పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి | Please set up the board of the yellow crops | Sakshi
Sakshi News home page

పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి

Published Fri, Jun 13 2014 12:59 AM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి - Sakshi

పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి

కేంద్ర వాణిజ్య మంత్రికి ఎంపీ కవిత వినతి
 
న్యూఢిల్లీ: పసుపు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత గురువారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి విజ్ఞప్తిచేశారు. తెలంగాణలో పండుతున్న ప్రధాన వాణిజ్య పంటల్లో పసుపు కూడా ఒకటని, అయితే ఈ పంటను శాస్త్రీయ పద్ధతుల్లో పండించేందుకు తగిన మెలకువలు గానీ, ఇతరత్రా సహకారం గానీ రైతులకు అందడం లేదని పేర్కొన్నారు. రైతులు కేవలం స్థానిక విత్తనాలు, రకాలపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ పంట పండిస్తున్నవారిలో ఎక్కువ భాగం చిన్న, సన్నకారు రైతులేనని వివరించారు.

ఇతర సుగంధ ద్రవ్య పంటలకు అందే ఇన్‌పుట్ సబ్సిడీ ఈ ముఖ్యమైన పంటకు మాత్రం ఇవ్వడం లేదని మంత్రికి చెప్పారు. శాస్త్రీయ పద్ధతులు తెలియక రైతులు భారీగా పంట నష్టపోతున్నారని, ఈ పంటను ప్రాసెసింగ్ చేసే సౌకర్యాలు తెలంగాణలో ఎక్కడా లేవని వివరించారు. ప్రస్తుతం పసుపు పంట స్పైసెస్ బోర్డు పరిధిలో ఉందని, ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని విన్నవించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ‘పసుపుపై తగినంత పరిశోధనలు జరగడంలేదు. ఈ పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని నిర్మలా సీతారామన్‌ను కలిశాం. మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement