Trade data
-
ఇక నెలకు ఒకసారే వాణిజ్య గణాంకాలు
న్యూఢిల్లీ: నెలవారీ ఎగుమతులు-దిగుమతుల గణాంకాలను నెలకు ఒకసారి మాత్రమే విడుదల చేసే విధానాన్ని తిరిగి ప్రారంభించాలని వాణిజ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. దేశ వాణిజ్యం గురించి స్పష్టమైన చిత్రాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అక్టోబర్ 2020 నుంచి నెలకు రెండుసార్లు వాణిజ్య డేటా విడుదలవుతోంది. తొలి గణాంకాలు నెల మొదట్లో వెలువడితే, తుది గణాంకాలు నెల మధ్యన వెలువడుతున్నాయి. రెండు గణాంకాల భారీ వ్యత్యాసాలూ నమోదవుతున్నాయి. గడచిన మూడు నెలల్లో తొలుత క్షీణత నమోదుకావడం, తుది గణాంకాల్లో వృద్ధి ధోరణికి మారడం సంభవిస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో అస్పష్టత నివారణ, ఒకేసారి స్పష్టమైన తుది గణాంకాల విడుదల లక్ష్యంగా మంత్రిత్వశాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిప్రకారం రానున్న అక్టోబర్ గణాంకాలు నవంబర్ నెల మధ్యలో విడుదలవుతాయి. గడచిన మూడు నెలలూ ఇలా... తుది, తొలి గణాంకాల్లో భారత్ వస్తు వాణిజ్య లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. గడచిన మూడు నెలలుగా పరిస్థితి చూస్తే, తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. -
మూడు నెలల్లో రూ. 10వేల కోట్లు
శ్రీనగర్ : కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి వ్యాపారంలో భారీగా నష్టపోయింది. ఇది మూడు నెలల్లో 10,000 కోట్లకు పైమాటేనని స్థానిక ట్రేడ్‌బాడీ తెలిపింది. ఆగస్టు-5, 2019 నుంచి మూడునెలల్లో రూ. పదివేల కోట్ల వ్యాపార నష్టం జరిగినట్లు నివేదించింది. గత మూడు నెలలనుంచి కశ్మీర్ లోయలో పరిస్థితి ఇంకా సాధారణస్థితికి రానందున నష్టాల స్వభావాన్ని అంచనా వేయడం కష్టమని కాశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు షేక్ ఆశిక్ అన్నారు. కాశ్మీర్లో వ్యాపార నష్టాలు ఈ మూడు నెలల్లో రూ. 10,000 కోట్లు దాటేశాయని, దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ఇటీవలి వారాల్లో కొంత వ్యాపార కార్యకలాపాలు జరిగినప్పటికీ, మందకొడిగానే జరిగిందని షేక్ ఆశిక్ తెలిపారు. ఇది దీర్ఘకాలంలో భారీ పరిణామాలనుచూపుతుందని ఆయన అన్నారు. వివిధ వ్యాపార రంగాలను ఉటంకిస్తూ ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయాన్న పూర్తిగా పునరుద్దరించలేదని, ప్రస్తుత తరుణంలో ఇంటర్నెట్ ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా హస్తకళా రంగానికి సంబంధించి జూలై-ఆగస్టులో ఆర్డర్లను స్వీకరిస్తారు. క్రిస్మస్, నూతన సంవత్సరం నాటికి ఉత్పత్తులను వారికి పంపిణీ చేయాలి. యుఎస్, యూరప్‌లో సేవలందిస్తున్న సంస్థలు కశ్మీర్లో ఉన్నాయని, ఇంటర్నెట్ సదుపాయాలను నిలిపివేయడం వల్ల వ్యాపారం దెబ్బతింటుందని ఆశిక్ అన్నారు. కనెక్టివిటీ లేక ఆర్డర్లు లేని కారణంగా 50వేల మందికి పైగా చేతివృత్తులవారు, చేనేత కార్మికులు ఉద్యోగాలు కోల్పోనున్నారనీ చెప్పారు. కేవలం నష్టాలు మాత్రమే కాదు..వ్యాపారం చేసినా, చేయకపోయినా, జీఎస్టీ, ఆన్లైన్ రిటర్న్‌లాంటి టెక్నికల్ ఇబ్బందులు తమకు తప్పవని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్లో వ్యాపారాలు నష్టపోతాయని, ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్న విషయాన్ని అధికార యంత్రాంగానికి తెలియజేశామన్నారు. అంతేకాదు నష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, వ్యాపారుల బాధలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆశిక్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
ఎగుమతులు నిరుత్సాహం
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్‌లో నిరాశపరిచాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా ఈ విలువ 5.04 శాతం క్షీణించింది. ఆరు నెలల తరువాత ఎగుమతుల రంగంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది. విలువ రూపంలో కేవలం 26.09 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇక దిగుమతుల విషయానికి వస్తే- ఇవి 3.62 శాతం పెరిగాయి. ఈ విలువ 39.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దీనితో ఎగుమతులు-దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు ఈ నెలలో 13.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 10.59 బిలియన్ డాలర్లు. బంగారంపై ఆంక్షలు కొనసాగింపు!? బంగారం దిగుమతులు పెరగడం వాణిజ్యలోటు భారీగా ఉండడానికి కారణాల్లో ఒకటి. 2013 అక్టోబర్‌లో బంగారం దిగుమతుల విలువ 1.09 బిలియన్ డాలర్లు. అయితే 2014 అక్టోబర్‌లో ఈ విలువ ఏకంగా 4.17 బిలియన్ డాలర్లకు ఎగసింది. బంగారం, వెండి రెండింటినీ చూస్తే ఈ విలువ 1.38 బిలియన్ డాలర్ల నుంచి 4.85 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఆయిల్ దిగుమతులు తగ్గడం వల్ల వాణిజ్య లోటు ఈ స్థాయిలో ఉందికానీ, లేదంటే ఈ లోటు మరింత పెరిగేదని నిపుణుల వ్యాఖ్య. నెలవారీగా చూస్తే అంటే సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే- వాణిజ్యలోటు 14.25 బిలియన్ డాలర్ల నుంచి 13.36 బిలియన్ డాలర్లకు తగ్గింది. పండుగల సీజన్లో డిమాండ్ పెరగడమే పసిడి దిగుమతుల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడిలో భాగంగా ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కనకం దిగుమతుల కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్ల ఈ మెటల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. కాగా వరుసగా రెండవ నెల (సెప్టెంబర్ 4.22 బిలియన్ డాలర్లు) బంగారం దిగుమతులు 4 బిలియన్ డాలర్లు పైగా నమోదుకావడం- తాజా ఆందోళనకు కారణమవుతోంది. ఈ మెటల్ దిగుమతుల కట్టడికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సోమవారం తెలిపారు. పరిమాణం రూపంలో 2014 అక్టోబర్‌లో బంగారం దిగుమతుల పరిమాణం 150 టన్నులుగా ఉంది. 2013 ఇదే నెలలో ఈ పరిమాణం 24 టన్నులు. తాజా పరిణామం చూస్తుంటే... బంగారం దిగుమతులపై ఆంక్షలు మరికొంతకాలం తప్పేట్లు లేదని నిపుణుల వ్యాఖ్య. అమెరికా, యూరప్‌ల స్థితికి అద్దం! అమెరికా, యూరప్‌లలో మందగమన పరిస్థితులే ఎగుమతుల క్షీణతకు ప్రధాన కారణమని భారత ఎగుమతిదారుల సంఘం (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు. ఎగుమతిదారులకు సహాయం చేయడానికి ప్రభుత్వం కూడా ఇంకా ముందుకు రాకపోవడం పట్ల ఆయన నిరాశను వెలిబుచ్చారు. ఎగుమతిదారులకు సానుకూలమైన కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని సీఐఐ జాతీయ కమిటీ (ఎగుమతులు, దిగుమతుల విభాగం) చైర్మన్ సంజయ్ బుధియా అన్నారు. ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్‌ను మళ్లీప్రవేశపెట్టాలని ఈ రంగం కోరుతోంది.