న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరింత కాలం కొనసాగించిన పక్షంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మరింత దిగజారే ముప్పు ఉందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ ద్రీజ్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌తో ఇప్పటికే దేశంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. లాక్‌డౌన్ విషయాన్ని పక్కన పెట్టినా అంతర్జాతీయ మాంద్య ప్రభావాలు సైతం భారత ఎకానమీపై ప్రతికూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాప్తితో దేశీయంగా కొన్ని రంగాలు కుదేలైనప్పటికీ.. సంక్షోభ సమయంలో కూడా మెడికల్ కేర్ వంటి కొన్ని విభాగాలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు.
అయితే, కొన్ని రంగాలు సరిగ్గా లేకపోతే మిగతా రంగాలు మనలేవన్నారు. ‘సైకిల్ టైరుకు పంక్చర్ పడితే ఒక్క చక్రంతో ఎలాగైతే ముందుకు వెళ్లలేదు కదా. అలాగే, లాక్‌డౌన్ కారణంగా సంక్షోభం కొనసాగిన పక్షంలో అది బ్యాంకింగ్ వ్యవస్థ సహా ఎకానమీలోని మిగతా రంగాలన్నింటినీ దెబ్బతీస్తుంది‘ అని ద్రీజ్ చెప్పారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులంతా స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తారని, కొంత కాలం దాకా మళ్లీ వలస వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. స్వంతంగా పొలాలు ఉన్న వారికి తప్ప స్వస్థలాల్లో ఉపాధి దొరికే పరిస్థితి లేదని చెప్పారు. మరోవైపు, వలస కార్మికులు వెళ్లిపోవడంతో వారిపై ఎక్కువగా ఆధారపడిన రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment