
నోయిడా: అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ సంస్థలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. అలాగే వర్ధమాన దేశాలే కాకుండా సంపన్న మార్కెట్లనూ లక్ష్యంగా చేసుకోవాలని పేర్కొన్నారు. ఎలెక్‌రమా 2023 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.
నేరుగా సంపన్న దేశాల మార్కెట్లలోకి వెళ్లి భారతదేశ సామర్థ్యాలను చాటి చెప్పాలని తయారీ సంస్థలకు మంత్రి సూచించారు. కోవిడ్–19 మహమ్మారి తర్వాత విశ్వసనీయ భాగస్వాములతోనే కలిసి పని చేయడం ఎంత ముఖ్యమో యావత్ ప్రపంచం గుర్తెరిగిందని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలు లావాదేవీలు జరిపేటప్పుడు పారదర్శకత, సమగ్రత, నిజాయితీని కోరుకుంటున్నాయని గోయల్ తెలిపారు. ఈ నేపథ్యంలో బంగారంలాంటి అవకాశాన్ని వదులుకోకుండా సత్వరం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.