న్యూఢిల్లీ: భారత్‌కు ప్రస్తుతం కల్పిస్తున్న వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్‌పీ)ను త్వరలో ఎత్తివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై భారత్ విచారం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకరమైన పరిణామంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
‘ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో భాగంగా అమెరికా విజ్ఞప్తులపై పరస్పర సమ్మతితో ముందుకుసాగేవిధంగా భారత్ పలు పరిష్కార మార్గాలను ప్రతిపాదించింది. కానీ, వాటిని అమెరికా అంగీకరించలేదు. ఇది దురదృష్టకరం’ అని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరుదేశాల ఆర్థిక సంబంధాల్లో భాగంగానే ఈ అంశం కూడా కాలానుగుణంగా ఉమ్మడి సమ్మతితో పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికాతో ఆర్థికపరంగానే కాకుండా పరస్పరం ఇరుదేశాల ప్రజల మధ్య బలమైన అనుబంధం కొనసాగాలని ఆశిస్తున్నట్టు తెలిపింది.
అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్‌పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించడానికే సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment