సినిమా రివ్యూ: మనం
సినిమా రివ్యూ: మనం
Published Fri, May 23 2014 3:10 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల్లో 'మనం' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు జనరేషన్ లు తెరపై కనిపించడం అన్నివర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరెస్ట్ లాంటి అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడం, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే చిత్రంలో నటించడం అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచింది. విడుదలకు ముందే ఫస్ట్ లుక్ తోపాటు ప్రోమోలతో సగటు సినీ ప్రేక్షకుడికి చేరువైన 'మనం' చిత్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే.
అర్ధాంతరంగా చనిపోయిన రెండు జంటలు (రాధామోహన్ & కృష్ణవేణి, సీతారాం &రామ లక్ష్మి) మళ్లీ జన్మించడమే మనం చిత్ర కథ. రెండు జంటలను కలుపడానికి వారి కుమారులు చేసిన ప్రయత్నానికి తెర రూపమే 'మనం' చిత్రం.
సీతారాం, నాగేశ్వరరావు పాత్రల్లో అక్కినేని నాగార్జున, రాధామోహన్, నాగార్జునగా నాగ చైతన్య, కృష్ణవేణి, ప్రియగా సమంత, రామలక్ష్మి, అంజలి పాత్రల్లో శ్రీయలు, నాగ చైతన్య పాత్రలో అక్కినేని నాగేశ్వరరావులు నటించారు.
కథ:
నాగార్జున ఓ బిజినెస్ మాగ్నెట్. అతి చిన్న వయస్సులోనే ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన వ్యాపారవేత్త. అనుకోకుండా నాగచైతన్య, సమంతలను కలుసుకుంటాడు. నాగచైతన్య, సమంతలను చూడగానే తన చిన్నతనంలో చనిపోయిన తల్లి, తండ్రులు (రాధా మోహన్, కృష్ణవేణి) మళ్లీ పుట్టారు అని నిర్థారించుకుంటాడు. నాగచైతన్య, సమంతల రూపంలో ఉన్న తన తల్లితండ్రులను కలిపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నసమయంలో ఓ యాక్సిడెంట్ కు గురైన అక్కినేని నాగేశ్వరరావుకు నాగార్జున రక్తాన్ని ఇచ్చి కాపాడుతాడు. ఈ ఘటనలో శ్రియను కలుసుకుంటాడు. అయితే ఆస్పత్రిలో నాగార్జున, శ్రియలను చూసిన నాగేశ్వరరావు.. తన పసితనంలో పొగొట్టుకున్న తల్లితండ్రులు(రామలక్ష్మి, సీతారాం)లుగా గుర్తిస్తాడు.
నాగార్జున, శ్రియలను కలుపడానికి నాగేశ్వరరావు, నాగ చైతన్య, సమంతలను కలుపడానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తారు. నాగార్జున, నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా?, నాగ చైతన్య, సమంతలు పూర్వజన్మ గురించి తెలుసుకుంటారా? నాగార్జున, శ్రియలు ఒక్కటవుతారా? తమ నాగార్జున, శ్రియలను కలపడానికి అక్కినేని నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఎంటి? అనే ప్రశ్నలకు సమాధానమే 'మనం' చిత్ర కథ.
నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియలు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఒకే చిత్రంలో రెండు జనరేషన్లకు చెందిన పాత్రలను పోషించడంలో జట్టుగా అక్కినేని నాగేశ్వరరావుతోపాటు నలుగురు హీరోహీరోయిన్లు పాత్రలకు జీవం పోశారు. సమంతను అమ్మ అంటూ, నాగ చైతన్యను నాన్న అంటూ పిలుస్తూ నాగార్జున ఆకట్టుకోవడమే కాకుండా.. ప్రేక్షకులను మెప్పించారు కూడా. ముఖ్యంగా నాగేశ్వరరావు పాత్రలో నాగార్జున నటించిన తీరు ప్రశంసనీయం. ఇంటర్వెల్ లో అక్కినేని నాగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో ఓ అనుభూతిని కలిగించాడు. రెండవ భాగం ప్రారంభమైన దగ్గర నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకుడిలో అక్కినేని నాగేశ్వరరావు చేరువవ్వడంతోపాటు చక్కటి ఫీలింగ్ ను నింపారు.
ఇక నాగచైతన్య తన వయస్సుకు మించిన ఓ బరువైన పాత్రలో కనిపించడమే కాకుండా రెండు పాత్రలకు తగినట్టుగా పరిణతిని ప్రదర్శించాడు. సమంత, శ్రియలు విభిన్నమైన పాత్రలతో మెప్పించారు. ఆలీ, బ్రహ్మనందం, సప్తగిరి కామెడీతో ఆలరించారు.
ముఖ్యంగా ఈ చిత్ర కథను రూపొందించిన విక్రమ్ కే కుమార్ కే క్రెడిట్ దక్కుతుంది. మనం చిత్రంలో అక్కినేని వంశంలోని నాగేశ్వరరావు, నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ లకు తగినట్టుగా కథను రూపొంది.. చాలా ఒద్దికగా, కథపై నియంత్రణతో.. చిత్రాన్నిమలిచిన తీరు ఆకట్టుకునేలా ఉంది. రెండు పునర్జన్మ కథలను చక్కగా చిత్రీకరించి ప్రేక్షకులను ఆలరింప చేయడంలో విక్రమ్ కుమార్ సఫలమయ్యారు. వివిధ జనరేషన్లకు తగినట్టుగా ఓ మూడ్ ను క్రియేట్ చేయడంలో కెమెరామెన్ పీఎస్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ లు ప్రధాన పాత్రలు పో్షించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది.
అనూప్ రూబెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. అనూప్ రూబెన్ అందించిన అందర్ని పాటలు ఆకట్టుకున్నాయి. వందేళ్ల సినిమా చరిత్రలో దాదాపు 70 సంవత్సరాల సినీ జీవితంతో ప్రేక్షకుడికి విభిన్నమైన పాత్రలతో ఆలరించి, ఆకట్టుకుని తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు 'మనం' చిత్రం గొప్ప నివాళి.
Advertisement