అటువంటి నెగెటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలి
ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నా
అన్ని దేశాల కంపెనీల ప్రతినిధులను ఒకేచోట కలిసే నెట్‌వర్కింగ్ సమావేశమిది
రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ, అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ యూనిట్లు
మీడియాతో సీఎం చంద్రబాబు
ఒప్పందాలు కుదరకపోవడంతో యూటర్న్ తీసుకున్న బాబు
సాక్షి, అమరావతి: ‘పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ వెళుతున్నా. 1995లో సీఎం అయినప్పటి నుంచి ఏటా దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నా. ఎవరూ సీఐఐ, దావోస్‌ను పట్టించుకోని తరుణంలో వాటిని నేనే ప్రమోట్ చేశా. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధించా’ నిన్నటివరకు ఇలా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు దావోస్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చిన తర్వాత మాట మార్చేశారు.
అసలు దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య మాత్రమేనని, ఇటువంటి నెగెటివ్ ఆలోచనల నుంచి మీడియా తక్షణం బయటకు రావాలంటూ సరికొత్త రాగం అందుకున్నారు. శనివారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం ఎటువైపు పోతోందన్న విషయంపై జ్ఞానం పెంచుకోవడంతోపాటు అనేక దేశాల పారిశ్రామికవేత్తలను ఒకేచోట కలిసే నెట్‌వర్కింగ్ కేంద్రం దావోస్’ అంటూ సెలవిచ్చారు.
ఒప్పందాల కోసం దావోస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని అవి ఇక్కడే చేసుకోవచ్చన్నారు. ఈసారి దావోస్ పర్యటనలో గడిచిన ఐదేళ్లలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్‌ను పునరుద్ధరించడంపై దృష్టి సారించామని, పెట్రోనాస్, డీపీ వరల్డ్, సిస్కో, వాల్‌మార్ట్, యూనీలీవర్, పెప్సికో వంటి అనేక సంస్థల ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నామని, పెట్టుబడుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండటం మంచిదేనని అన్నారు.
దేశానికి ముంబై ఆర్థిక రాజధాని కావడంతో అక్కడ భారీ పెట్టుబడులు వచ్చాయని, తాను గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో అక్కడ పెట్టుబడులు వచ్చాయన్నారు. హైదరాబాద్ కేవలం తెలంగాణ వారిది కాదని, తెలుగు వారందరిగా దానిని చూడాలన్నారు. గతంలో దావోస్ అంటే ధనవంతుల కోసం అనే భ్రమ ఉండేదని, అందుకే దేశంలోని రాజకీయ నాయకులు అక్కడికి వెళితే తమ ఓట్లు పోతాయని భయపడేవారని చెప్పారు.
అటువంటి సమయంలో 1995 నుంచి ఇండియాలో దావోస్‌ను తాను ప్రమోట్ చేశానన్నారు. తాను వెళ్లడం ప్రారంభించిన తర్వాతే అప్పటి కర్ణాటక సీఎం ఎస్‌ఎం కృష్ణ దావోస్‌కు వచ్చి పెట్టుబడుల కోసం పోటీ పడేవారని, తాను హైదరాబాద్‌ను ప్రమోట్ చేస్తే కృష్ణ బెంగళూరును ప్రమోట్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షించేవారన్నారు.
పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు
కొత్తగా నిర్మిస్తున్న పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ భారీ రిఫైనరీ, అనకాపల్లి వద్ద అర్సెలర్ మిట్టల్ 14 మిలియన్ టన్నుల స్టీల్‌ప్లాంట్స్ పోర్టు ఆధారంగా ఏర్పాటవుతున్నాయన్నారు. దీంతోపాటు ఎల్‌జీ రాష్ట్రంలో రూ.5 వేల కోట్లు, గ్రీన్‌కో కంపెనీ కాకినాడ వద్ద గ్రీన్ అమ్మోనియా, విశాఖ వద్ద ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ యూనిట్, రిలయన్స్ రూ.60 వేల కోట్లతో 500కు పైగా బయో ఫ్యూయల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయని.. రానున్న కాలంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ ప్రధాన హబ్‌గా తయారు కానుందన్నారు.
టెక్నాలజీ రంగంలో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకు వస్తోందని, అమెరికాలోని పన్ను చెల్లింపుల సమస్యపై ఒక స్పష్టత రాగానే విశాఖలో గూగుల్ సేవలను ప్రారంభిస్తుందన్నారు. ఇప్పటికే విశాఖకు టీసీఎస్ వచ్చిందని, గూగుల్ రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. టాటా గ్రూపుతో కలిసి ఎయిర్‌పోర్టు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో వైద్య, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంచే అంశంపై దృష్టి సారించాల్సిందిగా బిల్‌గేట్స్‌ను కోరినట్టు తెలిపారు.
సీఐఐ సహకారంతో రాష్ట్రంలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి జిందాల్ గ్రూపుతో దావోస్‌లో చర్చలు జరిపానని, రాష్ట్రం నుంచి జిందాల్ గ్రూపు వెళ్లిపోతోందన్న వార్తల్లో నిజం లేదన్నారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ మీద నమ్మకం లేకపోతే ఎవరైనా మారతారని, ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడను అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ రాకపోతే నేర్పించా..
ఇండియాలో దావోస్‌ను, సీఐఐని నేనే ప్రమోట్ చేశా
» గతంలో దావోస్ అంటే కేవలం ధనికులు అనే ముద్ర ఉండేది. అక్కడికి వెళితే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్లేవారు కాదు. సీఎంగా నేను వెళ్లినప్పటి నుంచే మిగిలిన వాళ్లు రావడం మొదలు పెట్టారు.
» 1997లో దావోస్ వెళ్లి హైదరాబాద్ అనగానే ఏది పాకిస్థాన్‌లోని హైదరాబాదా అని అడిగేవారు.
» 25 హైస్కూల్స్ కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాను.
» నన్ను చూసి దావోస్ వచ్చిన అప్పటి కర్ణాటక సీఎం ఎస్‌ఎం కృష్ణ హైదరాబాద్‌లో ఏముంది బెంగళూరు రండి అనేవారు. ఆ తర్వాత నేను హైదరాబాద్‌లో చేసిన ప్రగతి చూసి ఎస్‌ఎం కృష్ణ కాంప్రమైజ్ అయ్యారు.
» ఐటీ అంటే ఏమిటో మనవాళ్లకు అర్థంకాని సమయంలో ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాను.
» నేను అప్పట్లో పీసీ (పర్సనల్ కంప్యూటర్) అంటే అందరూ పోలీస్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకునేవారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ సరిగా మాట్లాడటం రాకపోతే లండన్ నుంచి ప్రొఫెసర్లను రప్పించి ఇంగ్లిష్‌లో నైపుణ్య శిక్షణ ఇప్పించాను.
» 1995లో ఐటీని ప్రమోట్ చేస్తే.. ఇప్పుడు 2025లో ఏఐని ప్రమోట్ చేస్తున్నా.
» కార్పొరేట్–పబ్లిక్ గవర్నెన్స్‌లో రాణించే విధంగా సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ద్వారా తయారు చేస్తా.
» హైదరాబాద్‌ని తెలంగాణ వాళ్లదిగా చూడకూడదు. అది తెలుగు వారందరిగా పరిగణించాలి. ఆ విధంగానే హైదరాబాద్‌ను ప్రమోట్ చేశాను.
» ఏడాదికి సగటున 15 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.58 లక్షల నుంచి 2047నాటికి రూ.58 లక్షలకు పెంచుతాను.
» నేను ఇప్పుడివన్నీ చెబితే మీకు కథలుగా కనిపిస్తాయి. కానీ గత 30 ఏళ్లలో జరిగిన.. నేను చేసిన అభివృద్ధే దీనికి నిదర్శనం.
» గతంలో నువ్వు ల్యాప్‌టాప్‌లోని డాష్‌బోర్డుతో హైదరాబాద్ గురించి చక్కగా ప్రమోట్ చేశావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నావా అని బిల్‌గేట్స్ అడిగారు.
» మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో (ఏఐ) మహారాష్ట్రను హబ్‌గా చేస్తాను అంటే.. ఇక్కడ నేను ఉన్నాను. అది నీవల్ల అయ్యేపని కాదు. ప్రతి ఇంటికి ఒక ఏఐని తీసుకువస్తా అని చెప్పాను.
Comments
Please login to add a commentAdd a comment