వాయుసేన పైలెట్లకు ద్రవాహారం!
సాక్షి, బెంగళూరు: అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాల పైలట్లు ఎక్కువసేపు ఆకాశంలోనే విధులు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు వారిని నిర్జలీకరణం (డీహైడ్రేషన్ ) తదితర సమస్యలు వేధిస్తుంటాయి. వాటిని అధిగమించేందుకు వారికి ద్రవరూపంలో ఉండే ఆహారాన్ని ఇవ్వడానికి మైసూరులోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(డీఎఫ్‌ఆర్‌ఎల్) కృషి చేస్తోంది. ఇప్పటికే ద్రవరూప ఆహారాన్ని తయారు చేసిన సంస్థ.. దాన్ని పరీక్షిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఆహారం భారత వాయుసేనకు చెందిన విమానాల కాక్‌పీట్‌లలో చేరే అవకాశం ఉంది.
డీఎఫ్‌ఆర్‌ఎల్ ప్రయోగాత్మకంగా తయారు చేసిన ద్రవరూప ఆహార పదార్థాలను బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా–17లో ప్రదర్శనకు ఉంచారు. ద్రవరూప ఆహారం తీసుకున్న వారికి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఆకలి వేయదు. మూత్రం కూడా ఉత్పత్తి కాదు. ఈ పద్ధతిలో చపాతి, చిప్స్, వెజ్ పలావ్, దాల్ కిచిడీల వంటి 110 రకాల ఆహార పదార్థాలను ద్రవ రూపంలోకి మార్చి పైలట్లకు అందజేస్తారు. ద్రవరూపంలోకి మార్చి ప్యాకింగ్ చేశాక మూడేళ్ల పాటు ఇవి నిల్వ ఉంటాయి.
పరీక్షలు తుదిదశలో ఉన్నందున సానుకూల ఫలితాలొచ్చాక, సాంకేతికతను కోరుతున్న 400 కంపెనీలకు అందించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. విపత్తుల సమయంలో సైనికులు తీసుకెళ్లే లగేజీ బరువును తగ్గించడంలో భాగంగా తినగలిగిన చెంచాలు, గరిటెలు, పళ్లేలను డీఎఫ్‌ఆర్‌ఎల్ తయారు చేసింది. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి వీటిని రూపొందించింది. ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన రక్షణ మంత్రి పరీకర్ వైమానిక రంగ నిపుణులకు ఈ తినే ప్లేట్లలోనే ఆహారాన్ని వడ్డించారు.