workers problems
-
గల్ఫ్ కార్మికులను అన్యాయం చేయొద్దు: గల్ఫ్ జేఏసీ
గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని మాట తప్పినందుకు నిరసనగా ఇక నుంచి అధికార ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు గల్ఫ్ నుంచి వచ్చిన శవపేటికలను ఉంచుతామని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. ఇటీవల దుబాయిలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముల్క నాగరాజు (25) అంత్యక్రియలు ఆయన స్వగ్రామం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేటలో జరిగాయి. గల్ఫ్ కార్మికుల అంత్యక్రియల్లో పాల్గొని మృతుడు నాగరాజుకు రవిగౌడ్ నివాళులు అర్పించారు. పని ప్రదేశంలో (వర్క్ సైట్) లో జరిగిన ప్రమాద మరణానికి దుబాయిలో ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యత వహించి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని రవిగౌడ్ అన్నారు. కార్మికులకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి తగిన శిక్షణ ఇవ్వాలని, ఈ విషయంలో భారత ప్రభుత్వం, గల్ఫ్ ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా ను తీసుకోవాలని రవిగౌడ్ కోరారు. రూ. 325 చెల్లిస్తే రెండు సంవత్సరాలు అమలులో ఉండే రూ. 10 లక్షల ప్రార్ద బీమా పాలసీ పొందవచ్చు. ఈ విషయమై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవిగౌడ్ కోరారు. -
వలస కూలీలకు భరోసా
-
బాంద్రాలో వలస కార్మికుల ఆందోళన
-
భారత ఎకానమీకి కరోనా ముప్పు
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరింత కాలం కొనసాగించిన పక్షంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మరింత దిగజారే ముప్పు ఉందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ ద్రీజ్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌తో ఇప్పటికే దేశంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. లాక్డౌన్ విషయాన్ని పక్కన పెట్టినా అంతర్జాతీయ మాంద్య ప్రభావాలు సైతం భారత ఎకానమీపై ప్రతికూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాప్తితో దేశీయంగా కొన్ని రంగాలు కుదేలైనప్పటికీ.. సంక్షోభ సమయంలో కూడా మెడికల్ కేర్ వంటి కొన్ని విభాగాలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. అయితే, కొన్ని రంగాలు సరిగ్గా లేకపోతే మిగతా రంగాలు మనలేవన్నారు. ‘సైకిల్ టైరుకు పంక్చర్ పడితే ఒక్క చక్రంతో ఎలాగైతే ముందుకు వెళ్లలేదు కదా. అలాగే, లాక్డౌన్ కారణంగా సంక్షోభం కొనసాగిన పక్షంలో అది బ్యాంకింగ్ వ్యవస్థ సహా ఎకానమీలోని మిగతా రంగాలన్నింటినీ దెబ్బతీస్తుంది‘ అని ద్రీజ్ చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులంతా స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తారని, కొంత కాలం దాకా మళ్లీ వలస వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. స్వంతంగా పొలాలు ఉన్న వారికి తప్ప స్వస్థలాల్లో ఉపాధి దొరికే పరిస్థితి లేదని చెప్పారు. మరోవైపు, వలస కార్మికులు వెళ్లిపోవడంతో వారిపై ఎక్కువగా ఆధారపడిన రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందన్నారు. -
వెట్టి కార్మికులకు విముక్తి
కొల్లాపూర్ రూరల్: వెట్టి కార్మికులుగా పనిచేస్తున్న చెంచులకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విముక్తి కలిగింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి సమీపంలోని చెంచు భ్రమరాంబకాలనీకి చెందిన పిల్లలతో కలిపి 21 మంది చెంచులను ఆరు నెలల క్రితం పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగడకు చెందిన మేస్త్రీ గోపాల్‌నాయక్ కర్ణాటక రాష్ట్రం బెంగళూర్‌లోని ఓ ప్రాంతంలో కాంక్రీట్ పని నిమిత్తం ఏడాదికి రూ.20వేల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తూ వలస తీసుకెళ్లాడు. ఈ సమాచారం అందుకున్న నేషనల్ ఆదివాసీ సాలిడ్ ఆర్టికౌన్సిల్ (ఎన్ఏఎస్సీ) రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాసుదేవరావు, ఐడి మహేష్ తదితరులు మూడు రోజుల క్రితం అక్కడికి వెళ్లారు. బెంగళూరు కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి వారికి విముక్తి కల్పించి పోలీసుల భద్రతతో బుధవారం భ్రమరాంబకాలనీకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ తమ సంస్థ దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెంచుల విముక్తి కోసం పనిచేస్తోందన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీ ధర్ వద్దకు ఈ చెంచులను తీసుకెళ్లి స్థానికంగానే జీవనోపాధి కల్పించాలని కోరుతామన్నారు. బాధితుల్లో నర్సింహ, బయ్యన్న, బుడ్డయ్య, మంగమ్మ, ఈదమ్మ, వీరస్వామి, శేకర్, కుర్మ య్య, ఎల్లమ్మతోపాటు పిల్లలు ఉన్నారు. -
చితికి పోతున్న సున్నం బతుకులు
సాక్షి, పెద్దపప్పూరు: తాత ముత్తాతల కాలం నాటి నుంచి సున్నం బట్టీలపైనే ఆధారపడి బతుకుతున్నాం. పగలు రాత్రి ఇంటిల్లిపాది కష్టపడినా కూలీ కూడ గిట్టదు. మరోపని చేతకాకపోవడంతో బట్టీలతోనే కాలం వెళ్లదీస్తున్నాం ఇవి మండలంలోని వరదాయపల్లి లో సున్నం బట్టీలపై ఆధారపడి జీవిస్తున్న వారి నిస్సహాయ పరిస్థితి. రాత్రి పగలు తేడా లేదు. చిన్న వర్షం వస్తే చాలు చేసిన పని పడ్డశ్రమ అంతా బూడిద పాలే. మండలంలోని వరదాయపల్లి శివారు ప్రాంతంలో దాదాపు 50 సున్నంబట్టీల్లో గ్రామంలోని బెస్తకులానికి చెందిన దాదాపు 400 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఆడమగ, రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడూ బట్టీల వద్దనే శ్రమిస్తూ కనిపిస్తారు. చాలా మంది సున్నం బట్టీలను ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో మరొకరి దగ్గర కూలీలుగా పనిచేస్తున్నారు. సున్నం తయారు చేయడానికి కావల్సిన ముడి రాయి దగ్గరి నుండి కాల్చడానికి ఉపయోగించే కట్టెల వరకు అన్నీ కొనాల్సిన పరిస్థితి. ఇంటిల్లి పాది కలిసి ముడిరాయి, కట్టెలను చిన్న ముక్కలుగా చేసుకోవడానికి, సున్నం కాల్చడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. ఒక్కసారి బట్టీ నుండి వచ్చిన సున్నం దాదాపు టన్నున్నర వుంటుంది. బెంగుళూరుకు చెందిన వ్యాపారులు సున్నం కొంటారు. ప్రస్తుతం టన్ను సున్నం రూ.4వేలు వుంది. ముడిరాయి ఖర్చు రూ.600, టన్ను కట్టెలు రూ.1600, కూలీల ఖర్చుపోను ఆదాయం అంతంత మాత్రమే. ముడిరాయి సున్నంగా తయారవుతున్న సమయంలో (ముడిరాయిని బట్టీలో కాల్చే సమయంలో) ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా వారం రోజులు పడ్డ శ్రమ అంతా వృథా అవుతుందన్నారు. దీంతో సున్నం బట్టీలపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలు దుర్బర పరిస్థితిని అనుభవిస్తున్నాయి. సున్నం బట్టీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. గిట్టుబాటు కావడం లేదు సున్నం పనులు గిట్టుబాటు కావడం లేదు. కుటుంబసభ్యులం అందరం కష్టపడ్డా పూట గడవని పరిస్థితి. ముడి సరుకుల ధరలు పెరగడంతో కష్టానికి తగిన ఫలితం లేకుండా పోయింది. చిన్న వర్షం వచ్చినా చేసిన పనిఅంతా వ్యర్థం అవుతుంది. ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించి ఆదుకోవాలి. –నారాయణస్వామి, సున్నం బట్టీ నిర్వాహకుడు, వరదాయపల్లి ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది ఎన్నో ఏళ్లుగా సున్నం కాల్చి బతుకీడుస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. కుటుంబం అంతా ఎండనక వాననక కష్టపడినా కుటుంబం గడవని పరిస్థితి. ప్రజాప్రతినిధులు మాపై దయచూపాలి. మాకు ప్రభుత్వం రుణాలు అందించి ఆదుకోవాలి. –లక్ష్మీనారాయణ, సున్నం బట్టీ నిర్వాహకుడు, వరదాయపల్లి -
‘డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కరించండి’
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో గైర్హాజరు కారణంగా డిస్మిస్ చేసిన కార్మికులకు వన్‌టైం చాన్స్ కింద ఉద్యోగాలివ్వాలని తెలంగాణ సింగరేణి డిస్మిస్ కార్మికుల సంఘం అ«ధ్యక్షుడు కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వన్‌టైం చాన్స్ కింద అవకాశం కల్పించే అంశంపై చర్చిస్తామన్న యాజమాన్యం ప్రతిసారీ దీన్ని వాయిదా వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే డిస్మిస్ కార్మికులందరికీ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు తమ సమస్య పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం తమ సమస్యలపై స్పందించాలని కోరారు. -
పంచాయతీ కార్మికుల సమ్మె ఉధృతం
నారాయణపేట రూరల్: గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ వర్కర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఐదో రోజుకు చేరింది. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఐఎఫ్టీయూ జిల్లా కోషాధికారి నరసింహా, వెంకటయ్య, కృష్ణయ్య, బాల్‌రెడ్డి, మోహన్‌లాల్, అశోక్, రాజు, అంజయ్య, దస్తప్ప, నర్సింహులు పాల్గొన్నారు. ధన్వాడ: తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం కొనసాగించారు. పంచాయతీ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. వీరికి స్థానిక వైస్‌ఎంపీపీ రాంచంద్రయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు మాకం సురెందర్, ఎంపీటీసీ మల్లయ్య, గోవర్దన్‌గౌడ్, టీఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్ వారికి సంగీబావం తెలిపారు. నర్సింహులు, శంకర్, బాల్‌రాజు, భసంత్ టీఎంఆర్పీఎస్ నాయకులు బాల్‌రాజు, శంకర్, రాజు. కారోబార్ కృష్ణయ్య, బాలక్రిష్ణ, కృష్ణహరి, నూరోద్దిన్, తిప్పయ్య, తిరుపతమ్మ, బాల్నర్సిములు, ఇసుఫ్, చంద్రయ్య, వేంకటయ్య, పెంటమ్మ, లక్ష్మిమ్మ, సునిత, బాలయ్య, జయమ్మ పాల్గొన్నారు మరికల్: గ్రామ పంచాతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఓల సంఘం డివిజన్ అధ్యక్షుడు గోవర్దన్చారీ వారికి మద్దతు పలికి మాట్లాడారు. నాయకులు పంచాయతీ సిబ్బందికి మద్దతు పలికారు. రాజేశ్వర్‌రెడ్డి, రాములు, వెంకటప్ప, చంద్రరెడ్డి, బాలప్ప పాల్గొన్నారు. కోయిల్‌కొండ: పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం పీడీఎస్‌యూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఐఎఫ్టీయూ మండల అధ్యక్షుడు నర్సింహులు మాట్లాడారు. చెన్నయ్య, వాసు, వెంకటయ్య, చంద్రశేఖర్, లక్ష్మయ్య, రాందాసు, గోపాల్, మాదవులు, నారాయణ, కనకమ్మ, ఖాదరయ్య, నాగమ్మ, బుచ్చమ్మ, అంజిలమ్మ, హన్మప్ప ఉన్నారు. -
రెండు రోజులుగా ఆకలితో చస్తున్నాం
కాళేశ్వరం జయశంకర్ జిల్లా : రెండు నెలల క్రితం బిహార్ రాష్ట్రం నుంచి మినీ కాళేశ్వరం ఎత్తిపోతల పనులకు వచ్చిన కూలీలను పనులు చేయించుకుంటూ కాంట్రాక్టర్ డబ్బులివ్వకుండా పస్తులు ఉంచుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మహదేవపూర్ మండలం బీరసాగర్ వద్ద మినీకాళేశ్వరం ఎత్తిపోతల పనులు నడుస్తున్నాయి. ఈ పనులకు సంబంధించి మహదేవపూర్ వద్ద అయ్యప్పస్వామి ఆలయం ఎదుట పైప్‌లైన్ వెల్డింగ్ పనులు చేయడానికి బిహార్ నుంచి 11 మంది కూలీలను సంబంధిత కాంట్రాక్టర్ నందకిశోర్ తీసుకువచ్చినట్లు కూలీలు పేర్కొన్నారు. రెండు నెలలుగా పనులు చేయించుకుంటూ డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. రెండు రోజులుగా తిండి పెట్టడం లేదని ఆకలితో చస్తున్నామని మొరపెట్టుకుంటు కన్నీరుమున్నీరయ్యారు. నందకిశోర్‌ను నిలదీస్తే తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని.. తమ గ్రామానికి తిరిగి వెళ్లి పోతామని చేతులెత్తి దండం పెట్టారు. ఈ విషయమై సంబంధిత మినీ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లును వివరణ కోరగా కాంట్రాక్టర్‌తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానన్నారు. ఈ విషయం ఇంత వరకు తన దృష్టికి రాలేదన్నారు. -
కార్మిక వ్యతిరేకి చంద్రబాబు
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మిక వ్యతిరేకి అని, కార్మికుల సంక్షేమాన్ని, హక్కులను కాలరాస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల దీక్ష ముగింపులో భాగంగా బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. అంతకు ముందు ఆశావర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్.వెకంటేశ్, ఐద్వా జిల్లా కార్యదర్శి వి.సావిత్రి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ దిల్షాద్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం అడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆశా వర్కర్లకు కనీసవేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే పారితోషికాలనూ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. యూనిఫాం అలవెన్స్ నెలకు రూ.500 చొప్పున కేంద్రం మంజూరు చేస్తుంటే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఆశావర్కర్లకు ఇవ్వడం లేదన్నారు. ఇలా ఆశా వర్కర్ల డబ్బులను పక్కదారి పట్టిస్తోందని దుమ్మెత్తిపోశారు. టీబీ, లెప్రసీ, క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధిగ్రస్తులకు చేస్తున్న సేవలకు ఇవ్వాల్సిన పారితోషికాలు మూడేళ్లుగా చెల్లించలేదని ధ్వజమెత్తారు. ఆశావర్కర్లకు రూ.6 వేలు వేతనం ఇవ్వాలని, బకాయి పడిన యూనిఫారం అలెవన్స్, పారితోషికాలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డులు ఇవ్వాలని, అర్హులైన వారిని రెండవ ఏఎన్ఎంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటె నాగరాజు, ఆశావర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మావతి, నాయకురాళ్లు పార్వతి, సౌభాగ్య, మంజూల, ఆనందలక్ష్మి, ఇర్ఫానా, సుజాత తదితరులు పాల్గొన్నారు. నాయకుల అరెస్ట్ ధర్నా అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నాయకురాళ్లు సావిత్రి, దిల్షాద్, వెంకటేశ్, నాగరాజు, నాగవేణి, పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. -
గుడారమే ‘ఆధారం’
ములకలపల్లి: వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదశ్రామికులు.. ఆంధ్రాలోని నర్సీపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జామాయిల్ తోటలు నరికేందుకు ఇక్కడకు వచ్చారు.. పనిచేసేచోటే తాత్కాలికంగా గుడారాలు వేసుకొని తోటలు నరుకుతున్నారు.. వానైనా, వరదైనా వారికి ఈ గుడారాలే జీవన ‘ఆధారం’.. ఒక్కో గుంపులో సుమారు యాభై మంది వరకూ నివసించే ఈ కష్టజీవుల జీవనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యం. -
‘వెట్టిచాకిరీ చేస్తున్న షాపింగ్‌మాల్స్ కార్మికులు’
సిరిసిల్లటౌన్: జిల్లాలోని షాపింగ్ మాల్స్‌లో పని చేస్తున్న కార్మికులు ఏళ్ల తరబడిగా వెట్టిచాకిరీ చే స్తున్నారని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మూ షం రమేశ్ అన్నారు. యూనియన్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కో కార్మికునితో యజమాన్యాలు 8 గంటలకు మించి పనిచేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేలలోపే వేతనాలు చెల్లిస్తూ.. కనీ స వేతన చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని తెలి పారు. కార్మికులకు అధికారులు కనీస వేతనాలు అమలు చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మోర అజయ్, అన్నల్దాస్ గణేశ్, ఒగ్గు గణేశ్, నక్క దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘అక్షయపాత్ర’కు అప్పగిస్తే ఊరుకోం
చుంచుపల్లి : మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర సంస్థ ద్వారా నిర్వహించొద్దంటూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఫిబ్రవరి 1నుంచి కొత్తగూడెంలో పథకాన్ని ప్రారంభించాలని నాలుగు రోజుల క్రితమే అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్న భోజన వర్కర్లు, సీఐటీయూ నాయకులు అక్షయపాత్ర కేంద్రం ఉన్న మార్కెట్ యార్డు వద్ద బైటాయించి ఆందోళనకు దిగారు. ప్రభు త్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను వెళ్లిపోవాలని పోలీసులు చెప్పే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్షయపాత్రను రద్దు చేయాలని ఆందోళనకారులు భీష్మిం చి కూర్చోడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని లక్ష్మీదేవిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: సీఐటీయూ మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అప్పజెప్పి మధ్యాహ్న వర్కర్ల పొట్టగొట్టాలని ప్రభుత్వం చూస్తుం దని మధ్యాహ్న వర్కర్ల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ ఆరోపించారు. గురువారం అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అం దించాడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో పాల్గొని ఆమె మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. న్యాయ పరంగా పోరాటం చేస్తున్న వర్కర్ల విషయంలో అధికారులు కనీసం కనికరం కూడా చూపడం లేదన్నారు. వారు తీసుకున్న నిర్ణయం వల్ల జిల్లాలో దాదాపు 4 వేల మంది మధ్యా హ్న భోజన వర్కర్ల జీవితాలు రోడ్డు పడనున్నాయని అన్నారు. అధికారులు స్పందించి అక్షయపాత్రను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మధ్యాహ్న వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి జి.పద్మ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్, బ్రహ్మచారి, తాటిపర్తి అనిల్, భూక్యా రమేష్, జి.రాజు, నలమలపు సత్యనారాయణ, మధ్యాహ్న భోజన వర్కర్లు పాల్గొన్నారు. -
చీకటి బతుకులు
ఒంగోలు, మార్టూరు:సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. కార్మికులు పని చేసే చోట వివక్ష రూపుమాపాలి. శాశ్వత పని ప్రదేశాల్లో కాంట్రాక్టు వ్యవస్థ ఉండకూడదు.. కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2015లో వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులే లేరని, ఉన్న వారంతా ఔట్సోర్సింగ్ కార్మికులని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్పీడీసీఎల్ సంస్థలో 24 వేల మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. వీరిలో కార్మికులుగా, అమాన్యులుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా జిల్లాలో పని చేస్తున్న వారు రెండు వేల మందికి పైగానే ఉన్నారు. వీరు 20 ఏళ్ల నుంచి చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు. ఎప్పటికైనా తమ జీవితాల్లోకి వెలుగులు రాకపోతాయా..అని ఆశగా ఎదురు చూస్తూ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. 74 రకాల పనులకు వినియోగం సంస్థ కాంట్రాక్ట్ కార్మికులను 74 రకాల పనులకు వినియోగించుకుంటోంది. రోజుకు కనీస వేతనం 150 రూపాయల నుంచి గరిష్టంగా 300 రూపాయల వరకు ఇస్తారు. సబ్‌స్టేషన్ పరిధిలో మాత్రమే రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉండగా దూర ప్రాంతాలకు సైతం ఎలాంటి భత్యాలు, రవాణ ఖర్చులు ఇవ్వకుండా తీసుకెళ్లి అదనపు గంటలు కూడా పని చేయిస్తుంటారు. సబ్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుల కుంటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇచ్చి సంస్థ చేతులు దులుపుకుంటోంది. సబ్‌స్టేషన్ పరిధిలో కాకుండా బయట ప్రాంతాల్లో మరణిస్తే రూపాయి కూడా ఇవ్వరు. ప్రమాదవశాత్తు శాశ్వతంగా కానీ పాక్షికంగా కానీ అంగవైకల్యం ఏర్పడితే పట్టించుకునే నాథుడే ఉండడు. ఇచ్చే వేతనాలైనా సమయానికి వస్తాయా..అంటే అదీ లేదు. రెండు మూడు నెలలకు ఒకసారి.. అదీ కాంట్రాక్టర్ దయాదాక్షణ్యాల మీద ఆధార పడి ఉంటుంది. వర్షాకాలం, తుఫాన్ సమయంలో వీరి బాధలు వర్ణనాతీతం. కరెంటు స్తంభాలు విరిగి రోడ్లకు అడ్డంగా చెట్టు పడితే వాటిని తొలగించాల్సింది కూడా కాంట్రాక్ట్ కార్మికులే. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరెంటు బిల్లులు సైతం వీరే వసూలు చేయాలి. సగం మందికి పైగా 20 ఏళ్ల సర్వీసు జిల్లాలో నాలుగు 220 కేవీఏ స్టేషన్లు, 18 132 కేవీఏ స్టేషన్లు, 280 సబ్ స్టేషన్లు ఉన్నాయి. కార్మికుల్లో సగం మంది 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న వారు కూడా ఉండటం గమనార్హం. ఏపీఎస్పీడీసీఎల్కు సంబంధించిన పనులు కాంట్రాక్టర్లు దక్కించుకుని పనులు కాంట్రాక్ట్ కార్మికులతో చేయించుకుంటారు. ఒక కార్మికుడు ఒక ఇంటి మీటరు రీడింగ్ తీస్తే 2 రూపాయలు ఇస్తారు. ఈ పద్ధతిన ఎక్కువ లబ్ధి పొందేది కాంట్రాక్టర్లే కావడం గమనార్హం. కాంట్రాక్టులు దక్కించుకునే వారు ఎక్కువ మంది సంస్థలోని ఉన్నతాధికారులకు బంధువులు. ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో 7400 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015లో 20 వేల మంది కార్మికులను రెగ్యులర్ చేసేందుకు ప్రయత్నించగా న్యాయ సంబంధ అంశాలు అడ్డు రావడంతో వారందరినీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో విలీనం చేసి నెలకు 23 వేల రూపాయల కనీస వేతనం ఇస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీని ఆయన తుంగలో తొక్కారు. తమిళనాడు రాష్ట్రంలో దశలవారీగా 35 వేల మంది కార్మికులను రెగ్యులర్ చేశారని, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో రెగ్యులర్ చేసేందుకు చట్టాలు తీసుకొచ్చినట్లు మన ప్రాంత కార్మికులు చెబుతున్నారు. ఇక్కడ తమ సమస్య పరిష్కారం కాకపోవడానికి కొన్ని యూనియన్లు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఉద్యమాలను నీరు కార్చాయని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం, దీర్ఘకాలంగా పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను విద్య, వయో పరిమితి లేకుండా రెగ్యులర్ చేయడం లేదా విలీనం చేయడం, కనీస వేతన చట్టాన్ని అమలు పరచడం, పని ప్రదేశాల్లో మరణించిన వారికి 10 లక్షల రూపాయల నష్ట పరిహారం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు విధిగా అమలు చేసి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు బ్యాంకుల ద్వారా చెల్లించాలని కార్మికులు నెల నుంచి తిరుపతిలోని సీఎండీ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్ల స్థాయి కార్యాలయాల వరకు సమ్మె నోటీసులిచ్చారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వినతి
రుద్రంపూర్: పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీఎంఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తదనంతరం బీఎంఎస్ నాయకులు మంత్రికి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార మెడికల్ సిబ్బందికి క్యాడర్ స్కీంను కోలిండియాలో అమలు చేస్తున్నారని, కానీ సింగరేణిలో మాత్రం అమలు చేయటం లేదని, ఫలితంగా వారు కొంత కాలంగా ఉద్యోగోన్నతులు లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని, అంతేకాకుండా నర్స్‌గా అపాయింట్ అయిన వారు నర్స్గానే పదవీవిరమణ పొందాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో గిరిజన బ్యాక్లాగ్ 665 బదిలీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మీ సమస్యలపై సంబంధిత అ«ధికారులకు లేఖలు రాయించి వీలైనంత త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీఎంఎస్ కార్యదర్శి మాధవ నాయక్, చింతల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.