ఎండలు ముదురుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు చెమటలు విసిగిస్తాయి. దీంతో శ్రద్ధగా వంట చేయాలంటే చాలా కష్టం. ఎంత తొందరగా పని ముగించుకుని వంటింట్లోంచి బైటపడదామా అని పిస్తుంది. అందుకే దీని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే చమటరూపంలో ఎక్కువ నీరు పోవడం వల్ల, దాహంఎక్కువ కావడం వల్ల, శరీరం తొందరగా వేడెక్కుతుంది. మరి శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంతోపాటు పోషకాలు అందించే కొన్ని పప్పులు గురించి తెలుసుకుందామా!
వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. పెసరపప్పు, శనగ పప్పు, మినపప్పు, సోయా, బఠానీ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. పెసరపప్పు మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుది. ఎక్కువ చలవ చేస్తుంది.
పెసరపప్పు: వేసవికాలంలో ముందుగా గుర్తొచ్చేది పెసరప్పు చేసుకొనే పెసరకట్టు. తేలిగ్గా జీర్ణం అయ్యేలా.. అల్లం, పచ్చిమర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలతో.. కమ్మ కమ్మగా ఉండేలా దీన్ని చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పు-మెంతికూర, బీరకాయ-పెసరపప్పు, పొట్లకాయ-పెసరపప్పు ఇలా రకరకాల కాంబినేషన్స్‌లో దీన్ని తీసుకోవచ్చు.
ఈ పప్పులో ప్రోటీన్, విటమిన్ ఎ, బి, సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాయధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేసవిలో పెసరపప్పు చలవచేస్తుందని గర్భధారణ సమయంలో కూడా దీన్ని భేషుగ్గా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతారు..
మినపప్పు: ఇది వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ ,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మంచి ఐరన్ లభిస్తుంది. కడుపు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పోపులు, పచ్చళ్లలో వాడటంతోపాటు, ఇడ్లీ, దోస, వడ లాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు.
సోయాబీన్: వేసవిలో సోయాబీన్ పప్పు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, శక్తి, కాల్షియం, పొటాషియం అందుతాయి. మినపప్పు ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు ,కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి.
శనగ పప్పు: ఇదిజీర్ణం కావడం కష్టమని, శరీరంలో వేడి పెంచుతుందని వేసవిలో చాలా మంది దీన్ని తినరు. కానీ వేసవిలో ఈ పప్పు తింటే మేలు జరుగుతుంది. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం , కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల వేసవిలో కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నానపెట్టిన శనగలని అల్పాహారంగా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అయితే తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి.
నోట్. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు పప్పుల్లో కూడా కల్లీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కల్తీని జాగ్రత్తగా గమనిస్తూ శ్రేష్ఠమైన పప్పులను ఎంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment