సాక్షి, న్యూఢిల్లీ/వరదయ్యపాళెం: దేశంలోని అత్యున్నత పారిశ్రామిక పార్కుల్లో ఒకటిగా ఏపీలోని శ్రీసిటీ నిలిచింది. కేంద్ర పరిశ్రమ, అంతర్గత వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (ఐపీఆర్‌ఎస్) రిపోర్ట్ 2.0 నివేదికలో 41 పారిశ్రామిక పార్కులను ‘లీడర్స్’గా గుర్తించారు. ఇందులో దక్షిణ భారత్ నుంచి శ్రీసిటీ మాత్రమే లీడర్స్ కేటగిరీలో చోటు దక్కించుకోవడం విశేషం. దేశంలోని 15 అత్యున్నత సెజ్‌లలో ఒకటిగా శ్రీసిటీ నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 449 పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లపై జరిపిన అధ్యయనంలో పారిశ్రామిక పార్కులను లీడర్స్, చాలెంజర్స్, ఆస్పిరర్స్‌గా విభజించారు. కాగా 90 పారిశ్రామిక పార్కులను చాలెంజర్ కేటగిరీలో, 185 పార్కులను ఆస్పిరర్స్‌గా చేర్చారు.
ఈ రేటింగ్‌లు ఇప్పటికే ఉన్న కీలక పారామీటర్స్, మౌలిక సదుపాయాల ఆధారంగా కేటాయించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ ఈ నివేదికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నివేదిక భారతదేశ పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని తెలిపారు. కాగా, ఐపీఆర్‌ఎస్ రేటింగ్‌పై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గౌరవం శ్రీసిటీ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు, పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణానికి, స్థిరమైన పర్యావరణ ఉత్తమ పద్ధతులకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు.
శ్రీసిటీ.. ఇట్స్ ఎ బ్రాండ్!
Published Wed, Oct 6 2021 4:31 AM | Last Updated on Wed, Oct 6 2021 4:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment