కాళేశ్వరంలో విలేకర్లతో మాట్లాడుతున్న బిహార్ కూలీలు
కాళేశ్వరం జయశంకర్ జిల్లా : రెండు నెలల క్రితం బిహార్ రాష్ట్రం నుంచి మినీ కాళేశ్వరం ఎత్తిపోతల పనులకు వచ్చిన కూలీలను పనులు చేయించుకుంటూ కాంట్రాక్టర్ డబ్బులివ్వకుండా పస్తులు ఉంచుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మహదేవపూర్ మండలం బీరసాగర్ వద్ద మినీకాళేశ్వరం ఎత్తిపోతల పనులు నడుస్తున్నాయి.
ఈ పనులకు సంబంధించి మహదేవపూర్ వద్ద అయ్యప్పస్వామి ఆలయం ఎదుట పైప్‌లైన్ వెల్డింగ్ పనులు చేయడానికి బిహార్ నుంచి 11 మంది కూలీలను సంబంధిత కాంట్రాక్టర్ నందకిశోర్ తీసుకువచ్చినట్లు కూలీలు పేర్కొన్నారు. రెండు నెలలుగా పనులు చేయించుకుంటూ డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు.
రెండు రోజులుగా తిండి పెట్టడం లేదని ఆకలితో చస్తున్నామని మొరపెట్టుకుంటు కన్నీరుమున్నీరయ్యారు. నందకిశోర్‌ను నిలదీస్తే తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని.. తమ గ్రామానికి తిరిగి వెళ్లి పోతామని చేతులెత్తి దండం పెట్టారు.
ఈ విషయమై సంబంధిత మినీ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లును వివరణ కోరగా కాంట్రాక్టర్‌తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానన్నారు. ఈ విషయం ఇంత వరకు తన దృష్టికి రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment