Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా.. Summer Season: Steps To Prevent Dehydration In Summer | Sakshi
Sakshi News home page

Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా..

Published Sat, Mar 30 2024 8:52 AM | Last Updated on Sat, Mar 30 2024 8:52 AM

Summer Season: Steps To Prevent Dehydration In Summer - Sakshi

వేసవిలో సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్య డీ హైడ్రేషన్‌. సరైన సమయంలో గుర్తించకపోతే ఇదిప్రాణాపాయానికి కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదు. శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగాలంటే ద్రవపదార్థాలు తగినన్ని ఉండడం అవసరం. ఒకోసారి రకరకాల కారణాల వల్ల శరీరంలోని ద్రవపదార్థాలు ముఖ్యంగా నీటి శాతం బాగా తగ్గిపోయి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఒకోసారిప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు మరీ ఎక్కువ. అందువల్ల డీ హైడ్రేషన్‌ని నివారించేందుకు ఈ చిట్కాలు.

డీ హైడ్రేషన్‌ గురికాకుండా ఉండాలంటే కనీసం రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. దాహంగా అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే నీరు తాగాలి. డీహైడ్రేషన్‌ కు గురయ్యామని సూచించే మొట్ట మొదటి సంకేతం ’దాహం’ అనిపించటం.

డీ హైడ్రేషన్‌ను ఎలా గుర్తించాలంటే..? 
నోరంతా పొడిబారినట్లు, బుగ్గల చుట్టూ ఇసుక అట్ట కట్టినట్లుగా ఉన్నా తీవ్రమైన డీహైడ్రేషన్‌ ఎదుర్కోబోతున్నట్లు సంకేతంగా భావించాలి. తీవ్ర అలసట, నిద్ర పోవాలనే కోరిక ఉండడమూ డీ హైడ్రేషన్‌ లక్షణాలే. అలా ఉన్నప్పుడు చాలామంది నిద్రకు ఉపక్రమిస్తారు. దానికి బదులుగా వెంటనే కొంచెం మంచి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. భరించరాని తలనొప్పి కూడా డీహైడ్రేషన్‌ ను తెలియజేసే సాధారణ లక్షణం. సాధారణంగా కండర తిమ్మిర్లు శరీరంలో ఎలక్ట్రోలేట్‌ స్థాయుల అసమతుల్యతకు కారణంగా చెబుతారు. అయితే ఇది కూడా డీహైడ్రేషన్‌ ను సూచించే మరొక గుర్తు.

కొంత శారీరక శ్రమను చేసిన తర్వాత హఠాత్తుగా చెమట పట్టడం నిలిచిపోతే, వెంటనే శరీరాన్ని హైడ్రేట్‌ చేయాలి. డీహైడ్రేషన్‌ ను తెలియచేసే తీవ్రమైన సంకేతాల్లో ఇది ఒకటి.

ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం డీ హైడ్రేషన్‌కు సంకేతాలు. అలాంటప్పుడు సబ్జా నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. ఇవేవీ అందుబాటులో లేనప్పుడు కనీసం వెంటనే నీటిని తాగడం కూడా ప్రమాద నివారణకు సహకరిస్తుంది. చర్మం సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు అంటే చర్మాన్ని పట్టుకుని లాగి వదిలితే వెంటనే వెనక్కి వెళ్లకుండా పైన నిలిచినట్లుగా ఉండే ఈ సమస్యలో ఉన్నట్లే భావించాలి. అస్పష్టమైన కంటిచూపు కూడా డీహైడ్రేషన్‌ సూచించే ఒక గుర్తు.

రక్తంలో తక్కువ చక్కెర స్థాయులు ఉన్నప్పుడు కూడా అస్పష్టమైన కంటిచూపు కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా నిర్ణీత సమయానికి భోజనం చేయలేకపోతే వెంటనే గ్లూకోజ్‌ నీరు తాగాలి. సులువుగా చేయగలిగేది తగినన్ని నీళ్లు తాగడం. కనీసం అదైనా సరిగా చేస్తుంటే ప్రమాదాన్ని నివారించిన వారమవుతాం.

ఇవి చదవండి: ఈ సమ్మర్‌లో ఎనీ టైమ్‌.. ఎనీ వేర్‌.. అనిపించే డ్రెస్సులు ఇవే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement