అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన సినీ పరిశ్రమ
నాగార్జున ఫ్యామిలీ, సమంతకు చిరంజీవి, వెంకటేశ్, మహేశ్‌బాబు తదితరుల బాసట
సామాజిక మాధ్యమ వేదికలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు
సున్నితమైన అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలు తీసుకుంటామన్న ‘మా’
సమంతపై వ్యాఖ్యలనే సురేఖ వెనక్కు తీసుకోవడంపై దర్శకుడు రాంగోపాల్‌వర్మ అభ్యంతరం
ఆమె అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జున, నాగచైతన్యనంటూ పోస్ట్
సమస్య సద్దుమణిగింది... సంయమనం పాటించాలన్న టీపీసీసీ చీఫ్
కేటీఆర్‌కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ధర్నా..
సురేఖపై పోలీసులకు బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్ల ఫిర్యాదు
ఇంత జరుగుతున్నా స్పందించని సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినీహీరో అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు సినీనటి సమంతపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతూ చలనచిత్ర ప్రముఖులు గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. అక్కినేని కుటుంబంతోపాటు నటి సమంతకు బాసటగా నిలిచారు. మంత్రి తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకున్నారని, సినీ ప్రముఖులు దీనిని ఇంతటితో వదిలేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేసినా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల విమర్శల వరద ఆగలేదు.
తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాషల నటీనటులు కూడా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరోలు వెంకటేశ్, మహేశ్‌బాబు, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, నరేశ్, నాని, విజయ్ దేవరకొండతోపాటు సీనియర్ నటి విజయశాంతి, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, తమిళ నటి కుష్బూ తదితరులు కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ‘ఎక్స్’, ఇన్‌స్టాలలో పోస్టులు పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు.
సురేఖ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ‘మా’ లేఖ..
సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. అసోసియేషన్ తరపున కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ అధికారికంగా సుదీర్ఘ లేఖ విడుదల చేశారు.
మరోవైపు తన మాటలు సినీనటి సమంత మనోభావాలను దెబ్బతీశాయని తెలిసి ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ పోస్ట్ చేయడాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టారు. ‘కొండా సురేఖ కేవలం సమంతకి క్షమాపణ చెప్పడం ఏంటి.. అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని’ అని ‘ఎక్స్’లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని సురేఖకు టీపీసీసీ చీఫ్ సూచన!
మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత నష్టం జరగకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కొండా సురేఖతో మాట్లాడి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. రాజకీయ విమర్శల్లో సినీ కుటుంబాన్ని, మహిళా నటిని కించపరిచేలా వ్యాఖ్యానించడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. అగ్ర నాయకత్వానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పినట్లు తెలిసింది. దీంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.
‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళలపట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేగానీ గౌరవ నటి సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యలపట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యదా భావించవద్దు’ అని పేర్కొన్నారు.
నాగార్జున పరువునష్టం దావా..
మంత్రి కొండా సురేఖపై సినీనటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. నటి సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కొండా సురేఖపై పలువురు బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తోపాటు సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలకుగాను ఆమెపై కేసు పెట్టాలని కోరారు. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మూసీ మురికంతా వాళ్ల నోట్లోనే ఉందన్న కేటీఆర్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని ప్రశ్నించారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి వద్ద ధర్నా నిర్వహించారు.
స్పందించని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం రేగుతున్నా... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నగరంలో జరిగిన డిజిటల్ కార్డులు సమావేశంలో మిగిలిన విషయాలు మాట్లాడినా ఈ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
నాగార్జున పరువునష్టం దావా
మంత్రి కొండా సురేఖపై సినీనటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. నటి సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
మరో వైపు కొండా సురేఖపై పలువురు బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తోపాటు సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలకుగాను ఆమెపై కేసు పెట్టాలని కోరారు. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment