పరువుహత్యలపై నాగార్జున కామెంట్‌..! | Sakshi special chit chat with hero nagarjuna | Sakshi
Sakshi News home page

విజయ విహారి

Published Tue, Oct 9 2018 12:09 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Sakshi special chit chat with hero nagarjuna

యాక్టర్లకు  లొకేషన్‌ కావాలి– షూటింగ్‌ కోసం. కుటుంబానికి లొకేషన్‌ కావాలి– విహారం కోసం. బిజీ లైఫ్‌లో అనుబంధాల బలాన్ని  రుజువు చేసుకునేందుకు వీలు చిక్కదు.  ఉన్న తలంలో ‘మనమెలా ఉన్నామో’  తరచి చూసుకునే అనువు దొరకదు.  దూరంగా వెళ్లాలి. కలిసి ఉండాలి. కబుర్లు కలబోసుకోవాలి.  నిజ ప్రవర్తనతో హృదయాలు గెలుచుకోవాలి. నాగార్జున తన కుటుంబంతో హాలిడే ట్రిప్‌కు వెళ్లి వచ్చారు. సొంత కుటుంబం.. సినీ కుటుంబం రెండూ అపురూపం అని హ్యాపీగా ఉన్నారు.

విజయానందంలో ఉన్నప్పుడు టూర్‌ వెళితే ఆ మజానే వేరు అన్నారు. యూరోప్‌ ట్రిప్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేసి, హైదరాబాద్‌ వచ్చినట్లున్నారు?
అవును. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. చైతన్య, సమంత సినిమాలు (శైలజారెడ్డి అల్లుడు, యు టర్న్‌) హిట్టయ్యాయి. ఫుల్‌ హ్యాపీ. అఖిల్‌  ‘మిస్టర్‌ మజ్ను’ టీజర్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే చైతన్య ‘సవ్యసాచి’ టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. హాలిడే ట్రిప్‌లో ఉన్నప్పటికీ ఎవరో ఒకరు ఫోన్‌ చేసి రెస్పాన్స్‌ గురించి చెబుతుంటారు కదా. ట్రిప్‌ మొత్తం హ్యాపీగా గడవడానికి ఇంతకన్నా మంచి కారణాలేం ఉంటాయి.

ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లి చాలా రోజులైనట్టుంది?  
నిజమే. హాలిడేకి అందరం కలిసి వెళ్లి చాలా రోజులైంది. అందరం సినిమాలతో బిజీగా ఉన్నాం. ఒక చిన్న బ్రేక్‌ తీసుకుని ఓ ట్రిప్‌ వెళ్లాలని ఎప్పటì æనుంచో అనుకుంటున్నాం. ఫైనల్లీ ఇప్పటికి కుదిరింది.

ట్రిప్‌లో స్కై డైవింగ్, స్కూబా డైవింగ్‌ లాంటి అడ్వంచర్స్‌ ఏమైనా చేశారా?
నో అడ్వంచర్స్‌. సైట్‌ సీయింగ్‌ కూడా లేదు. షూటింగ్స్‌ కోసం తిరుగుతుంటాం కదా. సైట్‌ సీయింగ్‌ కూడా అప్పుడే అయిపోతుంది. ఇలా ఫ్యామిలీ ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు అందరం కలిసి రెస్టారెంట్స్‌కు వెళ్తాం. మామూలు రోజుల్లో అందరం ఒక చోటు ఉండటం కష్టం. అందుకే అందరం కలిసి ఉండాలనే ఆలోచనతోనే హాలిడే ట్రిప్స్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాం. హ్యాపీగా రోడ్స్‌ మీద తిరిగేస్తాం. జోక్స్‌ చెప్పుకుని నవ్వుకుంటాం. మా హాలిడే ముఖ్య ఉద్దేశం అందరం కలిసి ఉండటమే.

కుటుంబంలో అందరూ ఒకే ఫీల్డ్‌లో ఉన్నప్పుడు అన్నిసార్లూ అందరికీ సక్సెస్‌ రాకపోవచ్చు. ఈసారి మీ అందరికీ ఒకేసారి సక్సెస్‌ వచ్చింది. ‘టైమ్‌’ని నమ్ముతారా?
నేనందరికీ  చెబుతుంటాను..  టైమ్‌ మనం అనుకున్నట్లు నడవదని. ఆ మధ్య ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌ అందరం నిరాశతో ఉన్నాం. ఆ సమయంలో అన్నాను.. ఆరేడు నెలల తర్వాత మనమే ‘అప్పుడు ఎందుకలా బాధపడ్డాం అని నవ్వుకుంటాం చూడండి’ అని. ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం. మేమే కాదు ఫ్యాన్స్‌ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. టైమ్‌ వస్తుంటుంది. వెళ్తుంటుంది. సెప్టెంబర్‌ నెల మా ఇంట్లో అందరికీ ఒకేసారి అలా పీక్‌ చూపించింది. నాన్నగారి నెల ఇది. ఆయన పుట్టిన నెల. పై నుంచి ఆయన చల్లని చూపు చూసుంటారు. ఇంతకు ముందు డిసెంబర్‌ మా నెల అనుకునే వాళ్లం. డిసెంబర్‌లో రిలీజయ్యే మా సినిమాలు ఆల్‌మోస్ట్‌ హిట్‌. ఇప్పుడు సెప్టెంబర్‌ కూడా తోడైంది. 

అక్టోబర్‌ 6 నాగచైతన్య–సమంతల ఫస్ట్‌ మ్యారేజ్‌ డే. వాళ్లిద్దరి గురించి?
ఇద్దర్నీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. చైతన్య చాలా కామ్, రిజర్వ్‌డ్‌గా ఉంటాడు. సమంత మాత్రం బాగా మాట్లాడుతుంది. అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. వాళ్లిద్దరికీ బాగా సెట్‌ అయింది. ఒకరినొకరు కావాలని కోరుకుని మరీ పెళ్ళి చేసుకున్నారు. ఎవరికైనా అంతకంటే కావాల్సింది ఏముంటుంది? 

మీది లవ్‌మ్యారేజ్‌ కాబట్టి వాళ్ల లవ్‌ని అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నారా? 
అలా ఏం లేదు. ఎవరైనా సరే తనకు నచ్చిన  వ్యక్తితో లైఫ్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటారు. చై, సామ్‌ విషయంలో ఇద్దరూ ఇద్దర్నీ కావాలనుకున్నారు. 

పరువుహత్యలపై నాగార్జున కామెంట్‌..!
ఇటీవల సొసైటీలో ప్రేమ తిరస్కరణలు చూస్తున్నాం. దాని వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, పెద్దలే పరువు హత్యలు చేయడం చూస్తున్నాం. ఏమంటారు?
పిల్లల జీవితాన్ని సౌకర్యవంతంగా చేయడానికే పెద్దవాళ్లం ఉంటాం. వాళ్లను ఇబ్బందులపాలు చేయకూడదు. ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకోవడం, పరువు పేరుతో హత్య చేయడం రెండూ సరికాదు. ‘ఈ వ్యక్తితో నా మిగతా జీవితం సాగాల్సిందే’ అని పిల్లలు బలంగా చెప్పినప్పుడు వినాలి. పిల్లల జీవితాన్ని కంఫర్టబుల్‌ చేయాలి కానీ కష్టపెట్టకూడదని నా నమ్మకం.

అమలగారు కోడలిగా అడుగుపెట్టి అందరితో కలిసిపోయారు. కోడలుగా సమంత ఎంత బెస్ట్‌?
సమంత అంటే నాకు, అమల, అఖిల్‌.. అందరికీ ఇష్టం. అందరితో చాలా బావుంటుంది. మాకు ఇవ్వాల్సిన గౌరవం మాకు ఇస్తుంది. కష్టపడి పైకి వచ్చింది. వ్యాల్యూస్‌ అన్నీ తెలుసు. మేం తన విషయంలో ఎంత  హ్యాపీగా ఉన్నాం అని చూసుకోవడం కన్నా చైతన్య హ్యాపీగా ఉండటం ముఖ్యం కదా.

మీరేమో ఏజ్‌ పెరిగే కొద్దీ యంగ్‌గా కనిపిస్తున్నారు. చైతన్య పెళ్లి తర్వాత ఇంకా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు..
(నవ్వేస్తూ) నాన్నగారికి జీన్స్‌ నాకు వచ్చింది. నాకు ఉన్నది వీళ్లకు ఇచ్చాను. బేసిక్‌గా నేను హెల్తీ డైట్‌ని ఇష్టపడతా. చైతన్య అయితే  ఇంకా. ఫిట్‌నెస్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తాడు.

టూర్స్‌కి వెళ్లినప్పుడు డైట్‌కి డుమ్మా కొడతారా?
నచ్చింది తినడం అలవాటు. మన శరీరం ఒక డైట్‌కి అలవాటు పడిపోతుంది. అలవాటు ప్రకారం కొన్నింటిని దూరం పెట్టేస్తుంది.

‘దేవదాస్‌’లో స్టైలిష్‌ డాన్‌గా బాగున్నారు.. ఆ పాత్ర  చేయడం మీకెలా అనిపించింది?
ఈ కథ ఫస్ట్‌ టైమ్‌ విన్నప్పుడే ఇందులోని డాన్‌ క్యారెక్టర్‌ని రెగ్యులర్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అప్రోచ్‌ అవుదామనుకున్నాం. డాన్‌ అనగానే కళ్లు ఎర్రగా పెట్టుకోవడం లాంటివి వద్దు.. ఆడియన్స్‌ కళ్లలో నీళ్లు వచ్చేలా నవ్విద్దాం అని డిసైడ్‌ అయ్యాం. డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్‌లో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నాం. డైలాగ్స్‌ చెప్పడం కూడా చాలా క్యాజువల్‌గా చెప్పాను.

ఈ మధ్య కాలంలో ఇంత స్టైలిష్‌ డాన్‌ని స్క్రీన్‌ మీద చూడలేదు.
థ్యాంక్యూ.  సినిమా స్క్రిప్ట్‌ వినగానే వర్కౌట్‌ అవుతుందని అనుకున్నాను. నానితో యాక్ట్‌ చేయడమంటే నాకు ఇష్టం. మా ఇద్దరి మధ్య సీన్స్‌ అన్నీ బాగా కుదిరాయి. నాని కూడా ఏదైనా క్యారెక్టర్‌ ఓకే చేయగానే పాత్రలోకి వెళ్లిపోతాడు. యాక్చువల్లీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత డిఫరెంట్‌ డిఫరెంట్‌ జానర్స్‌ టచ్‌ చేస్తూ వచ్చాను. మళ్లీ ఈ సినిమా ద్వారా అలాంటి పాత్ర అలా కుదిరింది.  

ఎమోషనల్‌ సీన్స్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఆ సీన్స్‌ చేస్తున్నప్పుడు మీకెలా అనిపించింది? 
క్లైమాక్స్‌లో కొంచెం ఎమోషనల్‌ సీన్స్‌ ఉంటాయి. ‘ఈ విషయాన్ని ఓ పాతికేళ్ల ముందు చెప్పి ఉంటే నేను డాన్‌ అయ్యుండేవాణ్ణి కాదు’ అని ఎమోషన్‌ అవుతూ దేవా (నాగార్జున పాత్ర) అంటాడు. రియల్‌ లైఫ్‌లో కూడా నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నప్పుడు... ‘అబ్బా ఇది ఓ పది సంవత్సరాల క్రితం తెలిసుంటే బావుండేది కదా’ అని భావిస్తుంటాను. 

అలా భావించిన సంఘటన ఏదైనా గుర్తు చేసుకుంటారా? ముందే తెలిసుంటే బావుండేదని మీరు ఫీల్‌ అయింది? 
 ఇది అని పర్టిక్యులర్‌గా చెప్పలేను. కానీ కొన్ని సార్లు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల లైఫ్‌ అంతా మారిపోతుంది.. ఆ సందర్భాల్లో అనిపిస్తుంది. ముఖ్యంగా చెడు ప్రభావాల వల్ల  కుర్రతనంలో తీసుకున్న నిర్ణయాలు మెచ్యూర్టీ వచ్చాక.. కరెక్ట్‌ కాదనిపిస్తాయి. అదే కదా లైఫ్‌.

తర్వాతి సినిమాల గురించి? 
తమిళంలో ధనుష్‌తో ఓ మల్టీస్టారర్, హిందీలో అమితాబ్, రణ్‌బీర్‌ కపూర్‌తో ఓ మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తున్నాను. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌ ‘బంగార్రాజు’, రాహుల్‌ రవీంద్రన్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేశాను. ఏది ముందు అనేది చూడాలి. రెండు సినిమాల్లో పాత్రలు ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటాయి. రాహుల్‌ రవీంద్రన్‌తో చేసేది రొమాంటిక్‌ కామెడీ. వయసుకు తగ్గ రొమాన్సే ఉంటుంది (నవ్వుతూ).

చిన్న వయసులో పిల్లలు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్‌గా ఉంటాయో లేదో అని తల్లిదండ్రులకు చిన్నపాటి భయం ఉంటుంది కదా? మీకలా?
చిన్నప్పుడు నచ్చిన బొమ్మలు కొనిపెడతాం. ఊహ తెలిశాక నచ్చిన డ్రెస్సులు కొనిపెడతాం. పెద్దయ్యాక  కెరీర్‌ పరమైన నిర్ణయాలను తీసుకోమంటాం. ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయాన్ని కూడా వాళ్లనే తీసుకోమంటాం. నా పిల్లలకు ఫుల్‌ స్వేచ్ఛ ఇచ్చాను. ‘ఇలా చేయండి’ అని వెనకుండి వేలు పట్టుకుని నడిపిస్తే వాళ్లకు జీవితం గురించి ఏం తెలుస్తుంది? జీవితం గురించి తెలిసిన పిల్లలు వాళ్ల లైఫ్‌ పార్ట్‌నర్స్‌ని సెలెక్ట్‌ చేసుకోలేరా? మనం చూసిపెట్టాలా? మిగతావన్నీ వాళ్లకు నచ్చినవే చేసి, లైఫ్‌ పార్ట్‌నర్‌ని మాత్రం మనకు నచ్చినట్లు సెలెక్ట్‌ చేయాలంటే ఎలా? అంటే... వాళ్ల జీవిత భాగస్వామి మన 
కోసమా? మనకు నచ్చినట్టు ఉండాలా?  
 
వయసు ఇరవై అయిదే కదా?
(నవ్వుతూ).. యస్‌... ఏజ్‌ అనేది శరీరానికే. మనసుకి కాదు. నాకింకా ఇరవైఅయిదేళ్లే.
– డి.జి.భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement