
న్యూఢిల్లీ: తెలంగాణలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ కేంద్రంగా సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ ప్రమోషన్ హబ్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని రకాల సుగంధ ద్రవ్యాల అభివృద్ధి, మార్కెటింగ్ కోసం బోర్డు తరహాలో పూర్తి అధికారాలతో కూడిన ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. టీఐఈఎస్ పథకం కింద ద్రవ్యాల మార్కెటింగ్ హబ్ కోసం మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించనుంది. కాగా మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కుమార్తె కవిత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంలో పసుపు రైతులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని సుమారు 178మంది మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసి.. కవిత ఓటమే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో వారికి అనూహ్యంగా 90 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కవితపై 68వేల పైచిలుకు మెజార్టీతో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన విషయం విదితమే. ఇక తాజాగా తెలంగాణలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment