బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గింపు?
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణలను సడలించే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచనప్రాయంగా వెల్లడించారు. బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణలపై మార్చి నెలాఖరులో సమీక్షించే అవకాశముందని ఆయన తెలిపారు. 'బంగారం దిగుమతులపై విధించిన నియంత్రణల్లో కొన్నింటిపై ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో సమీక్షించే అవకాశముందని గట్టిగా చెప్పగలను. అయితే కరెంట్ ఎకౌంట్ లోటు పూర్తిగా అదుపులోకి వచ్చాకే సమీక్షిస్తాం' అని చిదంబరం తెలిపారు.
కస్టమ్స్ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్యాక్స్ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బంగారం దిగుమతులు పెరగడంతో ప్రభుత్వం గతేడాది కస్టమ్స్ సుంకం మూడింతలు పెంచిన సంగతి తెలిసిందే.