నిర్మల్, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా పసుపు పంట నిర్మల్, ఖానాపూర్, ముథోల్, బోథ్ నియోజకవర్గాల్లో సాగవుతోంది. ఈ ఏడాది జిల్లాలో 12,792 ఎకరాల్లో సాగైంది. ఈ పంట తొమ్మిది నెలల కాలంతో కూడిన పంట. ఎకరాకు రైతుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. దీనికి తెగుళ్ల భారం అదనం. ఈ ఏడాది వర్షాభా వం పెరగడంతో తెగుళ్లు ముప్పెటదాడి చేశాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. ఆకుమచ్చ, దుంపకుళ్లు సోకడంతో ఎకరానికి రూ.8 వేల వరకు అదనపు ఆర్థిక భారం అవుతోంది.
కలగా మద్దతు ధర..
గతంలో పసుపునకు క్వింటాల్‌కు రూ.15వేల వరకు ధర పలికింది. దీంతో రైతులు పసుపు సాగుపై మక్కువ చూపారు. నాలుగేళ్ల నుంచి పసుపునకు మద్దతు ధర క్వింటాలుకు రూ.5 వేలు కూడా దాటని పరిస్థితి. గతేడాది పసుపునకు క్వింటాల్‌కు రూ.4,500 మించి ధర పలుకలేదు. పంట బాగా ఉంటే ఎకరానికి దాదాపు 20 క్వింటాళ్ల వ రకు పంట దిగుబడి వస్తుంది. అయితే తెగుళ్లతో పంట దిగుబడులు ఈ ఏడాది ఎకరానికి 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడైనా మంచిధర వస్తుందనే ఆశతో సాగు చేస్తున్నారు.
మార్కెట్ సౌకర్యం కరువు..
జిల్లాలో పసుపు రైతుకు ఏళ్లుగా మార్కెట్ సౌకర్యం తీవ్రంగా వేధిస్తోంది. రెండేళ్ల క్రితం నిర్మల్ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లను చివరి క్షణాల్లో ప్రారంభించి రూ.4,200 మద్దతు ధరతో దాదాపు 6వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. అయితే గతేడాది ధర లేకపోవడం, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంతో కొనుగోళ్లను చేపట్టలేదు. దీంతో రైతులు పంటను విక్రయించుకోవడానికి దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ మార్కెట్‌కు, దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని సాంవ్లీ మార్కెట్‌కు తరలించి విక్రయించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్‌లో పసుపుకు క్వింటాల్‌కు రూ.4,500 మద్దతు ధర ఉంది. పంట మరో పక్షం రోజుల్లో చేతికి రానుంది. అయితే ఇప్పటి వరకు మద్దతు ధర ప్రకటన మాత్రం లేదు. దీంతో రైతులు తీవ్ర వేధనలో పడిపోయారు. కాగా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మంగళవారం తెలంగాణ పసుపు రైతుల మహాగర్జన కార్యక్రమానికి పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ప్రధానంగా క్వింటాల్‌కు రూ.15వేల మద్దతు ధర, ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
లాభం లేదు..
నేను గతేడాది ఎకరంన్నరలో పసుపు సాగు చేశాను. తెగుళ్లతో పంట దిగుబడి తగ్గింది. నాకు వచ్చిన ఎకరంన్నరలోని 18 క్వింటాళ్లను క్వింటాలుకు రూ. 4వేలకు అమ్మాను. ఖర్చేమో దాదాపు రూ.80వేల పైనే అయ్యింది. నష్టమే తప్ప లాభం కానరాలేదు. దీంతో ఈ ఏడాది ఎకరంలోనే పంట వేశాను. ఇప్పటి దాకా రూ.70 వేల వరకు అయ్యాయి. గిప్పుడేమో నిజామాబాద్ మార్కెట్‌ల ధర రూ. 4వేలపైనే ధర ఉందంటున్నారు. గిప్పుడే గిట్ల ఉంటే పంట చేతికొచ్చే సరికి ఎట్ల ఉంటదో.
- నారాయణ, రైతు, పోతారం, మామడ మండలం
పసుపు రైతు కన్నీరు
Published Fri, Jan 3 2014 3:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement