సాక్షి, హైదరాబాద్: రాబోయే వేసవికాలంలో తాగునీటి సరాఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాల ని అధికారులను సీఎంవో, మిషన్ భగీరథ విభాగం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంతరాయాలు లేని తాగునీటి సరాఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆవాసాలు, విద్యాసంస్థలకు నిరాటంకంగా తాగునీటి సరాఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం తాగునీటి సరాఫరాపై మిషన్ భగీరథ కార్యాలయంలో స్మితా సబర్వాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం సాగుతున్న బల్క్, ఇంట్రా సరాఫరా తీరుపై స్మితా సబర్వాల్ సంతృప్తి వ్యక్తంచేశారు. రిజర్వాయర్ల నీటి మట్టాల నిరంతర పర్యవేక్షణ ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లలో ఉన్న పంపులు, మోటార్ల వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెయిన్, సెకండరీ పైప్‌లైన్‌లలో ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే రిపేర్ చేసేలా మొబైల్ టీంలను నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.
మారుమూల, అట వీ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలు, రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ తాగునీటి సరాఫరా తీరుపై గిరిజన, సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌చోంగ్తూతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, వివిధ జిల్లాల చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment