ఎండలో వెళ్తున్నారా.. జాగ్రత్త!
అప్రమత్తంగా ఉంటేనే మేలు..
వడదెబ్బతో ప్రాణాలకే ముప్పు!!
డీఎంహెచ్‌వో పుప్పాల శ్రీధర్..
ప్రతీచోట 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ తగలడం ఖాయం. జాగ్రత్తలు పాటించకుండా ఎండలో తిరిగితే శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దానిని నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఎండలో వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ పలు అంశాలు వెల్లడించారు. ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి: ఎండలో వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమవుతుంది. ఎండకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్తే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. టోపీ, తలపాగానైనా తప్పకుండా ధరించాలి.
సాక్షి: వడదెబ్బకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. కొబ్బరినీరు, గ్లూకోజ్, సల్ల, ఓఆర్‌ఎస్ నీటిని తాగించాలి. ఫ్యాన్ గాలి బాగా తగిలేలా చూడాలి. దుస్తులను వదులుగా చేసి తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. మనిషికి తగినంత గాలి ఆడేలా చేయాలి. చుట్టూరా మంది గుమిగూడకూడదు. ఉప్పు కలిపిన ద్రవాలు, ఓఆర్‌ఎస్ ద్రావణం తాగించాలి. కీరదోస ముక్కలు ఎక్కువగా తినిపించాలి.
సాక్షి: వడదెబ్బకు ఎలా గురవుతారు.. లక్షణాలేంటి..?
డీఎంహెచ్‌వో: తీవ్రమైన వడగాలులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. వడదెబ్బకు గురైన వ్యక్తి నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటిని కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు.
సాక్షి: వడదెబ్బకు గురైన వ్యక్తిలో కలిగే మార్పులేంటి.. ఆ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: వేడికి శరీరం ఎక్కువసేపు గురికావడం వల్ల సోడియంక్లోరైడ్, నీటి నిష్పత్తి తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో పనిచేసినప్పుడు ప్రతి గంటకు 3 నుంచి 4 లీటర్ల నీటిని చెమట రూపంలో కోల్పోతుంటారు. ఇలాంటి సమయంలో నీరు బాగా తీసుకోవాలి.
సాక్షి: వడదెబ్బ ప్రమాదకరమేనా? అత్యవసర సమయంలో వెళ్లాల్సి వస్తే ఎలా?
డీఎంహెచ్‌వో: వడదెబ్బ చాలా ప్రమాదకరం. మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం హైపోతలామస్ దెబ్బతిని వడదెబ్బకు గురవుతారు. దీనినే సన్‌స్ట్రోక్, హీట్‌స్ట్రోక్ అంటారు. బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ పడకుండా చూసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగకూడదు.
సాక్షి: ప్రథమ చికిత్స ఏంటి? ఎలా ఇవ్వాలి?
డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకోవాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను తాగించడంతో పాటు చల్లని ప్రాంతంలో పడుకోబెట్టాలి. ముఖ్యంగా 65ఏళ్లు పైబడిన వారు బయటకు వెళ్లరాదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు, ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు, ముఖ్యంగా గుండెజబ్బులు, బీపీ ఉన్న వారు వెళ్లవద్దు.
సాక్షి: వైద్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఎంహెచ్‌వో: ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కువ సమయం చల్లని ప్రదేశాల్లో ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు సంబంధించిన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రికి వెళ్తే చికిత్స అందిస్తారు. తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
సాక్షి: ఎండలో వెళ్లాల్సి వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: ముఖ్యంగా ఎండకాలంలో వేడి కలిగించే పదార్థాలు తినకూడదు. కూల్‌డ్రింక్స్ అసలే తాగొద్దు. కూల్‌డ్రింక్స్ ప్రమాదకరం. మజ్జిగ, కొబ్బరినీరు మాత్రమే తీసుకోవాలి. వీలైతే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తాగాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిగా చేసి అరస్పూన్ పొడిని గ్లాస్ నిమ్మరసంలో కలిపి ఉప్పు, చక్కెర వేసుకుని తాగితే ఎనర్జీగా ఉంటుంది.
- పుప్పాల శ్రీధర్, జిల్లా వైద్యాధికారి
ఇవి చదవండి: Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు
Comments
Please login to add a commentAdd a comment