Turmeric farmer
-
పసుపు బోర్డు ఏర్పాటుకు బ్రేక్ పడినట్లేనా?!
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): పసుపు రైతుల చిరకాల స్వప్నమైన పసుపు బోర్డు ఏర్పాటుకు బ్రేక్ పడినట్లేననే వాదన వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, సహాయ మంత్రి పురుషోత్తం రూపాలలు పసుపు బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా పసుపు పంట సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోనే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పసుపు సుగంధ ద్రవ్యాల బోర్డులో ఒక భాగమని వెల్లడవుతుంది. కానీ పసుపు పంటకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వివిధ రాజకీయ పక్షాలు పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇచ్చాయి. ఈక్రమంలో కేంద్రం ప్రకటనతో పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తే.. పొగాకు బోర్డు, మిర్చి బోర్డుల తరహాలోనే ³సుపు బోర్డు ఏర్పాటు చేస్తే పంట సాగు విస్తీర్ణంను నియంత్రించడంతో పాటు మినిమం సపోర్టు ప్రైస్(ఎంఎస్పీ)ని ప్రకటించడం లేదా మద్దతు ధరను అమలు చేయడం జరుగుతుంది. అలాగే పసుపు సాగు చేసే రైతులకు మెళుకువలను తెలియజెప్పి నాణ్యమైన పంటను సాగు చేయించడం జరుగుతుంది. పసుపు సాగు మొదలుకొని మార్కెటింగ్ వరకు పసుపు బోర్డు కనుసన్నలలోనే సాగుతుంది. పసుపు బోర్డు ఏర్పాటు జరిగితే తమకు ఎలాంటి నష్టం కలుగదని పైగా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని రైతులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సాగు అయ్యే పసుపు పంటలో 80 శాతం పసుపు నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లోనే సాగు అవుతుంది. అందువల్ల నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. పసుపు బోర్డు సాధనే లక్ష్యంగా 2019 పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి అత్యధిక సంఖ్యలో రైతులు పోటీ చేసిన విషయం విదితమే. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోను ఇక్కడి రైతులు కొందరు పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్‌తో పోటీ చేశారు. పసుపు బోర్డు విషయంలో కేంద్రం స్తబ్దంగా ఉండటం, రైతులు పట్టు వీడకపోవడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. బీజేపీ నేతలు వంచించారు పసుపు బోర్డు ఏర్పాటు విషయమై బీజేపీ నేతలు రైతులను వంచించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామ ని పార్లమెంట్ ఎన్నికల్లో హా మీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు. పసుపు బోర్డు సాధించేవరకు మేము నిద్రపోం. – పవన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మోర్తాడ్ రైతుల ఆకాంక్షను నెరవేర్చాలి రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలి. రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారు. రైతుల ఆశయాలను సాకా రం చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉంది. బీజేపీ నాయకత్వం చొరవ తీసుకుని పసుపు బోర్డును ఏర్పాటు చేయించాలి. – తక్కూరి సతీష్, మోర్తాడ్ పసుపు బోర్డు ఏర్పాటు అవసరం లేదు: పురుషోత్తమ్ రూపాలా -
కాళ్లు మొక్కుతా.. మద్దతు ఇవ్వండి
‘మీ కాళ్లు మొక్కుతా సారు. పసుపు పంటకు మద్దతు ధర ఇప్పించుండ్రి. పసుపు పండించి ఏటా నష్టపోతున్నాం. చేసిన కష్టానికి ఫలితం కాదు కదా, పెట్టిన పెట్టుబడి కూడా అత్తలేదు. పసుపు పండించమంటేనే భయమైతుంది. రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. మా పరిస్థితిని దయచేసి అర్థం చేసుకోండి సారు.. రూ.15 వేలు కాకపోయినా కనీసం రూ.10 వేల మద్దతు ధర వచ్చేలా చూడుండ్రి’ రైతులతో ఎంపీ ముఖాముఖి కార్యక్రమంలో మోతెకు చెందిన రైతు సంజీవ్ ఆవేదన ఇది. సమావేశంలో ఆయన అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, తన గోడు వెల్లబోసుకున్నాడు. రైతుల దయనీయ స్థితిని వివరిస్తూ పసుపు పంటకు మద్దతు ధర ఇప్పించాలని వేడుకున్నాడు. మోర్తాడ్(బాల్కొండ): చర్చలు ఫలించలేదు.. రైతుల ఆశలు తీరలేదు.. పసుపుబోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధర ప్రధాన ఎజెండాగా సాగిన రైతు అభ్యర్థులతో ఎంపీ అర్వింద్ ముఖాముఖి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎటూ తేల్చకుండానే ఈ కార్యక్రమం అసంపూర్తిగా ముగిసింది. అయితే, రైతుల ఆవేదన వెల్లబోసుకునేందుకు ‘ముఖాముఖి’ వేదికైంది. పంట సాగుకు పెడుతున్న పెట్టుబడులు, తాము పడుతున్న కష్టాలు, తమకు వస్తున్న నష్టాలను కళ్ల కు కట్టినట్లు కర్షకులు వివరించారు. కాళ్లు మొక్కుతామని, తమ కష్టాలు తీర్చాలని ప్రాధేయపడ్డా రు. అయితే, పసుపు పంటకు మద్దతు ధర అంశం కేంద్రం పరిధిలో ఉండదన్న ఎంపీ.. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదనలు పంపిస్తే న్యాయం చేస్తామని తెలిపారు. అయితే, గతంలో ఇచ్చిన హామీ మేరకు పది రోజుల్లో పసుపుబోర్డు తేవాలని, లేకుంటే పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశా రు. ఈ క్రమంలో వాడివేడీగా వాదనలు సాగాయి. ఎటూ తేల్చకుండానే చర్చలు ముగిశాయి. ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ అర్వింద్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వాగ్వాదం తరలి వచ్చిన రైతు అభ్యర్థులు.. పసుపుబోర్డు ఏర్పాటుతో పాటు మద్దతు ధర కోసం ఏళ్లుగా పోరాడుతున్న రైతులు.. 2019 లోక్‌సభ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. నిజామాబాద్ స్థానం నుంచి 178 మంది రైతులు పోటీలో నిలిచి దేశ వ్యాప్త చర్చకు అవకాశమిచ్చా రు. అయితే, ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కా వొస్తున్నా పసుపుబోర్డు ఏర్పాటు కాకపోవడం, మ ద్దతు ధర లభించక పోవడంతో రైతులు మరోమా రు ఉద్యమాన్ని లేవదీశారు. ఈ నేపథ్యంలో స్పందించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రైతు అభ్యర్థులు, రైతు సంఘాల ప్రతినిధులతో కమ్మర్పల్లి మండలం చౌట్‌పల్లిలోని ఓ ఫంక్షన్లో హాల్లో శనివారం సమావేశమయ్యారు. మన జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన ఎంపీ అభ్యర్థులు, రైతు సంఘాల ప్రతినిధులు తరలి వచ్చారు. బోర్డు, మద్దతు ధర కావాలి.. రాజకీయ పార్టీలకతీతంగా నిర్వహించిన ఈ ముఖాముఖిలో ఎంపీ అభ్యర్థులు.. పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధర అంశాన్నే ప్రధానంగా లేవనెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేయాల్సిందేనని, రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అర్వింద్ పసుపుబోర్డు ఏర్పాటుపై బాండ్ పేపర్ రాసి ఇచ్చిన విషయాన్ని రైతులు పదే పదే గుర్తు చేశారు. హామీకి కట్టుబడి ఉన్నానన్న ఎంపీ.. అయితే, తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని ఎంపీ అర్వింద్ తెలిపారు. తాను ఎన్నికైన వెంటనే పసుపుబోర్డుకు మించి సేవలందించే స్పైసిస్‌బోర్డు, ఇతర పథకాలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించానని వివరించారు. 2019 మే చివరి వారంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టగా, జూన్ నెలలోనే తన పని తాను మొదలు పెట్టానని తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయెల్, హోం మంత్రి అమిత్‌షాలను సంప్రదించి స్పైసిస్‌బోర్డు రీజినల్ కార్యాలయాన్ని సాధించామని వివరించారు. పసుపు ధర పెరగాలంటే దళారీ వ్యవస్థ ఉండకూడదని, ఇందుకోసం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చామని చెప్పారు. ప్రాంతీయ పంటలకు మద్దతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తే అవసరమైన కార్యాచరణ అమలు చేయడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంగీకరించని రైతులు.. అయితే, ఎంపీ చెప్పిన అంశాలను రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు. పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధర ప్రకటన రెండే అంశాలను ఎజెండాగా తాము చర్చలకు వచ్చామని, వీటిపై స్పష్టత ఇవ్వకుండా ఇతర అంశాలను చర్చించడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంపీకి, రైతు అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పలు సందర్భాల్లో రైతులు జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎంపీ అర్వింద్ సమావేశం నుంచి వెళ్లి పోయారు. చర్చలు విఫలమయ్యాయని, పసుపుబోర్డు, మద్దతు ధరపై స్పష్టత రాలేదని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. -
పసుపు రైతులకు గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: తెలంగాణలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ కేంద్రంగా సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ ప్రమోషన్ హబ్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని రకాల సుగంధ ద్రవ్యాల అభివృద్ధి, మార్కెటింగ్ కోసం బోర్డు తరహాలో పూర్తి అధికారాలతో కూడిన ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. టీఐఈఎస్ పథకం కింద ద్రవ్యాల మార్కెటింగ్ హబ్ కోసం మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించనుంది. కాగా మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కుమార్తె కవిత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంలో పసుపు రైతులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని సుమారు 178మంది మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసి.. కవిత ఓటమే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో వారికి అనూహ్యంగా 90 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కవితపై 68వేల పైచిలుకు మెజార్టీతో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన విషయం విదితమే. ఇక తాజాగా తెలంగాణలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. -
పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి
కేంద్ర వాణిజ్య మంత్రికి ఎంపీ కవిత వినతి న్యూఢిల్లీ: పసుపు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత గురువారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి విజ్ఞప్తిచేశారు. తెలంగాణలో పండుతున్న ప్రధాన వాణిజ్య పంటల్లో పసుపు కూడా ఒకటని, అయితే ఈ పంటను శాస్త్రీయ పద్ధతుల్లో పండించేందుకు తగిన మెలకువలు గానీ, ఇతరత్రా సహకారం గానీ రైతులకు అందడం లేదని పేర్కొన్నారు. రైతులు కేవలం స్థానిక విత్తనాలు, రకాలపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ పంట పండిస్తున్నవారిలో ఎక్కువ భాగం చిన్న, సన్నకారు రైతులేనని వివరించారు. ఇతర సుగంధ ద్రవ్య పంటలకు అందే ఇన్పుట్ సబ్సిడీ ఈ ముఖ్యమైన పంటకు మాత్రం ఇవ్వడం లేదని మంత్రికి చెప్పారు. శాస్త్రీయ పద్ధతులు తెలియక రైతులు భారీగా పంట నష్టపోతున్నారని, ఈ పంటను ప్రాసెసింగ్ చేసే సౌకర్యాలు తెలంగాణలో ఎక్కడా లేవని వివరించారు. ప్రస్తుతం పసుపు పంట స్పైసెస్ బోర్డు పరిధిలో ఉందని, ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని విన్నవించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ‘పసుపుపై తగినంత పరిశోధనలు జరగడంలేదు. ఈ పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని నిర్మలా సీతారామన్‌ను కలిశాం. మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు. -
పసుపు రైతు కన్నీరు
నిర్మల్, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా పసుపు పంట నిర్మల్, ఖానాపూర్, ముథోల్, బోథ్ నియోజకవర్గాల్లో సాగవుతోంది. ఈ ఏడాది జిల్లాలో 12,792 ఎకరాల్లో సాగైంది. ఈ పంట తొమ్మిది నెలల కాలంతో కూడిన పంట. ఎకరాకు రైతుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. దీనికి తెగుళ్ల భారం అదనం. ఈ ఏడాది వర్షాభా వం పెరగడంతో తెగుళ్లు ముప్పెటదాడి చేశాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. ఆకుమచ్చ, దుంపకుళ్లు సోకడంతో ఎకరానికి రూ.8 వేల వరకు అదనపు ఆర్థిక భారం అవుతోంది. కలగా మద్దతు ధర.. గతంలో పసుపునకు క్వింటాల్‌కు రూ.15వేల వరకు ధర పలికింది. దీంతో రైతులు పసుపు సాగుపై మక్కువ చూపారు. నాలుగేళ్ల నుంచి పసుపునకు మద్దతు ధర క్వింటాలుకు రూ.5 వేలు కూడా దాటని పరిస్థితి. గతేడాది పసుపునకు క్వింటాల్‌కు రూ.4,500 మించి ధర పలుకలేదు. పంట బాగా ఉంటే ఎకరానికి దాదాపు 20 క్వింటాళ్ల వ రకు పంట దిగుబడి వస్తుంది. అయితే తెగుళ్లతో పంట దిగుబడులు ఈ ఏడాది ఎకరానికి 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడైనా మంచిధర వస్తుందనే ఆశతో సాగు చేస్తున్నారు. మార్కెట్ సౌకర్యం కరువు.. జిల్లాలో పసుపు రైతుకు ఏళ్లుగా మార్కెట్ సౌకర్యం తీవ్రంగా వేధిస్తోంది. రెండేళ్ల క్రితం నిర్మల్ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లను చివరి క్షణాల్లో ప్రారంభించి రూ.4,200 మద్దతు ధరతో దాదాపు 6వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. అయితే గతేడాది ధర లేకపోవడం, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంతో కొనుగోళ్లను చేపట్టలేదు. దీంతో రైతులు పంటను విక్రయించుకోవడానికి దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ మార్కెట్‌కు, దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని సాంవ్లీ మార్కెట్‌కు తరలించి విక్రయించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో పసుపుకు క్వింటాల్‌కు రూ.4,500 మద్దతు ధర ఉంది. పంట మరో పక్షం రోజుల్లో చేతికి రానుంది. అయితే ఇప్పటి వరకు మద్దతు ధర ప్రకటన మాత్రం లేదు. దీంతో రైతులు తీవ్ర వేధనలో పడిపోయారు. కాగా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మంగళవారం తెలంగాణ పసుపు రైతుల మహాగర్జన కార్యక్రమానికి పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ప్రధానంగా క్వింటాల్‌కు రూ.15వేల మద్దతు ధర, ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. లాభం లేదు.. నేను గతేడాది ఎకరంన్నరలో పసుపు సాగు చేశాను. తెగుళ్లతో పంట దిగుబడి తగ్గింది. నాకు వచ్చిన ఎకరంన్నరలోని 18 క్వింటాళ్లను క్వింటాలుకు రూ. 4వేలకు అమ్మాను. ఖర్చేమో దాదాపు రూ.80వేల పైనే అయ్యింది. నష్టమే తప్ప లాభం కానరాలేదు. దీంతో ఈ ఏడాది ఎకరంలోనే పంట వేశాను. ఇప్పటి దాకా రూ.70 వేల వరకు అయ్యాయి. గిప్పుడేమో నిజామాబాద్ మార్కెట్ల ధర రూ. 4వేలపైనే ధర ఉందంటున్నారు. గిప్పుడే గిట్ల ఉంటే పంట చేతికొచ్చే సరికి ఎట్ల ఉంటదో. - నారాయణ, రైతు, పోతారం, మామడ మండలం