De hydration
-
వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వేసవి కాలంలో ఎండల ప్రతాపాన్ని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఎండలో సాధారణంగా బయటికి రాకుండా ఉండటంమంచిది. అలాగే ఎక్కువ నీళ్లు తాగాలి. వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని పానీయాలను తీసుకోవాలి. ఈ విషయంలో మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా కాస్త చవగా అందరికీ అందుబాటులో ఉండేది కూడా. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూద్దాం! ► అద్భుతమైన ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాల గని మజ్జిగ. వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అధిక ఉష్ణంనుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. ► పల్చటి మజ్జిగలో నిమ్మకాయ,కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కాస్తంత కొత్తమీర, పుదీనా కలుపుకుని తాగితే మరీ మంచిది. రుచికీ రుచీ తగులుతుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ► మజ్జిగ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ► ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణసమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. సౌందర్య పోషణలో ►చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ►మజ్జిగలో పెద్ద మొత్తంలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (AHA) చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది, చర్మంపై నల్ల మచ్చలు , టాన్డ్ ప్యాచ్‌లకు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. ► కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి. ► కాల్షియం, విటమిన్స్ , ఇతరపోషక విలువల కారణంగా మజ్జిక కొన్ని రకాల జబ్బులను నివారిస్తుంది. -
Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా..
వేసవిలో సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్య డీ హైడ్రేషన్. సరైన సమయంలో గుర్తించకపోతే ఇదిప్రాణాపాయానికి కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదు. శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగాలంటే ద్రవపదార్థాలు తగినన్ని ఉండడం అవసరం. ఒకోసారి రకరకాల కారణాల వల్ల శరీరంలోని ద్రవపదార్థాలు ముఖ్యంగా నీటి శాతం బాగా తగ్గిపోయి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఒకోసారిప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు మరీ ఎక్కువ. అందువల్ల డీ హైడ్రేషన్‌ని నివారించేందుకు ఈ చిట్కాలు. డీ హైడ్రేషన్ గురికాకుండా ఉండాలంటే కనీసం రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. దాహంగా అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే నీరు తాగాలి. డీహైడ్రేషన్ కు గురయ్యామని సూచించే మొట్ట మొదటి సంకేతం ’దాహం’ అనిపించటం. డీ హైడ్రేషన్‌ను ఎలా గుర్తించాలంటే..? నోరంతా పొడిబారినట్లు, బుగ్గల చుట్టూ ఇసుక అట్ట కట్టినట్లుగా ఉన్నా తీవ్రమైన డీహైడ్రేషన్ ఎదుర్కోబోతున్నట్లు సంకేతంగా భావించాలి. తీవ్ర అలసట, నిద్ర పోవాలనే కోరిక ఉండడమూ డీ హైడ్రేషన్ లక్షణాలే. అలా ఉన్నప్పుడు చాలామంది నిద్రకు ఉపక్రమిస్తారు. దానికి బదులుగా వెంటనే కొంచెం మంచి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. భరించరాని తలనొప్పి కూడా డీహైడ్రేషన్ ను తెలియజేసే సాధారణ లక్షణం. సాధారణంగా కండర తిమ్మిర్లు శరీరంలో ఎలక్ట్రోలేట్ స్థాయుల అసమతుల్యతకు కారణంగా చెబుతారు. అయితే ఇది కూడా డీహైడ్రేషన్ ను సూచించే మరొక గుర్తు. కొంత శారీరక శ్రమను చేసిన తర్వాత హఠాత్తుగా చెమట పట్టడం నిలిచిపోతే, వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. డీహైడ్రేషన్ ను తెలియచేసే తీవ్రమైన సంకేతాల్లో ఇది ఒకటి. ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం డీ హైడ్రేషన్‌కు సంకేతాలు. అలాంటప్పుడు సబ్జా నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. ఇవేవీ అందుబాటులో లేనప్పుడు కనీసం వెంటనే నీటిని తాగడం కూడా ప్రమాద నివారణకు సహకరిస్తుంది. చర్మం సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు అంటే చర్మాన్ని పట్టుకుని లాగి వదిలితే వెంటనే వెనక్కి వెళ్లకుండా పైన నిలిచినట్లుగా ఉండే ఈ సమస్యలో ఉన్నట్లే భావించాలి. అస్పష్టమైన కంటిచూపు కూడా డీహైడ్రేషన్ సూచించే ఒక గుర్తు. రక్తంలో తక్కువ చక్కెర స్థాయులు ఉన్నప్పుడు కూడా అస్పష్టమైన కంటిచూపు కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా నిర్ణీత సమయానికి భోజనం చేయలేకపోతే వెంటనే గ్లూకోజ్ నీరు తాగాలి. సులువుగా చేయగలిగేది తగినన్ని నీళ్లు తాగడం. కనీసం అదైనా సరిగా చేస్తుంటే ప్రమాదాన్ని నివారించిన వారమవుతాం. ఇవి చదవండి: ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే -
కాఫీ ఎక్కువైతే.. కంగారే!
పొద్దున లేవగానే కాఫీ చుక్క గొంతులో పడనిదే రోజు గడవదు చాలామందికి. కానీ అదే కాఫీ పరిమితి మించితే మాత్రం కంగారు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి కంటి దాకా ఎన్నో సమస్యలనూ కాఫీ తెచ్చిపెడుతుందని ఈ అంశంపై పరిశోధనలు చేసిన ఈస్తటిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ అహ్మద్ ఎల్ మాంటసర్ హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటి.. వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగంటే.. వయసు పెరిగిపోద్ది.. బాగా వర్క్ ప్రెషర్తోనో, ఇంకేదో ఒత్తిడితోనో కాఫీ తెగ తాగేస్తూ ఉంటాం. చిత్రమేంటంటే.. కాఫీ ఎక్కువైతే కిడ్నీలు కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. మరి ఈ కార్టిసాల్‌తో మన చర్మంలోని గ్రంధుల నుంచి నూనె స్రావాలు పెరుగుతాయని.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. మొటిమలు, ఇతర సమస్యలు వస్తాయని మాంటసర్ చెప్తున్నారు. దీనికితోడు ఆల్కహాల్ తరహాలోనే కెఫీన్ అధికంగా తీసుకుంటే.. డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని, చర్మం పొడిబారి కాంతివిహీనంగా మారుతుందని అంటున్నారు. అంటే.. ఈ సమస్యలతో ఎవరైనా వారి వయసుకు మించి కనబడతారని వివరిస్తున్నారు. – సాధారణంగా రోజూ తాగే నీటితోపాటు.. ప్రతి కప్పు కాఫీకి మరో గ్లాసు నీళ్లు అదనంగా తాగాలని హార్మోన్ స్పెషలిస్టు సోఫీ షాటర్ సూచిస్తున్నారు. దానివల్ల సమస్య కొంత ఉపశమిస్తుందని అంటున్నారు. రిలీఫ్ కాదు.. చిరాకు.. కాఫీ ఎక్కువైతే శరీరంలో అడ్రినల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందని.. దీనితో రక్తపోటు పెరిగి, నిద్రలేమికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సరిగా నిద్ర లేకపోవడం వల్ల మానసిక సమస్యలకు కారణమవుతుంది. కాఫీ అలవాటు ఎక్కువగా ఉన్నవారిలో 33శాతం మందికి నిద్ర సమస్య వస్తోందని పరిశోధనల్లో వెల్లడైంది కూడా. ఇక అధిక కెఫీన్ వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గి.. మానసిక ఆందోళన పెరుగుతుందని, ఏకాగ్రత తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. – కాఫీ అలవాటును నియంత్రించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోవడానికి రెండు, మూడు గంటల ముందు నుంచీ కాఫీకి దూరంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. స్ట్రోక్.. మైగ్రేన్ ప్రమాదం కూడా.. కాఫీలోని కెఫీన్‌కు వ్యసనంగా మారే లక్షణం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. కాఫీ తీసుకున్నప్పుడు మెదడు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రక్తనాళాలు సంకోచానికి గురవుతాయని.. తాగడం ఆపేసినప్పుడు వ్యాకోచించి తలనొప్పి వస్తుందని అంటున్నారు. ఇది కొందరిలో మైగ్రేన్‌కు దారితీస్తుందని వివరిస్తున్నారు. అందువల్లే తలనొప్పి అనిపించినప్పుడల్లా కాఫీ తాగుతూ.. అదో అలవాటుగా మారుతుందని పేర్కొంటున్నారు. కొందరిలో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం, కండరాలు మెలితిప్పినట్టు, తిమ్మిరిగా అనిపించడం, చేతులు వణకడం..వంటివీ తలెత్తుతాయని అంటున్నారు. – ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు కాఫీ వినియోగాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. కంటి సమస్యలకూ దారి.. అధిక కెఫీన్ రక్తపోటును పెంచడం వల్ల.. కళ్లకు రక్తాన్ని సరఫరా చేసే సన్నని రక్తనాళాలు దెబ్బతిని, కంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో రెటీనా దెబ్బతినే ప్రమాదమూ ఉంటుందని అంటున్నారు. – రోజుకు మూడు కప్పులకు మించి కాఫీ తాగితే.. కంటి సమస్యలను కొని తెచ్చుకోవడమేనని, తగ్గిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
Health Tips: నీటితో పోయేది రాయి దాకా వస్తే...
రీనల్ కాల్కులీ, నెఫ్రోలిథియాసిస్, యురోలిథియాసిస్... ఇవన్నీ మనం వాడుక భాషలో కిడ్నీ స్టోన్స్‌గా వ్యవహరించే వ్యాధుల వైద్యపరిభాష పదాలు. ఆహారంలో దేహానికి అందిన మినరల్స్, సాల్ట్స్ మూత్రం ద్వారా విసర్జితం కాకుండా ఒకచోట కేంద్రీకృతం కావడం ద్వారా ఏర్పడుతాయి. కాంపౌండ్స్‌ను బట్టి వీటిని కాల్షియం స్టోన్స్, స్ట్రక్టివ్ స్టోన్స్, యూరిక్ యాసిడ్స్టోన్స్, క్రిస్టైన్ స్టోన్స్‌గా వర్గీకరిస్తారు. ఎందుకు వస్తాయి? కొందరిలో ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ కారణమవుతుంది. దేహం డీ హైడ్రేషన్‌కు గురికావడంతోపాటు ప్రోటీన్, సోడియం, షుగర్స్ మితిమీరి తీసుకోవడం స్వీయ తప్పిదాల వల్ల ఈ సమస్య వస్తుంది. కొన్ని రకాల ఆపరేషన్ల సైడ్ ఎఫెక్ట్‌గా కూడా కిడ్నీ రాళ్లు ఏర్పడుతుంటాయి. దేహం అధిక బరువు, కొన్ని రకాల అనారోగ్యాలు, ఆ అనారోగ్యం తగ్గడానికి తీసుకునే మందులు కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి పరోక్షంగా కారణమవుతుంటాయి. ఇలా ఇబ్బంది పెడతాయి కిడ్నీలో రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మధ్యలో ఏదో ఒక చోట యూరినరీ ట్రాక్ట్‌ను ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఈ రాళ్లు సైజును బట్టి మూత్ర విసర్జన సమయంలో కొద్దిపాటి అసౌకర్యం నుంచి తీవ్రమైన నొప్పి కలిగిస్తుంటాయి. రాయి ఒరుసుకుపోవడంతో మూత్రవిసర్జన మార్గంలో గాయమవుతుంటుంది. మూత్రాశయం, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్కు కారణమవుతుంటాయి. నాళం ద్వారా బయటకు రాలేనంత పెద్ద రాళ్లు ఆ మార్గంలో ఏదో ఒక చోట స్థిరపడిపోతాయి. నిజానికి కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వెంటనే వాటి లక్షణాలు బయటకు తెలియవు. కొంతకాలం పాటు అవి స్వేచ్ఛగా మూత్రాశయం, మూత్రనాళాల మధ్య సంచరిస్తుంటాయి. మూత్రనాళం సైజ్ కంటే చిన్నవిగా ఉన్న రాళ్లు మూత్రంతోపాటు బయటకు వెళ్లిపోతుంటాయి. అంతకంటే పెద్దవైన తర్వాత మాత్రమే లక్షణాలు బహిర్గతమవుతాయి. మూత్రనాళం వాపుకు లోనవడం, కండరాన్ని పట్టినట్లు నొప్పి రావడం తొలి లక్షణాలు. పక్కటెముకల కింద ఒక పక్క నుంచి వెనుక వైపుకు తీవ్రమైన నొప్పి, ఒక్కోసారి నొప్పి షాక్ కొట్టినట్లు ఉంటుంది. పొత్తి కడుపు కింద నుంచి పాకినట్లు నొప్పి నొప్పి తీవ్రత పెరుగుతూ – తగ్గుతూ అలలు అలలుగా రావడం మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మంట వీటితోపాటు మూత్రం రంగు మారడం (రక్తం కలిసినట్లు), దుర్వాసన, తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావడం, విసర్జన తర్వాత కూడా వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు అనిపించడం, మూత్రాశయం నిండిపోయినట్లు అనిపిస్తున్నప్పటికీ కొద్దిమోతాదులో మాత్రమే విడుదల కావడం, తల తిరగడం– వాంతులు, ఇన్ఫెక్షన్ తీవ్రమై చలిజ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాయిని బట్టి చికిత్స మూత్రం పలుచగా ఉన్నప్పుడు మినరల్స్, సాల్ట్స్ అన్నీ సులువుగా బయటకు వెళ్లిపోతాయి. కానీ మూత్రం చిక్కబడినప్పుడు ఇవి ఒక చోట కేంద్రీకృతమవుతుంటాయి. కాబట్టి దేహం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీటిని తీసుకోవడం ప్రధానమైన జాగ్రత్త. చికిత విషయానికి వస్తే... రాయి కాంపౌండ్స్, సైజ్‌ను బట్టి కరిగించడం, శస్త్ర చికిత్స చేసి తొలగించడంతోపాటు లేజర్ కిరణాల ద్వారా రాయిని పలుకులుగా చేయడం అనే నొప్పి లేని పద్ధతులు కూడా పాటిస్తారు. తక్షణ వైద్యం కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు సందేహం కలిగిన వెంటనే డాక్టర్ని సంప్రదించి తీరాలి. ఎందుకంటే కొంతకాలం సొంత వైద్యం చేసుకుని వేచి చూసే పరిస్థితి కాదు. లక్షణాలు బయటపడేటప్పటికే వ్యాధి తక్షణ వైద్యం అందాల్సిన స్థితికి చేరి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఇలా ఉంటాయి. ∙నొప్పి తీవ్రమవడంతోపాటు కనీసం కూర్చోలేకపోతారు. ఈ భంగిమలో కూర్చుంటే కొంచెం ఉపశమనంగా, సౌకర్యంగా ఉంది అనడం కూడా సాధ్యం కాని స్థితి ∙నొప్పితోపాటు చలిజ్వరం ∙మూత్రంలో రక్తం పడడం, మూత్ర విసర్జన కష్టం కావడంతోపాటు నొప్పి, తలతిరగడం, వాంతులు కావడం అన్నీ ఏకకాలంలో సంభవిస్తాయి. -
వాయుసేన పైలెట్లకు ద్రవాహారం!
సాక్షి, బెంగళూరు: అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాల పైలట్లు ఎక్కువసేపు ఆకాశంలోనే విధులు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు వారిని నిర్జలీకరణం (డీహైడ్రేషన్ ) తదితర సమస్యలు వేధిస్తుంటాయి. వాటిని అధిగమించేందుకు వారికి ద్రవరూపంలో ఉండే ఆహారాన్ని ఇవ్వడానికి మైసూరులోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(డీఎఫ్ఆర్ఎల్) కృషి చేస్తోంది. ఇప్పటికే ద్రవరూప ఆహారాన్ని తయారు చేసిన సంస్థ.. దాన్ని పరీక్షిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఆహారం భారత వాయుసేనకు చెందిన విమానాల కాక్‌పీట్‌లలో చేరే అవకాశం ఉంది. డీఎఫ్ఆర్ఎల్ ప్రయోగాత్మకంగా తయారు చేసిన ద్రవరూప ఆహార పదార్థాలను బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా–17లో ప్రదర్శనకు ఉంచారు. ద్రవరూప ఆహారం తీసుకున్న వారికి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఆకలి వేయదు. మూత్రం కూడా ఉత్పత్తి కాదు. ఈ పద్ధతిలో చపాతి, చిప్స్, వెజ్ పలావ్, దాల్ కిచిడీల వంటి 110 రకాల ఆహార పదార్థాలను ద్రవ రూపంలోకి మార్చి పైలట్లకు అందజేస్తారు. ద్రవరూపంలోకి మార్చి ప్యాకింగ్ చేశాక మూడేళ్ల పాటు ఇవి నిల్వ ఉంటాయి. పరీక్షలు తుదిదశలో ఉన్నందున సానుకూల ఫలితాలొచ్చాక, సాంకేతికతను కోరుతున్న 400 కంపెనీలకు అందించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. విపత్తుల సమయంలో సైనికులు తీసుకెళ్లే లగేజీ బరువును తగ్గించడంలో భాగంగా తినగలిగిన చెంచాలు, గరిటెలు, పళ్లేలను డీఎఫ్ఆర్ఎల్ తయారు చేసింది. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి వీటిని రూపొందించింది. ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన రక్షణ మంత్రి పరీకర్ వైమానిక రంగ నిపుణులకు ఈ తినే ప్లేట్లలోనే ఆహారాన్ని వడ్డించారు.