదిగిన తర్వాత జీలకర్ర, ఇంగువ వేసి రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేస్తే వడియాల మిశ్రమం రెడీ. నూలు వస్త్రాన్ని తడిపి దానిమీద వడియాల మిశ్రమాన్ని టీ స్పూన్‌తో పెట్టాలి. రెండు రోజులు ఎండిన తర్వాత వస్త్రానికి వెనుక వైపు నీటిని చల్లి వడియాలను వలవాలి. వలిచిన వడియాలను మళ్లీ ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేయాలి. గమనిక: మినప వడియాలను వేయించేటప్పుడు ఒకింత జాగ్రత్త అవసరం. నూనె బాగా వేడెక్కిన తర్వాత వడియాలను వేసి మంట మీడియంలోకి మార్చాలి. అప్పుడు వడియం లోపల కూడా చక్కగా సమంగా ఎర్రగా వేగుతుంది. మంట తగ్గించకపోతే... వడియం బయటి వైపు ఎర్రగా వేగినప్పటికీ లోపల పచ్చిదనం తగ్గదు. లోపల కూడా వేగేవరకు ఉంచితే వడియం అంచులు మాడిపోతాయి. మరో విషయం... ఈ వడియాలను వేయించి అలాగే తినవచ్చు, కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఇవి చదవండి: Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం -
Recipe: బంగాళదుంప, శనగపిండి, బియ్యప్పిండితో మరమరాల పకోడా!
మరమరాలు, బంగాళదుంప, శనగపిండి, బియ్యప్పిండితో ఇలా పకోడాలు తయారు చేసుకోండి. మరమరాల పకోడా తయారీకి కావలసినవి: ►మరమరాలు – రెండున్నర కప్పులు ►ఉల్లిపాయ ముక్కలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి ముక్కలు – రెండు టీ స్పూన్లు ►బంగాళదుంప – 1 (ఉడికించి, ముద్దలా చేసుకోవాలి) ►కొత్తిమీర తురుము – పావు కప్పు ►అల్లం తురుము – అర టీ స్పూన్ ►శనగపిండి – పావు కప్పు, ►బియ్యప్పిండి – రెండున్నర కప్పులు ►వేరుశనగలు – టేబుల్ స్పూన్ (కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి) ►కారం, ధనియాల పొడి – టీ స్పూన్ చొప్పున ►ఉప్పు – తగినంత ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. మరమరాలు, బంగాళదుంప ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, అల్లం తురుము, శనగపిండి, బియ్యప్పిండి, వేరుశనగల మిశ్రమం, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ►నూనె వేడి చేసుకుని.. పకోడాలా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ -
Beauty: బియ్యప్పిండి.. తేనె.. ట్యాన్ తగ్గుముఖం పట్టడం ఖాయం!
Honey Pack Benefits: ట్యాన్ తొలగి ముఖారవిందం ద్విగుణీకృతం కావాలా? సహజసిద్దమైన నిగారింపుతో మెరిసిపోవాలా? అయితే, తేనెతో వీటిని కలిపి ముఖానికి అప్లై చేయండి. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పెరుగుతో ►రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూను తేనె తీసుకుని బాగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ►పదిహేను నిమిషాల తరువాత కడగాలి. పసుపులో కలిపి ►టీ స్పూను తేనెలో అర టీస్పూను పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి ►ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ►ఈ రెండు ప్యాక్‌లను వారానికి మూడు సార్లు వేయడం వల్ల చర్మం మృదువుగా మారడమేగాక, ఆరోగ్యంగా ఉంటుంది. సహజసిద్ధ నిగారింపు ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి ►పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ►బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. ►రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది. చదవండి: Beauty Tips: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
Beauty: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే
ముఖం మీద నల్ల మచ్చలు, ట్యాన్ కారణంగా ఇబ్బంది పడతారు చాలామంది. అలాంటి వారు ఈ చిట్కాను ట్రై చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. మెరిసే చర్మం సొంతమవుతుంది. బియ్యం, రోజ్‌వాటర్‌తో పాటు.. ►అర కప్పు బియ్యంలో కాస్త రోజ్‌వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ►ఉదయాన్నే రోజ్వాటర్తోపాటు బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ►దీనిలో ఎనిమిది కుంకుమపువ్వు రేకులు, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్ వేసి చక్కగా కలుపుకోవాలి. ►మిశ్రమం క్రీమ్‌లా మారేంతవరకు కలుపుకుని గాజుసీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. ►రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. ►ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ►క్రమం తప్పకుండా వారం రోజుల పాటు క్రీమ్ రాసుకోవడం వల్ల నల్లమచ్చలు, ట్యాన్ తగ్గి, ముఖచర్మం కాంతిమంతంగా మారుతుంది. చర్మం తాజాగా ఉండేందుకు.. రోజ్ వాటర్ ముఖానికి పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. కాటన్ బాల్‌ను రోజ్ వాటర్‌లో ముంచి ముఖం మీద అద్దాలి. తరచుగా ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖ చర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకుని.. చర్మం తాజాగా కనిపిస్తుంది. చదవండి: Chicken Eggs: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా? Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో.. -
Recipe: రుచికరమైన కొబ్బరి వడల తయారీ ఇలా!
కొబ్బరి వడలు ఇలా తయారు చేసుకోండి. కొబ్బరి వడల తయారీకి కావలసినవి: ►కొబ్బరి కోరు – అర కప్పు ►బియ్యం – 1 కప్పు (నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టాలి) ►జీలకర్ర – 1 టీ స్పూన్ ►బియ్యప్పిండి – 1/3 కప్పు ►ఉప్పు – తగినంత ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా మిక్సీ బౌల్లో నానబెట్టిన బియ్యం, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ►అనంతరం అందులో కొబ్బరికోరు, ఉప్పు వేసుకుని.. ఈసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. దానిలో బియ్యప్పిండి వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం ఒక అరటి ఆకుపైన లేదా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ మీద చిన్నచిన్న ఉండల్ని అప్పడాల్లా ఒత్తుకుని.. కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. ►ఇవి నూనెలో పడగానే పూరీల్లా పొంగుతాయి. వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. ! ఇవి కూడా ట్రై చేయండి: Kalakand Laddu Recipe: దాల్ బనానా ఖీర్, కలాకండ్ లడ్డూ తయారీ ఇలా! Recipes: శాగూ కేసరి.. పన్నీర్ వైట్ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి! -
తులసి ఆకుల గుజ్జు, శనగపిండి.. మోము మెరిసేలా!
మోము మెరుపు కోసం మార్కెట్టులో దొరికే లోషన్లు, క్రీముల వంటివి ఎన్ని కొనుగోలు చేసి వాడినా... తాత్కాలిక మెరుపు తప్ప శాశ్వతమైన కాంతి సొంతం కాదంటున్నారు. అందుకే ముఖసౌందర్యానికి కాస్త సమయాన్ని వెచ్చిస్తే సరిపోతుంది. కావల్సినవి: క్లీనప్ : రోజ్ వాటర్ – 2 టీ స్పూన్లు; స్క్రబ్ : బియ్యప్పిండి – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు; మాస్క్: తులసి ఆకుల గుజ్జు – 1 టీ స్పూన్, కమలా జ్యూస్ – అర టీ స్పూన్, శనగపిండి – 1 టీ స్పూన్ తయారీ: ►ముందుగా మెత్తని క్లాత్ తీసుకుని.. రోజ్ వాటర్‌తో ముఖం, మెడ క్లీన్ చేసుకోవాలి. ►ఇప్పుడు బియ్యప్పిండి, కీరదోస గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ►తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ►ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, కమలా జ్యూస్, శనగపిండి కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి. ►ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ►ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడంతో పాటు రోజుకు మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. చదవండి: Summer Tips: స్విమ్ చేస్తే చర్మం పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి! -
డబ్బాల్లో పెట్టండి
రిజర్వేషన్ చేయించుకున్నవాళ్లు మీ ఇంటికొస్తారు. పండగను మీరు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారు. మరి... మీ కోసం, వచ్చేవారి కోసం ఇప్పటి నుంచి వండి డబ్బాల్లోకి ఎత్తకపోతే ఎలా? సంక్రాంతి అంటే... పొయ్యి వెలిగించడం, తీపిని తగిలించడం. అరిసెలు, గోరు మీఠీలు, బెల్లం కొమ్ములు, ఫేణీలు ఇవన్నీ నిల్వ ఉండే పిండి వంటలు. ఎన్నాళ్లైనా పాడవకుండా తినడానికి వీలుగా ఉంటాయి. మరి రెడీ చేసుకోండి. సకినాలు కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నువ్వులు – అర కప్పు; వాము – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీటిని ఒంపేయాలి ►బియ్యాన్ని పొడి వస్త్రం మీద పావు గంట సేపు నీడలో ఆరబెట్టాలి (పూర్తిగా తడిపోకూడదు) ►ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి, జల్లెడ పట్టాలి ►ఒకటిన్నర కప్పుల పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఉప్పు, వాము, నువ్వులు జత చేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేస్తూ, జంతికల పిండిలా కలిపి, వస్త్రంతో మూసి ఉంచాలి ►కొద్ది కొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, సకినాలు మాదిరిగా చుట్టాలి (పిండి ఎండినట్టుగా అనిపిస్తే, కొద్దికొద్దిగా తడి చేసుకోవాలి) ►మొత్తం పిండిని సకినాలుగా ఒత్తి, సుమారు రెండు గంటల పాటు ఆరనివ్వాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ►ఒత్తి ఉంచుకున్న సకినాలను అట్లకాడ సహాయంతో జాగ్రత్తగా తీసి, కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అరిసెలు కావలసినవి: బియ్యం – 600 గ్రా.; బెల్లం – 300 గ్రా.; నీళ్లు – 50 మి.లీ.(సుమారుగా); ఏలకుల పొడి – అర టీ స్పూను; నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి ►ఉదయాన్నే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి, జల్లెడలో వేసి నీళ్లు మొత్తం పూర్తిగా కారిపోయేవరకు ఉంచాలి ►బియ్యాన్ని కొద్దికొద్దిగా చిన్న మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టి, జల్లెడ పట్టి, మెత్తటి పిండిని చేతితో గట్టిగా నొక్కి పక్కన ఉంచాలి (తడి ఆరిపోకూడదు) పాకం తయారీ: ►ఒక గిన్నెలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగే వరకు ఉంచాలి ►పాకం అడుగు అంటకుండా మధ్యమధ్యలో తిప్పుతూ ఉండాలి ►ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి, అందులో పాకం వేస్తే అది కరిగిపోకుండా, ఉండలా అయితే, పాకం సరిగ్గా తయారయినట్లు లెక్క ►మంట సిమ్‌లోకి ఉంచి, నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి స్టౌ కట్టేసి గిన్నె కిందకు దింపాలి ►బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ పిండి గట్టిగా అయ్యేవరకు కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మంటను మీడియంలో ఉంచాలి ►పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని, నూనె పూసిన ప్లాస్టిక్ పేపర్ మీద ఉంచి, చేతితో ఒత్తి, కాగిన నూనెలో వేసి పైకి తేలేవరకు కదపకుండా ఉంచాలి ►పైకి తేలాక ఒక నిమిషం పాటు ఆగి, రెండో వైపుకి తిప్పాలి ►బంగారు రంగులోకి మారేవరకు వేయించి, బయటకు తీసి, రెండు గరిటెల మధ్యన కాని, అరిసెల చట్రంతో కాని నూనె పోయేవరకు గట్టిగా ఒత్తాలి (నువ్వుల అరిసెలు కావాలంటే, పిండిని కలుపుతున్నప్పుడే నువ్వులు కూడా వేసి కలిపేయాలి) బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. గోరు మీఠీలు కావలసినవి: నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; మైదా పిండి – పావు కేజీ; బొంబాయి రవ్వ – 3 టేబుల్ స్పూన్లు; బటర్ – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; బెల్లం పొడి/పంచదార – పావు కేజీ. తయారీ: ►ఒక పాత్రలో మైదా పిండి, బటర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలపాలి ►నూనె జత చేసి బాగా కలిపి, పిండి మృదువుగా అయిన తరవాత, బొంబాయి రవ్వ జత చేసి పిండిని మరోమారు కలిపి, గిన్నె మీద పల్చటి వస్త్రం వేసి, సుమారు అర గంట సేపు నానబెట్టాలి ►నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకుని, చేతి గోటితో గోరు మీఠీలాగ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచిన గోరు మీఠీలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►వేరొక పాత్రలో బెల్లం పొడి/పంచదారకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చే వరకు కలపాలి ►ఏలకుల పొడి, కొద్దిగా నెయ్యి జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి ►తయారుచేసి ఉంచుకున్న గోరుమీఠీలను ఇందులో వేసి, పై నుంచి కిందకు కదపాలి ►చల్లారాక, గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. రిబ్బన్లు కావలసినవి: సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – రెండు టీ స్పూన్లు; పచ్చి మిర్చి – 6; ఉల్లి తరుగు – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►మిక్సీలో పచ్చి మిర్చి, ఉల్లి తరుగు, అల్లం తురుము వేసి మెత్తగా ముద్దలా చేయాలి ►ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి ►కరిగించిన నేతిని వేసి మరోమారు కలపాలి ►ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి, అందులో పచ్చి మిర్చి మిశ్రమం వేసి బాగా కలియబెట్టి, నీటిని వడకట్టి, సెనగ పిండి మిశ్రమంలో ఆ నీటిని పోస్తూ జంతికల పిండిలా కలుపుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ►జంతికల గొట్టంలో రిబ్బన్ల ప్లేటు ఉంచాలి ►సెనగ పిండి మిశ్రమం ఉంచి, కాగుతున్న నూనెలో రిబ్బన్లు పడేలా జంతికల గొట్టం తిప్పాలి ►బాగా వేగిన తరవాత పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. సర్వ పిండి కావలసినవి: బియ్యప్పిండి – అర కేజీ; ఉప్పు – తగినంత; కారం – ఒక టీ స్పూను; పల్లీలు – 4 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – మూడు టేబుల్ స్పూన్లు (మూడు గంటలసేపు నానబెట్టాలి); నూనె – తగినంత; సన్నగా తరిగిన కొత్తిమీర – అర కప్పు; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; సన్నగా తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు; నువ్వులు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ►ఒక పాత్రలో బియ్యప్పిండి, నానబెట్టిన సెనగ పప్పు, పల్లీలు, పచ్చి మిర్చి తరుగు, నువ్వులు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం వేసి కలపాలి ►తగినన్ని వేడి నీళ్లు జత చేస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ►ఒక బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి మొత్తం బాణలి అంతా పట్టేలా చేతితో సరిచేయాలి ►కలిపి ఉంచుకున్న పిండిని జామకాయ పరిమాణంలో తీసుకుని, బాణలిలో ఉంచి, మధ్యమధ్యలో చేతికి నూనె పూసుకుంటూ, పిండిని పల్చగా అయ్యేలా ఒత్తిన తరవాత నాలుగైదు చోట్ల రంధ్రాలు చేసి, అక్కడక్కడ నూనె పోసి, స్టౌ మీద ఆ బాణలి ఉంచి, పైన మూత పెట్టి, బాగా కాలేవరకు ఉంచాలి (మధ్యమధ్యలో మూకుడు కదుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోతుంది) ►మూకుడు నుంచి విడిపడిన తరవాత ప్లేటులోకి తీసుకోవాలి (తిరగవేయాల్సిన అవసరం లేదు). బెల్లం కొమ్ములు కావలసినవి: సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – 3 టేబుల్ స్పూన్లు; బెల్లం – అర కేజీ; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి వేసి తగినన్ని నీళ్లు జత చేసి జంతికల పిండి మాదిరిగా కలుపుకోవాలి ►కొద్దిగా నెయ్యి జత చేసి మరో మారు కలపాలి ►జంతికల గొట్టంలో లావుగా ఉండే జంతికల ప్లేటు ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని జంతికల గొట్టంలో ఉంచి, నూనెలో జంతికల మాదిరిగా చుట్టాలి ►బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి, ప్లేటులోకి తీసుకుని, పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి ►ఒక పెద్ద గిన్నెలో (మందంగా ఉండే గిన్నె) బెల్లం పొడి, తగినన్ని నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలియబెట్టాలి ►ఏలకుల పొడి, నెయ్యి జత చేసి బాగా కలిపి దింపేయాలి ’ జంతిక కొమ్ముల మీద ఈ పాకాన్ని పోసి బాగా కలపాలి ►బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి ►ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఫేణీలు కావలసినవి: మైదా పిండి – అర కేజీ; పంచదార – అర కేజీ; నెయ్యి – పావు కేజీ; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; డ్రైఫ్రూట్స్ తరుగు – పావు కప్పు తయారీ: ►ఒక పెద్ద పాత్రలో మైదా పిండి వేసి తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి ►నెయ్యి జత చేసి పిండిని ఎక్కువ సేపు మర్దన చేస్తూ మెత్తగా అయ్యేవరకు కలపాలి ►నీరు గట్టిగా పిండేసిన తడి వస్త్రాన్ని పిండి గిన్నె మీద మూతలా వేసి అర గంట సేపు పక్కన ఉంచాక, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ►ఒక్కో ఉండను తీసుకుని పూరీలా ఒత్తాక పైన కొద్దిగా నెయ్యి వేసి మరో పూరీ దాని మీద ఉంచాలి ►ఈ విధంగా నాలుగు పూరీలకు ఒక దాని మీద ఒకటి ఉంచి గట్టిగా ఒత్తాలి ►మందంగా ఒత్తాక, ఒక కొస నుంచి లోపలికి రోల్ చేసుకుంటూ రావాలి ►రోల్ చేసుకున్న తరవాత ముక్కలుగా కట్ చేయాలి ►ఒక్కో ముక్కను మళ్లీ పూరీలా ఒత్తుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న పూరీలను నూనెలో వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి ►ఒక గిన్నెలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు కలిపాక, ఏలకుల పొడి వేసి కలిపి దింపేయాలి ►వేయించిన పూరీలను పంచదార పాకంలో వేసి బాగా ముంచి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►పాకం గట్టిపడకుండానే, పూరీల మీద డ్రైఫ్రూట్స్ చల్లి, ప్లేటులో ఉంచాలి. -
దహీ బల్లా
కావలసినవి: మినప్పప్పు – అర కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; తాజా పెరుగు – 2 కప్పులు; దానిమ్మ గింజలు – అర కప్పు; గ్రీన్ చట్నీ – అర కప్పు; సెనగలు – అర కప్పు (నానబెట్టాలి); బంగాళ దుంప – 1 (పెద్దది); చాట్ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; మిరపకారం – తగినంత; ఉప్పు – తగినంత తయారీ: మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటలపాటు నానబెట్టి, నీళ్లు ఒంపేసి, మినప్పప్పును గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాలి ►జీలకర్ర, ఇంగువ జత చేసి మరోమారు గ్రైండ్ చేయాలి ►మధ్యమధ్యలో నీళ్లు జత చేయాలి ►మెత్తగా రుబ్బిన పిండిని గిన్నెలోకి తీసుకోవాలి (పిండి పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యప్పిండి కాని బొంబాయి రవ్వ కాని జత చేయాలి) ►బాణలిలో నూనె పోసి కాగాక మంట కొద్దిగా తగ్గించాలి ►కొద్దికొద్దిగా పిండి తీసుకుని నూనెలో వడ మాదిరిగా వేసి వేయించాలి ►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►నూనెను పేపర్ పీల్చుకున్నాక ఈ వడలను నీళ్లలో వేసి అరగంట సేపు నానబెట్టాలి ఒక పాత్రలో పెరుగు వేసి కవ్వంతో గిలకొట్టాలి ►నానబెట్టిన వడలను నీటిలో నుంచి తీసి పెరుగులో వేసి, ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి ►ఒక పాత్రలో ఉడికించిన బంగాళ దుంప ముక్కలు, ఉడికించిన సెనగలు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, దానిమ్మ గింజలు, చాట్ మసాలా, మిరపకారం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి ►వడలను ఫ్రిజ్‌లో నుంచి తీసి ఒక ప్లేట్లో ఉంచాలి ►బంగాళ దుంప మిశ్రమం, కొత్తిమీర తరుగులతో అలంకరించి అందించాలి. -
పాదాల సంరక్షణకు...
వెడల్పాటి బేసిన్లో... వేడినీరు, ఉప్పు, నిమ్మకాయరసం వేసి, అందులో పాదాలను అరగంటసేపు ఉంచి, బ్రష్‌తో రుద్దాలి. ఇలా తరచు చేస్తుండ్రం వల్ల కాలి పగుళ్లు పూర్తిగా పోతాయి.కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని వేసి చిక్కగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పాదాలకు ప్యాక్‌లా వేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. నెలరోజుల పాటు ఇలా చేస్తే పాదాల పగుళ్లు మాయమైపోతాయి. ఎండ వల్ల ఏర్పడిన నలుపూ పోతుంది.పగుళ్లు ఉన్న చోట మెత్తగా రుబ్బిన గోరింటాకు పెట్టి, ఎండాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే క్రమంగా పగుళ్లు తగ్గుముఖం పడతాయి. -
సహజ కాంతి!
బియ్యప్పిండిలో కొద్దిగా పసుపు, నువ్వుల నూనె, కొద్దిగా నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, సున్నితంగా రుద్దాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. అవాంఛిత రోమాలు తగ్గుతాయి. చర్మం మృదువుగా అవుతుంది. పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలం చర్మం కాంతిమంతం అవుతుంది. టీ స్పూన్ టొమాటో గుజ్జు, సెనగపిండి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్ల మీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్లకింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.