న్యూఢిల్లీ: నెలవారీ ఎగుమతులు-దిగుమతుల గణాంకాలను నెలకు ఒకసారి మాత్రమే విడుదల చేసే విధానాన్ని తిరిగి ప్రారంభించాలని వాణిజ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. దేశ వాణిజ్యం గురించి స్పష్టమైన చిత్రాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అక్టోబర్ 2020 నుంచి నెలకు రెండుసార్లు వాణిజ్య డేటా విడుదలవుతోంది.
తొలి గణాంకాలు నెల మొదట్లో వెలువడితే, తుది గణాంకాలు నెల మధ్యన వెలువడుతున్నాయి. రెండు గణాంకాల భారీ వ్యత్యాసాలూ నమోదవుతున్నాయి. గడచిన మూడు నెలల్లో తొలుత క్షీణత నమోదుకావడం, తుది గణాంకాల్లో వృద్ధి ధోరణికి మారడం సంభవిస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో అస్పష్టత నివారణ, ఒకేసారి స్పష్టమైన తుది గణాంకాల విడుదల లక్ష్యంగా మంత్రిత్వశాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిప్రకారం రానున్న అక్టోబర్ గణాంకాలు నవంబర్ నెల మధ్యలో విడుదలవుతాయి.
గడచిన మూడు నెలలూ ఇలా...
తుది, తొలి గణాంకాల్లో భారత్ వస్తు వాణిజ్య లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. గడచిన మూడు నెలలుగా పరిస్థితి చూస్తే, తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment