యంగ్‌మామ | akkineni nagarjuna special interview on he's son's marriage special | Sakshi
Sakshi News home page

యంగ్‌మామ

Published Sun, Jan 22 2017 12:01 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

యంగ్‌మామ - Sakshi

యంగ్‌మామ

ఈ ఏడాది నాగార్జునకు డబుల్‌ ప్రమోషన్‌.
కాదు.. కాదు.. త్రిబుల్‌ ప్రమోషన్‌.
ఎహె.. మూడులో ఎలా ఆపుతాం?!
నాలుగు ప్రమోషన్‌లు వేసుకోండి.
ఇద్దరు కోడళ్లను ఖాయం చేసుకున్నారు కాబట్టి
డబుల్‌ ప్రమోషన్‌!


తండ్రీకొడుకులు ముగ్గురూ అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు కాబట్టి
త్రిబుల్‌ ప్రమోషన్‌!
అన్నమయ్య.. రామదాసు.. శిరిడీ సాయి.. నమో వేంకటేశాయ
టెట్రా ప్రమోషన్‌!
నేడు డాక్టర్‌ అక్కినేని వర్ధంతి.
ఈ సందర్భంగా నాగ్‌.. ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వూ్య ఇది.


నాగేశ్వరరావుగారు దూరమై రెండేళ్లయింది...
మా మనసుల్లో çపదిలంగా ఉన్నారాయన. నాన్న గారు లేని లోటు ఉంటుంది. ఆయన్ను తల్చుకుంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. నిండు జీవితం చూశారు. ఎప్పుడైనా నాన్నగారి గురించి చెప్పేటప్పుడు కంట తడిపెట్టినా, అది ఆనందంతోనే. మా అందరికీ ఆయన దేవుడు. మేం అలా ఫీలవుతాం.

అఖిల్, చై పెళ్లి కుదిరినప్పుడు నాన్నగారు ఉండి ఉంటే బాగుండేదనే ఫీలింగ్‌ కలిగిందా?
అలాంటి ఫీలింగ్స్‌ చాలా. అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ రోజున బాగా గుర్తొచ్చారు. జీవీకే (అఖిల్‌ కాబోయే భార్య శ్రియా భూపాల్‌ తాత) గారు, నాన్నగారు ఫ్రెండ్స్‌. ‘నాగేశ్వరరావుగారు ఉండి ఉంటే బాగుండేది. ఆనందపడేవారు’ అని జీవీకేగారు అన్నారు.

మనవళ్ల పెళ్లి ‘ఇలా చేస్తే బాగుంటుంది’ అని నాగేశ్వరరావుగారు ఎప్పుడైనా అన్నారా?
చాలాసార్లు మాట్లాడుకున్నాం. ‘నాన్నా.. ఇద్దరి పెళ్లి మన ఇంట్లోనే చేస్తాను. ఇటువైపు వాళ్లు, అటువైపు వాళ్లు కూర్చుని, హాయిగా పెళ్లి చేయాలని ఉంది. పెద్ద పెళ్లిళ్లు వద్దు. అలా చేస్తే పెళ్లి చూడలేం’ అనేవాణ్ణి.

మరి.. అఖిల్‌ది ‘డెస్టినేషన్‌ మ్యారేజ్‌’ అంటున్నారు..
అది కూడా చాలా తక్కుమంది మధ్యనే ప్లాన్‌ చేశాం. ఓ 150 మంది ఉంటారు. ఎలాగూ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తాం. అందుకే వెడ్డింగ్‌ని తక్కువ మంది మధ్య చేయాలనుకున్నాం. పెళ్లనేది ఓ అద్భుతమైన ఘట్టం. ఆ మూమెంట్‌ని ఆస్వాదించాలనుకుంటున్నా.

      అఖిల్, శ్రియా భూపాల్‌ నిశ్చితార్థ వేడుకలో కాబోయే భార్యాభర్తలు నాగచైతన్య, సమంతలతో నాగార్జున (ఫైల్‌ ఫొటో)

ఫిఫ్టీ ప్లస్‌ ఏజ్‌లోనూ యంగ్‌గా కనిపిస్తున్న మీకు ‘మామగారు’ అనిపించుకోవడం సమస్య అనుకోవచ్చా?
అది వాళ్లకు (కాబోయే కోడళ్లు శ్రియా భూపాల్, సమంత) సమస్యగా ఉందేమో! శ్రియా భూపాల్‌ చిన్నప్పట్నుంచీ తెలుసు. ‘నాగ్‌ మామ’ అని పిలుస్తుంది. సామ్‌ (సమంత)కే సమస్య. ‘నన్ను ఏమని పిలవబోతున్నావ్‌’ అని సామ్‌ని అడుగుతున్నా. నవ్వుతుంది తప్ప, ఏం చెప్పడం లేదు. సామ్‌కి ‘నాగ్‌ సార్‌’ అనడం అలవాటు. ‘అలా పిలిస్తే చంపేస్తా’ అన్నా. ఏమని పిలవాలో సామ్‌ ఇంకా డిసైడ్‌ చేసుకోలేదనుకుంటా..

అఖిల్‌ పెళ్లి తర్వాత నాగచైతన్య పెళ్లి అన్నారు.. ఇప్పుడు చైతన్యదే ముందు అని టాక్‌?
లేదు. ముందు అనుకున్నట్లే జరుగుతుంది. ఎవరి పెళ్లి ముందు అయితే ఏంటి? హ్యాపీగా ఉండాలి. చై–సమంత ఎప్పుడంటే అప్పుడు వాళ్ల పెళ్లి ప్లాన్‌ చేస్తాం.

ఓకే.. మీ తాజా సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’లో చేసిన హాథీరామ్‌ బాబా పాత్ర గురించి చెబుతారా?
హాథీరామ్‌ బాబా వెరీ ఎమోషనల్‌ పర్సన్‌. చిన్న వయసు నుంచి వెంకటేశ్వరుణ్ణి చూడాలనీ, కలవాలనీ అనుకుంటాడు. పదేళ్ల వయసులోనే దేవుడి కోసం ధ్యానం చేస్తూ, ఆయన దర్శనం లేకుండానే పెద్దవుతాడు. తర్వాత ఓ రోజు వేంకటేశ్వరస్వామి కలలో కనిపిస్తారు. దాంతో ఉత్తరాది నుంచి తిరుమల వచ్చేస్తాడు. ఇక్కడేమో ఆచారాల పేరుతో గుడిలోనికి ఆయన్ను రానివ్వరు. అప్పుడతను దేవుడికి ఎలా దగ్గరయ్యాడనేది ఈ చిత్రకథ. హాథీరామ్‌ బాబాది గుజరాత్‌ అని కొన్నిచోట్ల, రాజస్థాన్‌ అని మరికొన్ని చోట్ల రాశారు. సినిమాలో ఉత్తరాది వ్యక్తిగా చూపించాం. అక్కణ్ణుంచి వచ్చి మన తెలుగు నేలపై సెటిల్‌ అయి.. మఠం స్థాపించారు. అప్పుడాయన్ను బంధిస్తే వేంకటేశ్వరస్వామి ఏనుగు రూపంలో వచ్చి కాపాడారు. ఆయనతో పాచికలు ఆడుతూ ఉండేవారనే అంశాలనూ వాడుకున్నాం. మిగతా కథనంతటినీ రాఘవేంద్రరావుగారు, జేకే భారవిగారు అద్భుతంగా రాశారు. రాఘవేంద్రరావుగారు ఎంత బాగా తీస్తారో చెప్పక్కర్లేదు. ఎంత నిష్టగా ఉంటారంటే.. లొకేషన్లో మమ్మల్నెవర్నీ చెప్పులు కూడా వేసుకోనివ్వలేదు.

వెంకన్న మిమ్మల్ని ఎక్కువగా లవ్‌ చేస్తున్నట్టున్నారు. ఆయన భక్తుడిగా 2 సినిమాలు చేశారు?
స్వామివారిని నేనే ఎక్కువ ప్రేమిస్తున్నానేమో! ఆయన భక్తుడిగా రెండు సినిమాలు చేసే ఛాన్స్‌ రావడం సంతోషంగా, తృప్తిగా ఉంది. కొందరు మెడిటేషన్‌ క్యాంపులకి, వాటికీ వీటికీ వెళ్తుంటారు. భక్తిరస చిత్రాలు చేస్తున్న సమయంలో నాకు మెడిటేషన్‌ క్యాంపులో ఉన్నట్లే అనిపిస్తోంది.

మళ్లీ ఏడుకొండలవాడి భక్తుడిగా అని దర్శకుడు రాఘవేంద్రరావుగారు అన్నప్పుడు ఏమనిపించింది?
‘అన్నమయ్య’కి మంచి పేరొచ్చింది. దాన్ని మించిన కథ రాయలేరనుకున్నా. అందుకే ‘నమో వేంకటే శాయ’ చేయకూడదనుకున్నా. రాఘవేంద్రరావుగారి మాట కాదనలేక భారవిగారు చెప్పిన కథ విన్నా. కథ విన్నాక 30 సెకన్లలో ఈ సినిమా చేస్తానని చెప్పా. ఏ భక్తుడైనా దేవుణ్ణి ఓసారి కలవాలనుకుంటాడు. ‘అన్నమయ్య’ క్లైమాక్స్‌ అదే కదా. అంతకు మించిన ఎమోషనల్‌ సీన్లు, క్లైమాక్స్‌ ఇందులో ఉన్నాయి. ఇంత మంచి కథ రాస్తారని ఊహించలేదు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్లు కూడా ఎమోషనల్‌ అవుతారు.

చిన్నప్పుడు తిరుమల వెళ్లేవారా?
మా అమ్మగారు తీసుకెళ్లేవారు. తెల్లవారు ఝామున రెండు గంటలకు స్వామి దర్శనానికి తీసుకువెళితే... స్వామివారిని, ఆయన నగలను చూస్తుండేవాణ్ణి. అప్పుడు నాన్నగారి స్నేహితుడు రాజగోపాలరాజుగారు ఈవోగా చేసేవారు. ఆయన భార్య ఝాన్సీగారు అమ్మకి క్లోజ్‌ ఫ్రెండ్‌. నేను, వాళ్ల అబ్బాయి ఫ్రెండ్స్‌. వాళ్లను చూడడానికి వెళ్లేవాళ్లం. తిరుపతి వెళ్లినప్పుడల్లా మోటర్‌సైకిల్‌ మీద తిరిగేవాణ్ణి. అప్పుడు జీరో ట్రాఫిక్‌. ఇప్పటిలా వన్‌వే కూడా కాదు, టూవే. సడన్‌గా భక్తుల రద్దీ పెరిగింది. అప్పుడు ఈజీగా రోజుకి రెండుమూడు దర్శనాలు అయ్యేవి.

♦  దేవుడు అందరికీ పరీక్షలు పెడుతుంటా డు కదా.. మరి మిమ్మల్ని పరీక్షించారా?
ప్రతి రోజూ పరీక్షే! ఈ ఇంటర్వూ్య పూర్తికాగానే సీజీ వర్క్‌ దగ్గర కూర్చుంటా. కొన్ని రోజులు పెద్ద పరీక్షలు, కొన్ని రోజులు తెలియని పరీక్షలు, ఇంకొన్ని రోజులు తెలిసిన పరీక్షలే! ఒక్క నమ్మకం ఏంటంటే... సమస్య ఉందంటే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. జాగ్రత్తగా పరిష్కారం వెతుక్కోవాల్సింది మనమే. ఒక్కోసారి కొంచెం టైమ్‌ పడుతుందంతే. ఉదాహరణకు... అఖిల్‌ సినిమా బాగా ఆడలేదు. ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర అయింది. ఇంకా మరో సినిమా స్టార్ట్‌ చేయలేదు. అప్పట్నుంచీ నాకది ఓ సమస్యే. దానికి ఓ పరిష్కారం ఉందని తెలుసు. సరైన పరిష్కారం కోసం వెతుకుతున్నాం. మళ్లీ తప్పటడుగు వేయకూడదు కదా!

♦  మీరు, చైతన్య, అఖిల్‌.. బ్రదర్స్‌లా, మంచి ఫ్రెండ్స్‌లా కనిపిస్తారు..
నిజమే. నాకు ఎక్కడ గౌరవం ఇవ్వాలో అక్కడ గౌరవం ఇస్తారు. అది మంచిది. మామూలుగా మేం స్నేహితుల్లానే ఉంటాం..

 మీ ప్రేమ విషయాన్ని మీ నాన్నగారితో చెప్పడానికి భయపడ్డారా?
 నాన్నగారితో ఏదైనా చెప్పేంత స్వేచ్ఛ ఉండేది.. పైగా నేనేం తప్పు చేయలేదు కదా. అమలని పెళ్లి చేసుకుందామని డిసైడ్‌ అయ్యాక చెప్పేశాను. అన్నయ్య, అక్క, నేనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. నాన్నగారితో ఏమైనా చెప్పాలంటే ముగ్గురం కలిసేవాళ్లం. ఇప్పుడు వాళ్లిద్దరు (నాగచైతన్య, అఖిల్‌) కూడా అలా కలుస్తున్నారు. ముందే మాట్లాడేసుకుని, నా దగ్గరకు వస్తారు. ఇద్దరూ కలిసి వచ్చారంటే, కచ్చితంగా ఏదో ఇంపార్టెంట్‌ విషయం గురించి మాట్లాడ్డానికే అని నాకు అర్థమైపోతుంది.

ఆ లిస్ట్‌ చాలా పెద్దది
మిమ్మల్ని చూస్తుంటే వయసు పెరుగుతున్నట్లు అనిపించడంలేదు.. అమృతంలాంటిదేమైనా రోజుకో స్పూన్‌ తాగుతున్నారేమో అనిపిస్తోంది..?
(నవ్వుతూ) ఇప్పుడు నేను తింటున్న ఫుడ్‌ ‘శివ’ టైమ్‌ నుంచే మొదలుపెట్టాను. 30 ఏళ్లుగా నా అలవాట్లు మారలేదు. కాకపోతే ట్రెండ్‌కి తగ్గట్టుగా కొంచెం మార్చుకుంటూ వచ్చాను. యాక్చువల్‌గా రామూకి థ్యాంక్స్‌ చెప్పాలి. ‘శివ’ అప్పుడు ‘సన్నగా ఉన్నావ్‌.. ఇంకా స్ట్రాంగ్‌గా కనపడాలి’ అని రామూ అన్నాడు. అప్పట్లో జిమ్‌లాంటివి లేవు. దాంతో పుస్తకాలు చదివి, ఇక్కడున్న డాక్టర్స్‌ని అడిగి, ఫుడ్‌ సెట్‌ చేసుకున్నాను. దాన్నే ఫాలో అవుతున్నాను. ఎనిమిది, తొమ్మిది గంటలు సరిగ్గా నిద్రపోకపోయినా, ఎక్కువ ఒత్తిడికి గురైనా అన్ని జబ్బులూ వచ్చేస్తాయి. నాన్నగారిని తీసుకుందాం. 90 ఏళ్ల వయసులోనూ మనం నడుస్తున్నట్లు నడిచేవారు. చాలా హెల్దీగా ఉండేవారు. చివరి రెండు, మూడు నెలల వరకూ హుషారుగానే ఉండేవారు. ఆయన జీన్స్‌ వచ్చింది. నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాటిలో కుంకుమ పువ్వు, అల్లం వంటివి ఉంటాయి. మార్నింగ్‌ ఒక గ్లాసు నీళ్లల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసుకుని, ఓ పదిహేను నిముషాల తర్వాత తాగుతాను. అలాగే, ఒక అల్లం ముక్క      న ములుతాను. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా నా ఫుడ్‌ హ్యాబిట్స్‌ గురించి చెప్పాలంటే పెద్ద లిస్ట్‌ ఉంది.

♦  మీరు ఫాలో అవుతున్న డైట్, ఎక్స్‌ర్‌సైజ్‌ గురించి అమల గారు ఏమంటారు?
మొన్నా మధ్య అమల ‘రోజూ ఉదయం ఐదున్నరకి నిద్ర లేస్తున్నావు? ఇష్టపడేనా? లేక హెల్త్‌ కోసం బలవంతంగానా? అసలీ ఫుడ్‌ నిజంగానే ఇష్టపడి తింటున్నావా?’ అని ఆశ్చర్యంగా అడిగింది. ‘యస్‌’ అన్నాను. అంత స్ట్రిక్ట్‌గా ఉంటాను. అమల ఫుడ్‌ హ్యాబిట్స్‌ చాలా సింపుల్‌. స్పైసీ ఫుడ్‌ తినదు. ప్రొటీన్‌ తినాలని నేనే సజెస్ట్‌ చేస్తుంటాను. ఫిఫ్టీ ఏజ్‌ వచ్చేస్తే.. మజిల్స్‌ జారిపోతాయి. అందుకే ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలి.

ఫిఫ్టీ ప్లస్‌ ఏజ్‌లోనూ విగ్‌ పెట్టాల్సిన అవసరం మీకు రాలేదు. ఆ సీక్రెట్‌?
నాకు 28, 29 ఏళ్ల వయసప్పుడు జుత్తు పలచబడింది. నాన్న, అన్నయ్యకు బట్టతల ఉన్న విషయం తెలిసిందే. నాక్కూడా అలా వచ్చేస్తుందేమో అని భయపడ్డాను. ఇప్పుడున్నట్లు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అప్పట్లో లేదు. ఓ మలయాళ ఆర్టిస్ట్‌ కేరళలో దొరికే ఆయుర్వేద తైలం గురించి చెప్పాడు. దాని రేటు 80 రూపాయలు. మా శేఖర్‌ (పర్సనల్‌ కాస్ట్యూమర్‌)ని కేరళ పంపించాను. ఒక్కొక్కరికి ఒక్కో బాటిల్‌ మాత్రమే ఇస్తారు. ఒక లైన్‌లో 80 రూపాయలకు ఇస్తే.. ఇంకో చోట.. 500 రూపాయలకు బ్లాక్‌లో అమ్మేవాళ్లు. ఆరు నెలలకు సరిపడా శేఖర్‌ బాటిల్స్‌ తెచ్చేవాడు. ఆ నూనె రాయడం మొదలుపెట్టిన తర్వాత కొత్త జుత్తు వచ్చింది. అప్పుడు వచ్చిన జుత్తు ఊడలేదు. ఇప్పుడు ఆ నూనె అందుబాటులో లేదు. ఆ సంగతి అలా ఉంచితే, ఆ నూనె చేత్తో రాసుకుంటే ఆ రంగు రెండు రోజులైనా పోయేది కాదు. గ్లౌజులు తొడుక్కుని రాసుకునేవాణ్ణి. స్టోరీ సిట్టింగ్స్‌లో నూనె రాసుకుంటూ కథ వినేవాణ్ణి. నవ్వేవాళ్లు. పట్టించుకునేవాణ్ణి కాదు.

ఇప్పుడు చాలా చాలా రిలాక్సింగ్‌గా కనిపిస్తున్నారు.. కారణం ఏంటి?
‘సినిమా పరిశ్రమలో నంబర్స్‌ అనేది పర్మినెంట్‌ కాదు. సినిమా సినిమాకీ మారిపోతాయ్‌. ఎవరో చెబితే రాసుకునే నంబర్స్‌ గురించి ఎందుకు ఆలోచించాలి?’ అని ఓసారి మైండ్‌లో ఫ్లాష్‌ వెలిగింది. అంతే. నంబర్స్‌ అనేది మైండ్‌లోంచి తీసేశాను. ‘నా సినిమాకి ఇంత ఖర్చు పెట్టాల్సిందే’ అనేది తీసేశా. కథకు తగ్గట్టు ఖర్చు పెట్టమంటున్నా. కలెక్షన్స్‌ గురించి ఆలోచించడంలేదు. నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను. ఈ మధ్య నేను చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’ని చాలా ఎంజాయ్‌ చేశాను. పిల్లలు బాగున్నారనీ, చక్కగా సెటిలవుతున్నారన్నది నా హ్యాపీనెస్‌కి ఓ కారణం. ఎప్పుడైతే నంబర్స్, కలెక్షన్స్‌ గురించి ఆలోచించడం మానేశానో అప్పుడు ఫ్రీ అయిపోయాను. చాలా హ్యాపీగా ఉంటున్నాను.

♦  ఫైనల్లీ..  నూరవ సినిమాకి దగ్గర పడిపోయారు.. ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు?
దాని గురించి పబ్లిసిటీ చేయదల్చుకోలేదు. మళ్లీ నంబర్స్, కలెక్షన్‌ అనే కంపేరిజన్‌ వచ్చేస్తుంది.
– డి.జి. భవాని

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement