
మాల్దీవుల్లో మస్త్ మజా...!
ఎప్పటిలానే వేసవి వేగంగా దూసుకొచ్చింది. ఇన్నాళ్లూ కాస్త కామ్‌గా ఉన్న సూర్యుడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటి సమయంలోనే ఏదైనా చల్లని ప్రాంతాలకు వెళ్లి, సేద తీరాలనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా తారలు ఇండియాలో సమ్మర్ సీజన్ ఎంటరవ్వగానే వీలు కుదిరితే వింటర్ సీజన్ ఉన్న దేశాలకు వెళ్లిపోయి ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం నాగార్జున అండ్ ఫ్యామిలీ ఆ పని మీదే ఉన్నారు. భార్య అమల, కొడుకులు నాగచైతన్య, అఖిల్‌తో కలిసి నాగ్ మాల్దీవులు వెళ్లారు. ఇప్పుడక్కడ వింటర్ సీజన్. కూల్ కూల్‌గా ఉండటంతో హాయి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.
కొడుకులతో కలిసి నాగ్ స్కూబా డైవింగ్ చేశారు. అమల కూడా వెనక్కి తగ్గలేదు. సముద్రంలో భర్త, పిల్లలతో డైవ్ చేశారు. ‘‘నీలి రంగు నీళ్లల్లో డైవ్ చేయడం మంచి అనుభూతి కలిగించింది. నీటి లోపల ఎంతో అందంగా ఉంది’’ అని నాగ్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. అఖిల్ అయితే, ‘‘ఇప్పటివరకూ నేను చేసిన వర్కవుట్స్‌లోనే ఇదే బెస్ట్’’ అంటూ మాల్దీవుల్లో వర్కవుట్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇంకా నాగ్, అమల, నాగచైతన్య, అఖిల్ డైవింగ్‌కి వెళ్లే ముందు డైవింగ్ సూట్లు ధరించి, ఫొటో దిగారు. మొత్తం మీద విహార యాత్రను ఈ కుటుంబం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.