హైదరాబాద్: అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి సీతక్క. ప్రజలను రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నిర్మల్ జిల్లా ప్రజలకు కేటీఆర్ ఓమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దిలావార్పూర్, గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము ఎటువంటి పక్రియ చేపట్టలేదు.. అయినా మా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు. దొంగ నాటకాలు, రెచ్చగొట్టడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు వస్తే గొప్పగా చెప్పుకున్నారు కదా.
ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్, బీజేపీలు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా?. ఇథనాల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ నేతలైన తలసాని సాయికుమార్, మరో వ్యక్తి ఉన్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవోపై బీఆర్ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులు దాడులు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం విషం వెదజల్లుతున్నారు. తలసాని సాయి కుమార్ ఎవరో బీఆర్ఎస్ చెప్పాలి. ఇథనాల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారిలో బీజేపీ నేత ఉన్నారు.
ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే బీఆర్ఎస్ విమర్శలు, ఉద్యోగాలు ఇస్తామంటే బీఆర్ఎస్ ఆందోళనలు.. ఇంత దారుణమా?. సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ దొర చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన న్యాయం ఏంటి?. కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు, కేసులు పెడితే తప్పా?.
ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని పాత్రపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి. మా ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపించింది. ఫౌంహౌస్ నుంచి పాలన చేసిన మీరు మా గురించి మాట్లాడే అర్హత లేదు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment