నీటి ఎద్దడి నివారణకు చర్యలు శూన్యం
ఏజెన్సీలో మూలన పడిన మంచినీటి పథకాలు
నత్తనడకన కొత్త ప్రాజెక్టుల నిర్మాణం
అల్లాడుతున్న గిరిజనం
పట్టించుకోని అధికారులు
భద్రాచలం, న్యూస్‌లైన్
వేసవి రాకముందే పల్లెల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో అప్పుడే దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణంగానే ఉంది. మరమ్మతులకు గురైన తాగునీటి పథకాలను పునరుద్ధరించడంపై ఆ శాఖాధికారులు శ్రద్ధ చూపడం లేదు. వేసవిలో ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని తెలిసినా..ఇప్పటి వరకూ ముందస్తు ప్రణాళికలు లేకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
జిల్లాలలోని ఏజెన్సీ ప్రాంతంలో 29 మండలాల పరిధిలోని ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు సుమారు 14 వేల బోరుబావులు, 800 రక్షిత మంచినీటి పథకాలు, 400 చిన్నతరహా రక్షిత మంచినీటి పథకాలతో పాటు 6 కమ్యూనిటీ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిపైసరైన పర్యవేక్షణ లేక చాలా పథకాలు మూలన పడ్డాయి. ఏళ్ల తరబడి మరమ్మతులు లేకపోవటంతో గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులు అలంకారప్రాయమే అవుతున్నాయి. వేసవి కాలంలో భూగర్భజలాలు అడుగంటడంతో ఈ సమస్య ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సైతం దీన్ని అంగీకరిస్తున్నప్పటకీ నీటి ఎద్దడిపై తగిన కార్యాచరణ రూపొందించకపోవటం గమనార్హం.
సారూ.. వీటిపై దృష్టి సారించరూ...
మారుమూలన ఉన్న వాజేడు మండలంలో 275 చేతిపంపులు ఉండగా.. ప్రస్తుతం 100 వరకు పనిచేయటం లేదు. మూడు రక్షిత మంచినీటి పథ కాలు మరమ్మతుకు గురయ్యాయి. వాజేడులో ఇటీవల రిపేర్ పేరుతో ఏడు చేతి పంపుల గొట్టాలను బయటకు తీసి అలాగే వదిలేశారు.
కొండరెడ్లు ఎక్కువగా నివసించే వీఆర్ పురం మండలంలో 12 చేతి పంపులు పనిచేయటం లేదు. అలాగే 15 రక్షిత, మరో 15 మినీ తాగునీటి పథకాలు ప్రస్తుతం నీళ్లందించటం లేదు.
కూనవరంలో 540 చేతిపంపులు ఉండగా, ప్రస్తుతం 250 పనిచేయటం లేదు. ఎనిమిది రక్షిత మంచినీటి పథకాలు కూడా చాలా కాలంగా నిరుపయోగంగానే ఉంటున్నాయి.
దుమ్ముగూడెం మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ 950 చేతిపంపులు ఉంటే వాటిలో 350 వరకు ప్రస్తుతం ఉపయోగపడటం లేదు.
చింతూరు మండలంలో 50 చేతిపంపులు పనిచేయడం లేదు. 18 రక్షిత, మరో 6 మినీ రక్షిత పథకాలు మరమ్మతులకు గురయ్యాయి. వీటి గురించి పట్టించుకున్న నాథుడే లేడని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలం, చర్ల మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా గిరిజనులు ఎక్కువగా నివసించే గ్రామాల్లోనే తాగునీటి పథకాలు పనిచేయకున్నప్పటికీ వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఆ శాఖాధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నత్తనడకన కొత్త పథకాల నిర్మాణం....
ఏజెన్సీలో తాగునీటి సమస్యను గుర్తించిన ప్రభుత్వం కొత్తగా పథకాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా.. సంబధిత అధికారుల నిర్లక్ష్యంతో పనుల్లో పురోగతి లేదు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని దాదాపు 197 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు గాను రూ.46 కోట్లతో నిర్మించ తలపెట్టిన భారీ మంచినీటి పథకం ఏడాది కావస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ పనులకు గతేడాది శ్రీరామనవమి రోజున భద్రాచలం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిచే శంకుస్థాపన చేయించేందుకు హడావిడి చేసిన అధికారులు పనులు చేపట్టడటంతో మాత్రం తగిన శ్రద్ధ చూపలేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే మణుగూరు మండలంలో అంసపూర్తిగా మిగిలిన మంచినీటి పథకం నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరైనా, ఆ పనులు కూడా అస్తవ్యస్తంగానే సాగుతున్నాయి. కమలాపురం నుంచి అశోక్‌నగర్ వరకు పంపింగ్ వేసి అక్కడ నుంచి అశ్వాపురానికి పైప్‌లైన్‌ల ద్వారా తాగునీరందించాలనేది దీని ఉద్దేశ్యం. కానీ ఈ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి.
ముందస్తు చర్యలేవీ...
గ్రామాల్లో తాగునీటి నివారణకు ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ, సీడీపీ(ఎంపీలాడ్ ) ఏఆర్‌డబ్ల్యూఎస్, నాన్ సీఆర్‌ఎఫ్ పథకాల కింద ఏజెన్సీ ప్రాంతంలో మంజూరైన నిధులతో చేపట్టిన పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించటం లేదు. కొందరు కాంట్రాక్టర్‌లు అధికారులతో కుమ్మక్కై పనులు చేయకుండానే నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ఏడాది 700 చేతిపంపుల ఫ్లషింగ్, మరో 50 బోరుబావుల్లో పూడికతీత తదితర 869 పనులకు రూ.85.09 లక్షలు ఖర్చవుతుందని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవటంతో ఈ ఏడాది కూడా తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఏజెన్సీలో ముంచుకొస్తున్న తాగునీటి సమస్య నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
దాహం.. దాహం....
Published Tue, Feb 4 2014 3:16 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement