కనకం.. పూనకం! | Gold prices hit record Rs 78000 mark on strong global cues | Sakshi
Sakshi News home page

కనకం.. పూనకం!

Published Sun, Sep 29 2024 1:39 AM | Last Updated on Sun, Sep 29 2024 4:53 AM

Gold prices hit record Rs 78000 mark on strong global cues

ప్రపంచవ్యాప్తంగా విరజిమ్ముతున్న స్వర్ణ కాంతులు 

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం 2,700 డాలర్లకు జంప్‌ 

దేశీయంగా 10 గ్రాముల ధర రూ.78,000 స్థాయికి.. 

భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి ప్రభావం.. 

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల కోత ఆజ్యం.. 

ఏడాదిలో తులం.. ‘ల’కారం ఖాయమంటున్న విశ్లేషకులు

(శివరామకృష్ణ మిర్తిపాటి) : క నకం.. పూనకాలు లోడింగ్‌ అంటూ బంగారం రోజురోజుకూ రేటు పెరుగుతూ కొనుగోలుదారుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడాది క్రితం రూ.60,000 స్థాయిలో ఉన్న 10 గ్రాముల బంగారం రేటు ఇప్పుడు రూ.78,000ను దాటేసి ‘నగ’ధగలాడిపోతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో దిగుమతి సుంకం తగ్గించడంతో కాస్త దిగివచ్చిన బంగారం.. చాలా మందిలో ఆశలు రేపింది. మరికొంత తగ్గుతుందేమో కొనుక్కుందామని ఎదురుచూసిన వారికి నిరాశ మిగుల్చుతూ చుక్కలను తాకుతోంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను తగ్గించడంతో.. ప్రపంచవ్యాప్తంగా పుత్తడికి డిమాండ్‌ పెరిగింది. దీనికితోడు మన దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌తో డిమాండ్‌ పోటెత్తుతోంది. రేటెంతైనా తప్పదుకదా అన్నట్టుగా కొనుగోలుదారులు బంగారం దుకాణాలకు క్యూకడుతున్నారు.  

కొండెక్కిన బంగారం కొత్త శిఖరాలతో చుక్కలు చూపిస్తోంది. తాజాగా ప్రపంచ మార్కెట్లో ఔన్స్‌ (31.1 గ్రాములు) ధర 2,700 డాలర్ల పైకి ఎగబాకి ఆల్‌టైమ్‌ గరిష్టాన్ని తాకింది. దేశీ మార్కెట్లో కూడా 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్‌) రేటు రికార్డులు బ్రేక్‌ చేస్తూ రూ.78,300కు ఎగబాకింది. 2023లో మొత్తంగా 20% ఎగబాకిన గోల్డ్‌ రేటు.. ఈ ఏడాది ఇప్పటికే 29% దూసుకెళ్లడం విశేషం. గడిచిన 14 ఏళ్లలో ఒక ఏడాదిలో ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. అసలే, పండుగ సీజన్‌కు తోడు వచ్చే 3 నెలల్లో పెళ్లిళ్ల బాజాలు మోగనుండటంతో రేటెక్కువున్నా బంగారం షాపులు కళకళలాడుతున్నాయని బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో గ్రామీణ డిమాండ్‌ కూడా జతవుతోందని అంటున్నారు. జూలైలో దిగుమతి సుంకం భారీ కోత నేపథ్యంలో ఆగస్టు నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగి 140 టన్నులకు జంప్‌ చేయడం మన దగ్గర డిమాండ్‌ ఏ స్థాయిలో పెరిగిందనేందుకు నిద ర్శనం. కాగా 2023–24లో భారత్‌ మొత్తం 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 850 టన్ను లకు చేరవచ్చనేది వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా. వెరసి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద పసిడి దిగుమతిదారుగా భారత్‌ నిలుస్తోంది.

పసిడి కాంతులకు కారణమేంటి?
కొన్నేళ్లుగా పసిడి ఉత్పత్తి మందగించి, భూగర్భంలోని నిల్వలు అడుగంటుతు న్నాయి. మరోవైపు ఆభరణాల డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లుచెప్తుండటంతోపాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్‌ వాటాను తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్‌ జోరందుకుంటోంది. ఆర్థిక అనిశ్చితి, యుద్ధ భయాలతోపాటు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్‌ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులు సగటున ఏటా 800 టన్నులు కొనడం గమనార్హం. మన రిజర్వు బ్యాంకు వద్ద కూడా పసిడి నిల్వలు 840 టన్నులకు ఎగబాకాయి.

ఇలా ఓవైపు సరఫరా మందగించడం.. మరోవైపుడిమాండ్‌ విపరీతంగా పెరిగిపోవడమే గోల్డెన్‌ రన్‌కు ప్రధాన కారణం. ఇక ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి ముగింపు కనబడకపోగా.. ఇజ్రాయెల్‌ దాడులు, ప్రతిదాడుల తో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ’అణు‘ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనిశ్చితిలో ఆదుకునే సురక్షిత సాధనాల్లో కి, బంగారంలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. తాజా గా అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత అంచనాలను మించి అర శాతం వడ్డీరేట్ల కోత విధించడంతో బంగారానికి మరింత బూస్ట్‌ ఇచ్చినట్ల యింది. ఫిబ్రవరిలో 2,000 డాలర్లకు అటూఇటుగా  ఉన్న ఔన్స్‌ బంగారం ఇప్పుడు 2,708 డాలర్లను తాకింది.

ఈ పరుగు ఎందాకా?
ఫెడ్‌ రేట్ల కోత ఇప్పుడే ప్రారంభమైందని.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మరో ముప్పావు శాతం తగ్గే అవకాశం ఉందని.. దీనివల్ల పసిడి పరుగులకు ఢోకా ఉండదని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యూబీఎస్‌ చెబుతోంది. వచ్చే ఏడాది మధ్య నాటికి బంగారం రేటు 2,900 డాలర్లకు చేరవచ్చని తాజాగా అంచనా వేసింది. ‘‘అమెరికాలో వాస్తవ వడ్డీరేట్లు ఇంకా తగ్గుముఖం పట్టనున్నాయి. భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలతో పెట్టుబడిగా బంగారానికి డిమాండ్‌ జోరందుకోనుంది. సీజనల్‌గా ఆభరణాల కొనుగోళ్లు కూడా పుంజుకోనున్నాయి. సెంట్రల్‌ బ్యాంకుల బంగారం నిల్వలు ఇంకా ఎగబాకవచ్చు.

దీంతో రాబోయే 6–12 నెలల్లో పసిడి రేట్లు భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’అని యూబీఎస్‌ పేర్కొంది. యూఎస్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ సైతం సమీప భవిష్యత్తులోనే పసిడి ఔన్స్‌ ధర 3,000 డాలర్లకు చేరుతుందని లెక్కగట్టింది. వీటి ప్రకారం చూస్తే.. దేశీయంగా 10 గ్రాముల రేటు (24 క్యారెట్‌) రూ.85,000కు చేరే చాన్సుంది. అంటే పాత తులం (11.7 గ్రాములు) అక్షరాలా లక్ష రూపాయలను తాకుతుంది. రూపాయి విలువ గనుక ఇంకా బక్కచిక్కితే పసిడి మరింత కాంతులీనడం ఖాయమంటున్నారు విశ్లేషకులు!

వన్నె తగ్గని పెట్టుబడి..
పసిడి పగ్గాల్లేకుండా పరుగులు తీస్తుండటంతో పెట్టుబడులూ జోరందుకుంటున్నాయి. నిజానికి పెట్టుబడి కోసమైనా కూడా మన దగ్గర ఆభరణాల రూపంలో కొనేవారే ఎక్కువ. దీనివల్ల తరుగు, మజూరీ నష్టాలు అదనం. కాబట్టి పెట్టుబడి కోసం కాయిన్లు, బార్ల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని కొనడం బెటర్‌. కానీ ఇందులోనూ అదనపు చార్జీల భారం ఉంటుంది. పైగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బాదుడు తప్పదు. ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో కొని దాచుకోవడం రిస్కు కూడా.

దీనికి ప్రత్యామ్నాయం సార్వ¿ౌమ గోల్డ్‌ బాండ్లు (ఎస్జీబీలు), గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు) తదితర రూపాల్లో లభించే డిజిటల్‌ గోల్డ్‌. ఎనిమిదేళ్ల క్రితం గ్రాము రూ.3,100 పెట్టి కొన్న గోల్డ్‌ బాండ్లపై ప్రస్తుతం 150 శాతంపైగా రాబడి లభిస్తోంది. అయితే బంగారం భగభగలతో ప్రభుత్వం ఇప్పుడు వీటి జారీని నిలిపేసింది. సెకండరీ మార్కెట్లోనే దొరుకుతున్నాయి. ఈటీఎఫ్‌లు, ఎస్‌జీబీలను షేర్ల లాగే నచ్చినప్పుడు విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఏ రూపంలో కొన్నాసరే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కనీసం 10–15 శాతాన్ని బంగారానికి కేటాయించడం మంచిదని, ప్రతి నెలా కొద్ది్దకొద్దిగా (సిప్‌ రూపంలో) ఇన్వెస్ట్‌ చేయాలనేది నిపుణుల సలహా!

సుంకం కోతతో తగ్గినా.. రూపాయి వాతతో! 
మోదీ సర్కారు జూలైలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి ఎకాయెకిన 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో బంగారం రేటు ఒక్కసారిగా రూ.5 వేల వరకు తగ్గి.. రూ.66 వేల స్థాయికి దిగొచ్చింది. దీనితో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కానీ అంతర్జాతీయంగా బంగారం రేటు నాన్‌స్టాప్‌గా పరుగులు తీయడంతో మన మార్కెట్లో కూడా పుంజుకోవడం మొదలైంది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల కోత (సెపె్టంబర్‌ 18న)తో ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.

గత 10 రోజుల్లో 100 డాలర్లకు పైగా (మన దగ్గర 10 గ్రాములకు దాదాపు రూ.3,000) పెరిగింది. అంటే సుంకం కోత లేకుంటే.. ధర ఇప్పుడు రూ.83,000 కింద లెక్క. మరోవైపు రూపాయి విలువ అంతకంతకూ పడిపోతూ పసిడి ధరను దేశీయంగా మరింత ఎగదోస్తోంది. రెండేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉంది. అదే స్థాయిలో ఉండుంటే.. ప్రస్తుత పసిడి ధర రూ.74,000 (6 శాతం దిగుమతి సుంకంతో కలిపి) ఉండేది. కానీ రూపాయి 83.60కి దిగజారడంతో రేటు 78,000 స్థాయికి చేరింది. అంటే రూపాయి పతనం వల్ల మనం మరో రూ.4,000 అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోందన్నమాట!

రిస్కు పూజ్యం.. రాబడి ఘనం!
ప్రపంచంలో ఏ అసెట్‌ (ఆస్తి)కూ లేనంత స్టోర్‌ ఆఫ్‌ వేల్యూ బంగారం సొంతం. స్టోర్‌ ఆఫ్‌ వేల్యూ అంటే మన దగ్గర ఏదైనా అసెట్‌ (కరెన్సీ, బంగారం, భూమి, ఇళ్లు, షేర్లు ఇతరత్రా) ఉంటే.. ఎన్నాళ్లయినా దాని విలువ పెరగడమే కానీ ఆవిరైపోకుండా ఉండటం అన్నమాట. భూమి వంటివాటికి స్టోర్‌ ఆఫ్‌ వేల్యూ ఉన్నా.. బంగారంలా వెంటనే సొమ్ము చేసుకోవడం (లిక్విడిటీ) కష్టం. అంటే అసలుకు మోసం రాకుండా, లిక్విడిటీ ఎక్కువ ఉండేది బంగారమే. దానికితోడు మంచి రాబడి కూడా. పసిడి ధర ఐదేళ్లలో రెండింతలకుపైగా పెరిగింది. స్టాక్‌ మార్కెట్ల (షేర్ల)లో ఇంతకు మించి లాభాలొచ్చే వీలున్నా.. అది చాలా రిస్‌్కతో కూడుకున్నది.

ధర ఇంతగా పెరుగుతుందనుకోలేదు 
రెండు నెలల క్రితం బంగారం ధర తగ్గినప్పుడు చాలా ఆనందించాం. ఇంకా తగ్గుతుందేమో అవసరమైన నగలు కొనుక్కోవచ్చని అనుకున్నాం. కానీ ఇంతగా పెరుగుతుందనుకోలేదు. రేట్‌ చూస్తుంటే భయమేస్తోంది. భవిష్యత్తులో బంగారం కొనగలుగుతామా? అనిపిస్తోంది.  – శిరీష, మోతీనగర్, హైదరాబాద్‌

ఎంత పెరిగినా కొనాల్సిందే..
బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతుందో అర్థం కావడం లేదు. నేను అమెరికా నుంచి వచ్చాను. అక్కడివారికి బంగారంపై మక్కువ లేకపోయినా మనవారికి మాత్రం ఎనలేని ఇష్టం. ఎంత పెరిగినా ఎంతో కొంత కొనాల్సిందే.  – నేహా, హైదరాబాద్‌

ఇలాగైతే బంగారం కొనడం కలే.. 
ప్రభుత్వం బంగారంపై సుంకం తగ్గించినప్పుడు చాలా ఆనందించాం. బంగారం రేటు పెరుగుతుందనుకోలేదు. ఇలాగైతే బంగారం కొనడం కల గానే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం బంగారం కొనాలంటే.. చాలా పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టాల్సి వస్తుంది.     – నిషా, జూబ్లీహిల్స్, హైదరాబాద్‌  

2,01,296 టన్నులు 
వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనాల ప్రకారం భూమిపై ఉన్న మొత్తం బంగారం (ఆభ రణాలు, పెట్టుబడులు, ప్రభుత్వాల వద్ద, పారిశ్రామిక వినియోగంతో కలిపి) దీని విలువ 17.4 ట్రిలియన్‌ డాలర్లు.. మన కరెన్సీలో రూ.1,455 లక్షల కోట్లు!

53,000 టన్నులు 
భూగర్భంలో ఇంకా మిగిలి ఉన్న కచ్చితమైన బంగారు నిక్షేపాలు.
21.8 క్యూబిక్‌ మీటర్లు ప్రపంచంలో ఇప్పటిదాకా వెలికితీసిన బంగారం అంతా కరిగించి ముద్ద చేస్తే.. 21.8 మీటర్లుండే క్యూబ్‌లో పట్టేస్తుందట!

13% ప్రపంచ పసిడి నిల్వల్లో భారతీయుల వాటా ఇది. 
25,000 టన్నులు మన దేశంలో ప్రభుత్వం, దేవాలయాలతోపాటు ఆభరణాలు, ఇతర రూపాల్లో ప్రజల వద్ద ఉన్న మొత్తం బంగారం అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement