సాక్షి , మచిలీపట్నం : ఇంట్లో చంటోడు ఆకలితో గుక్క పెట్టాడు.. వాడికి ఒక ముద్ద అన్నం పెట్టాలి. ఎసట్లో పోయడానికి ఇంట్లో చెంబుడు నీళ్లు కూడా లేవు.. అందుకే అమ్మ.. బుంగ చేతబట్టి ఊళ్లో వాటర్ ట్యాంకర్ దగ్గరకు పరుగులు పెట్టింది.. అప్పటికే చాంతాడంత క్యూ.. చెమటలు తుడుచుకుంటూ.. అమ్మా .. పిల్లాడు ఏడుస్తున్నాడు.. ఒక్క బుంగ పట్టుకోనివ్వండమ్మా అంటూ వేడుకుంది.
ఖాళీ బిందెలతో ఎదురు చూస్తున్న మిగిలిన మహిళలు.. అసలు నీళ్లే రావడం లేదమ్మా.. అంటూ బదులిచ్చారు.. పిల్లాడి ఏడుపు గుర్తొచ్చి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. గబగబా ట్యాంకర్ వద్దకు వెళ్లి.. పైపు నోట్లోకి తీసుకుని నీళ్ల కోసం తంటాలు పడింది. పచ్చని నీళ్లు పైపులో నుంచి సన్నని ధారగా వచ్చాయి. దగ్గరగా చూస్తే ముక్కుపుటాలను బద్దలు చేస్తున్నాయి. ఇక దిక్కులేక వాటినే బిందెలో పట్టుకుని బయలుదేరింది.. ఆ నీళ్లనే వడబోసి.. కాచి వంటకు సిద్ధం చేసింది.
ఇలా మిగిలిన మహిళలూ గంటల తరబడి తమ వంతు వచ్చే వరకు ఉండి.. బిందెడు నీళ్లు పట్టుకున్నారు...‘అయ్యా..ఇదెక్కడి పాలనయ్యా.. మా నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు.. అయినా గుక్కెడు నీళ్లివ్వడం చేతకాలేదు.. వేల ఎకరాల్లో పంటలు మాత్రం తడిపామని చెబుతున్నారు.. మా ఎండిన గొంతులో బాధను మాత్రం ఒక్కసారి కూడా ఆలకించడం లేదు.
గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని మీ చేతగానితనాన్ని వెక్కిరిస్తున్న ఈ దుస్థితిని కళ్లారా చూడండయ్యా..! అంటూ వారి వేదన కన్నీటి బొట్లుగా రాలుతుండగా ఇంటి దారి పట్టారు. మచిలీపట్నం నియోజవర్గంలోని పల్లెతుమ్మలపాలెంలో మత్స్యకారుల నీటి కోసం ఇలా నిత్యం అవస్థలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment