ఇందుకు శ్రీసిటీ వేదిక కావాలి.. 15 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవాలు.. మరో 7 సంస్థలకు శంకుస్థాపన
5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
సీఈవోలతో భేటీ.. ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులపై చర్చ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/శ్రీసిటీ (వరదయ్యపాళెం): వివిధ పరిశ్రమలకు వేదికగా ఉన్న శ్రీసిటీ నుంచి తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామిక రంగం వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇప్పుడు సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో సోమవారం వివిధ పరిశ్రమలకు చంద్రబాబు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు.
శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించి మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతోపాటు ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించి, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులపై చర్చించారు.
అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా శ్రీసిటీ..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈరోజు ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయం. శ్రీసిటీలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. శ్రీసిటీలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడం, 4 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించడం గొప్ప విషయం. శ్రీసిటీని స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా గుర్తించాం. 30 దేశాలు శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సంపద çసృష్టి.. సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది.
చెన్నై, కృష్ణపట్నం, తిరుపతికి శ్రీసిటీ దగ్గరగా ఉంది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జో¯Œన్‌గా తీర్చిదిద్దాలనేదే నా ఆలోచన. నేను 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించాను. అప్పట్లోనే విజన్ 2020కి రూపకల్పన చేసి అమలు చేశా. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించా. భారత్‌ను ఐటీ ప్రపంచపటంలో నిలిచేలా చేస్తుందని ఆనాడే చెప్పా. ఈరోజు దాని ఫలితాలు అందరూ చూస్తున్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి.జి.భరత్, వంగలపూడి అనిత, డీజీపీ, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సోమశిల ప్రాజెక్టుకు పరిరక్షణకు చర్యలు..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. రాష్ట్రంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామన్నారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా రూ.20 వేల సాయం అందిస్తామని తెలిపారు. సోమశిల ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేలా దాని పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమశిల జలాశయం 1988–89లోనే అప్పటి సీఎం ఎన్‌టీ రామారావు 75 టీఎంసీలు చేశారని చంద్రబాబు మాట్లాడడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. వైఎస్సార్ హయాంలోనే 72 టీఎంసీలకు సోమశిల చేరింది.
Comments
Please login to add a commentAdd a comment