
సాక్షి, అమరావతి : లాక్‌డౌన్, కరోనా నియంత్రణ చర్యలతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం, వేసవి సెలవులతో జూన్ 12వ తేదీ వరకు తెరుచుకునే అవకాశం లేనందున ఇంటివద్దే గడిపే పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మూడో విడత మధ్యాహ్న భోజనం సరుకులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 19 నుంచి 31 వరకు మొదటి విడతలో, ఏప్రిల్ 1వ తేదీనుంచి 23 వరకు రెండో విడతలో మధ్యాహ్న భోజనం సరుకులను విద్యార్థులకు ప్రభుత్వం అందించింది. కేవలం బియ్యంతో సరిపెట్టకుండా ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా విద్యార్థులకు పౌష్టిక విలువలతో కూడిన కోడిగుడ్లు, చిక్కీలను కూడా అందిస్తున్నారు. ఇప్పుడు వేసవిలో మూడో విడత పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు మధ్యాహ్న భోజనం పథకం, పాఠశాలల శానిటేషన్ డైరెక్టర్ చిట్టూరి శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు.
విద్యార్థులకు పౌష్టికాహారం..
►‘జగనన్న గోరుముద్ద’ ద్వారా విద్యార్థులకు అందించే మెనూ మొత్తాన్ని మార్చేసి రుచి, శుచి, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.
►35,282 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 17,78,081 మంది విద్యార్థులు చదువుతున్నారు.
►4,525 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1105148 మంది విద్యార్థులున్నారు.
►5,916 హైస్కూళ్లలో 7,26,796 మంది విద్యార్థులున్నారు.
మూడో విడత పంపిణీ ఇలా...
►ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు పనిదినాలను 40 రోజులుగా లెక్కించి మూడో విడత సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు
►ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రోజుకు 100 గ్రాముల చొప్పున 40 రోజులకు సరిపడా బియ్యం అందిస్తారు.
►6 – 10వ తరగతి వారికి రోజుకు 150 గ్రాముల చొప్పున 40 రోజులకు పంపిణీ చేస్తారు.
►గుడ్లు, చిక్కీలు అన్ని తరగతుల పిల్లలకు సమానంగా పంపిణీ చేస్తారు.
►ఒకొక్కరికి 34 కోడిగుడ్లు, 20 చిక్కీలు అందచేస్తారు.
►తొలి విడతలో మార్చి 19 నుంచి 31 వరకు 6,336.40 టన్నుల బియ్యం, 5,05,40,350 గుడ్లు, 3,24,90,225 చిక్కీలను ప్రభుత్వం విద్యార్థుల ఇళ్లకే పంపిణీ చేసింది.
►రెండో విడతలో ఏప్రిల్ 1 నుంచి 23 వరకు 4,073.40 టన్నుల బియ్యం, 2,59,92,180 గుడ్లు, 1,29,96,090 చిక్కీలు విద్యార్థులకు అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment