గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను శ్రీ సిటీలో మళ్లీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
జీఐఎస్‌లో ఒప్పందం చేసుకున్న బెల్ ఫ్లేవర్స్, జెన్ లెనిన్ కంపెనీల ఉత్పత్తి ప్రారంభం
విశాఖ నుంచి శ్రీసిటీకి తరలించిన ఎల్‌జీ పాలిమర్స్ వాణిజ్య కార్యకలాపాలు షురూ
నాటి మంత్రి గుడివాడ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న రెండు కంపెనీలకు శంకుస్థాపన
ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్, టీఐఎల్ హెల్త్‌కేర్ రెండో దశలకు గత ప్రభుత్వ హయాంలోనే విస్తరణ ఒప్పందాలు
వైఎస్ జగన్ ఇచి్చన ప్రోద్భలంతో మరింత విస్తరణకు ముందుకు వచి్చన డైకిన్, ఎక్సలెంట్ ఫార్మా
గత ప్రభుత్వ కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడంపై పరిశ్రమ వర్గాల విస్మయం
సాక్షి, అమరావతి/శ్రీసిటీ (వరదయ్యపాళెం): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా శ్రీ సిటీలో మళ్లీ లాంఛనంగా ప్రారంభించారు. రూ.1,570 కోట్ల విలువైన ఈ 16 కంపెనీల్లో ఇప్పటికే చాలా సంస్థలు వాణిజ్యపరంగా ఎప్పుడో ఉత్పత్తిని మొదలుపెట్టేశాయి. మరికొన్ని నిర్మాణాలను పూర్తి చేసే స్థితిలో ఉన్నాయి. అయినప్పటికీ తన హయాంలోనే ఈ కంపెనీలు వచ్చినట్టు.. వీటి ద్వారా 8,480 మందికి ఉపాధి కల్పించినట్లు చంద్రబాబు చెప్పుకోవడం గమనార్హం. ఈప్యాక్ డ్యూరబుల్స్, ఓజీ ఇండియా, ఎల్జీ పాలిమర్స్ వంటి కంపెనీలుఎప్పుడో వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించాయి.
కానీ సీఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 16 కంపెనీలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని కూడా ప్రారంభించామంటూ చెప్పుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఏ విధంగా పరుగులు తీసిందో.. విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో కుదిరిన ఒప్పందాలు ఎంత తొందరగా వాస్తవ రూపంలోకి వచ్చాయో పరోక్షంగా ప్రజలకు చాటిచెప్పారు. తద్వారా రాష్ట్రంలో గత ప్రభుత్వమే పారిశ్రామికాభివృద్ధికి బాటలు పరిచిందని.. దానికి తాము రాజముద్ర వేశామని చెప్పుకున్నట్టైంది.
వాస్తవంలోకి జీఐఎస్ ఒప్పందాలు
2023లో విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్)లో గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బెల్ ప్లేవర్స్ అండ్ ఫ్రాగ్నెసెస్ ఇండియా లిమిటెడ్, జెన్ లినెన్, డైకిన్, ఏజీపీ సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ఇప్పుడు వాస్తవరూపంలోకి వచ్చినట్లు చంద్రబాబు శ్రీసిటీ వేదికగా ఒప్పుకున్నారు. ఇందులో ఏజీపీ గ్యాస్ రూ.10,000 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా డైకిన్ రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం చేసుకోవడమే కాకుండా ఇప్పటికే రూ.500 కోట్లతో తొలి దశను పూర్తి చేసింది.
వాస్తవం ఇదయితే చంద్రబాబు మాత్రం ఆ సంస్థ ఇప్పుడు రూ.1,000 కోట్లతో విస్తరణకు కొత్తగా ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారానికి దిగారు. రూ.1,213 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి కొత్తగా చేసుకున్న ఒప్పందాలు, అదే విధంగా రూ.900 కోట్లకు సంబంధించి చేపట్టిన శంకుస్థాపన ప్రాజెక్టుల్లో అత్యధికం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చి ఉత్పత్తిని ప్రారంభించి విస్తరణ కార్యక్రమాలు చేపట్టినవే. ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్స్, టీఐఎల్ హెల్త్‌కేర్, డైకిన్, ఎక్స్‌లెంట్ ఫార్మా ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే.
గత ప్రభుత్వ ఘనతలు బాబు ఖాతాలోకే..
2020లో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరగడంతో అప్పటి ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. జనావాసాల మధ్య ఉన్న కంపెనీని మూసివేయించి శ్రీసిటీలోని రెడ్‌జోన్ పరిధిలోకి తరలించింది. గత ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడంతో ఎల్జీ పాలిమర్స్ వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని వాణిజ్యపరంగా ఉత్పత్తిని కూడా ప్రారంభించింది.
అలాగే కోవిడ్ తర్వాత చైనా నుంచి దిగుమతులు తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పథకం కింద శ్రీసిటీలో బ్లూస్టార్, డైకిన్, ఈప్యాక్, హావెల్స్, పానాసోనిక్ వంటి అనేక ఏసీ తయారీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా అవి భారీ విస్తరణ కార్యక్రమాలను కూడా గతంలోనే ప్రకటించాయి. అనేక ఏసీ తయారీ కంపెనీలు రావడంతో వీటికి అనుబంధంగా విడిభాగాలు తయారు చేసే సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు రూ.10 కోట్లు, రూ.20 కోట్లతో ఏర్పాటయ్యాయి. వాటిని కూడా చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకోవడం పట్ల పరిశ్రమల వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
గతేడాది శ్రీసిటీలో రూ.9 వేల కోట్లు పెట్టుబడులు..
శ్రీసిటీ యాజమాన్యం ఏటా శ్రీసిటీకి వచ్చే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేస్తోంది. ఈ క్రమంలో 2023లో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించింది. తద్వారా 21,500 ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొంది. ఈ పెట్టుబడుల ద్వారా 18 కొత్త పరిశ్రమల స్థాపన, 7 పరిశ్రమల విస్తరణ జరిగినట్లు తెలిపింది. గతేడాది మార్చి 5న విశాఖ పెట్టుబడుల సదస్సులో బ్లూస్టార్ ఏసీ పరిశ్రమను సీఎం వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. నేడు అదే బ్లూస్టార్ పరిశ్రమకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేపట్టడం గమనార్హం. అలాగే గతేడాది నవంబర్ 23న డైకిన్ ఏసీ పరిశ్రమ ప్రతినిధులు ఆ సంస్థ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు.
అదే పరిశ్రమకు సీఎం చంద్రబాబు తాజాగా ఎంవోయూ కుదుర్చుకున్నారు. అలాగే 2023లోనే ఉత్పత్తులు ప్రారంభమైన ఎక్స్‌లెంట్ ఫార్మా పరిశ్రమ విషయంలోనూ ఇలాగే చేశారు. గతేడాదే ఉత్పత్తులు ప్రారంభించిన ఎన్‌జీసీ, ఆర్‌ఎస్‌బీ ట్రాన్స్‌మిషన్ పరిశ్రమలకు సైతం చంద్రబాబు భూమిపూజ చేయడం పట్ల పరిశ్రమ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇదే కోవలో ఈప్యాక్ డ్యురబుల్స్, బెల్ ప్లేవర్స్ అండ్ ఫ్రాగ్నెసెస్, జేజీఎల్ మెటల్ కన్వర్టర్స్, ఈఎస్‌ఎస్‌కే కాంపొనెంట్స్, జెన్‌లెనిన్ ఇంటర్నేషనల్ పరిశ్రమలకు కూడా ప్రారంభోత్సవాలు చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment