bhupala palli
-
విషాదం: మనవడిని కాపాడబోయి..
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మనవడు పడిపోగా కాపాడబోయి తాత కూడా మృతి చెందిన ఘటన మహా ముత్తరాం మండలం బోర్లగూడెం నర్సింగాపూర్ శివారులో జరిగింది. స్థానికుల కథనం.. ప్రకారం మృతులు భీముని భూమయ్య (58), భీముని రిషీ (10) నర్సింగాపూర్ కు వెళ్లి వస్తుండగా చెరువు వెనుక ఉన్న వారి పొలానికి వెళ్తూ నీటిలో నుంచి చెరువు దాటే ప్రయత్నం లో మనువడు ఒక్కసారిగా నీట మునిగిపోయాడు. దీంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో భూమయ్య కూడా నీటమునిగి మృత్యువాత పడ్డాడు. చెరువు మరమ్మతులో భాగంగా గత నెలలో జేసీబీలతో మట్టిని తవ్వడం వల్ల లోతైన గుంటలు ఏర్పడంతో నే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం అదే చెరువులో చేపలు పడుతూ గత 25 సంవత్సరాలుగా చెరువు కట్టపైనే మంచెవేసుకుని ఉండే భూమయ్య కు ఆ చెరువులో ఎక్కడ లోతు ఉందో ఎక్కడ ఏముందో తెలిసిన అతను నీటిలో మునిగి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూమయ్య కొడుకు రవి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చదవండి: 16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం -
జంప్ జిలానీలు
సాక్షి, భూపాలపల్లి: ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. రెండు నెలలుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఒక ఎత్తయితే.. వచ్చే 20 రోజులను పార్టీలు, అభ్యర్థులు మరింత కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు చోటా మోటా నాయకులు అడపాదడపా పార్టీలు మారా రు. ప్రస్తుతం చేరికల పర్వం జోరందుకుంది. అభ్యర్థులు గ్రామాల్లో పర్యటించే సమయంలోనే తమ పార్టీల ఖండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా యువతపైనే దృష్టి సారించారు. ద్వితీయ శ్రేణి ఓటర్లను, కొద్దో గొప్పో ఓటర్ల వద్ద పలుకుబడి కలిగిన వారిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అదనుగా ఎప్పటి నుంచో పార్టీ మారాలని చూస్తున్న వారు జంప్ చేస్తున్నారు. పార్టీల్లో వలసల జోరు.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా నిలవడానికి స్వపక్షాన్ని సైతం వీడుతున్నారు. రెండు నెలల కాలంతో పోల్చితే ప్రస్తుతం వలసల ఉధృతి పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో ప్రకటించనుండడంతో చేరికలు పెరిగే అవకాశం ఉంది. ఇన్ని రోజులు తగిన సమయం కోసం వేచి చూసిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థుల గ్రామాల పర్యటనను అదనుగా భావిస్తున్నారు. దీనికి తోడుగా అభ్యర్థులు సైతం చేరికలతో తమ బలాన్ని, ఓట్లను పెంచుకోవాలని చూస్తున్నారు. నామినేషన్ వేసే సమయానికి గ్రామాల్లోని ప్రధాన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు,యువతే టార్గెట్ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి గ్రామంలో చేరికలు ఉండేలా నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని పార్టీలు ప్రధానంగా మండల స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి కేంద్రీకరించారు. ఇతర పార్టీల సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మండలాధ్యక్షులు తదితర స్థానా ల్లో ఉన్న వారిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వితీయశ్రేణి నేతలు చేరితే వారికుం డే ఓటు బ్యాంకు తమ ఖాతాలో పడిపోతుందని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యత లేదనుకున్న వారు, పదవులను ఆశించి భంగపడ్డవారు, ఇతర నేతలతో పొసగని వారు పక్క చూపులు చూస్తున్నారు. మరికొందరు గెలిచే అభ్యర్థిని అంచనా వేసుకుని పార్టీలు మారుతున్నారు. గ్రామాల్లోని యువతకు పార్టీలు గాలం వేస్తున్నాయి. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని తమవైపు తప్పుకునేందుకు ప్రధాన పార్టీలన్ని పాలువులు కదుపుతున్నాయి. తటస్థంగా ఉంటు న్న వారిని సూతం అనుకూలంగా మార్చుకోవాల ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలతోపాటు జిల్లాలో కొంత మేర ఉన్న మం«థని నియోజకవర్గంలో జంప్ జిలానీల జోరు పెరిగిం ది. ముఖ్యంగా మంథనిలో చేరికల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. మహాముత్తారం, మహదేవపూర్, కాటారం, మల్హర్ మండలాల్లో నువ్వానేనా అన్న ట్లు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్నాయి. మంథనిలో పుట్ట మధు, శ్రీధర్ బాబు పోటాపోటీగా పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల భూపాలపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీల్లోకి చేరికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు ఊపందుకున్నాయి. ములుగులోనూ ప్రస్తుతం ఇదే పరి స్థితి కొనసాగుతోంది. భూపాలపల్లి నియోజకవర్గంలో బీజేపీకి చెందిన టేకుమట్ల మండల అధ్యక్షుడు గాజర్ల పోశాలు, రాష్ట్ర నాయకుడు కాసర్ల రాంరెడ్డి కాంగ్రెస్‌లో చేరాడు. అలాగే చిట్యాల జెడ్పీటీసీ కాట్రెవుల సాయిలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరాడు. మంథని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కర్రు నాగయ్య టీఆర్ఎస్లోకి చేరిన తరువాత ప్రస్తుతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా డు. ప్రస్తుతానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఎక్కువగా చేరికలు జరుగుతున్నాయి. -
కుగ్రామం నుంచి జిల్లా వరకు...
సాక్షి, భూపాలపల్లి: భూపాలపల్లి కుగ్రామం నుంచి మునిసిపాలిటీ, నియోజకవర్గం, జిల్లాకేంద్రం వరకు విస్తరించింది. సింగరేణి గనులతో భూపాలపల్లి ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతోంది. కేటీపీఎస్ ఏర్పాటుతో భూపాలపల్లి కార్మిక ప్రాంతంగా రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారే పట్టణంలో అధికంగా ఉన్నారు. 2008లో ఏర్పడ్డ భూపాలపల్లి నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించడంలో కార్మికులే కీలకంగా మారారు. రైతులు సైతం ప్రభావితం చేయనున్నారు. ఇతర ప్రాంతాల వారే అధికం భూపాలపల్లి పట్టణానికి విలక్షణమైన గుర్తింపు ఉంది. ఇక్కడ స్థిరపడిన వారిలో అధికశాతం వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారే. గోదావరి ఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపెల్లి, చెన్నూర్ వంటి ప్రాంతాల్లో కొన్ని గనులు మూతపడటంతో పాటు ఇక్కడ కొత్తగా గనులు ప్రారంభం అవ్వడంతో ఆయా ప్రాంతాల్లోని కార్మిక కుటుంబాలు భూపాలపల్లికి వచ్చి స్థిరపడ్డాయి. వీరితో పాటు కాటారం, మహాదేవ్‌పూర్ ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు.ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, గణపురం, రేగొండ మండలాలతోపాటు వరంగల్ రూరల్ జిల్లా నుంచి శాయంపేట మండలం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. చిట్యాల నుంచి కొత్తగా టేకమట్ల మండలం కొత్తగా ఏర్పడింది. కార్మిక ఓటర్లే కీలకం భూపాలపల్లి నియోజకవర్గంలో కార్మిక ఓట్లే గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. ఏడు వేల కార్మిక కుటుంబాలు భూపాలపల్లిలో నివాసముంటున్నారు. దాదాపుగా 20వేల ఓట్లు కార్మిక వర్గాల వారివే ఉన్నాయి. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు నల్లేరు మీద నడకే అని ప్రతి అభ్యర్థి భావిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం కూడా కార్మికులకు సెలవు దినమైన ఆదివారం నాడే కార్మిక వాడల్లో నాయకులు కలియతిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో గెలుపొందిన వారు భూపాలపల్లి మండలంలో ముఖ్యంగా పట్టణ పరిధిలో అధికం ఓట్లు రావడం వల్లే గెలుపొందారు. ఈ సారి ఓ పార్టీకి ఓటు వేసి గెలుపిస్తారో వేచి చూడాలి. 2009లో నియోజకవర్గంగా.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భూపాలపల్లి ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చీఫ్ విప్‌గా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి గెలుపొంది తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనసభాపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికలు. పెరిగిన ఓటర్లు జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో ములుగు కన్నా భూపాలపల్లిలోనే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో 2లక్షల 22వేల 582 మంది ఓటర్లు ఉంటే 2014 ఎన్నికల్లో 2లక్షల 37వేల 803 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన తుది జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2లక్షల 45వేల 307 మంది ఓటర్లు ఉన్నారు. -
రెండు రోజులుగా ఆకలితో చస్తున్నాం
కాళేశ్వరం జయశంకర్ జిల్లా : రెండు నెలల క్రితం బిహార్ రాష్ట్రం నుంచి మినీ కాళేశ్వరం ఎత్తిపోతల పనులకు వచ్చిన కూలీలను పనులు చేయించుకుంటూ కాంట్రాక్టర్ డబ్బులివ్వకుండా పస్తులు ఉంచుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మహదేవపూర్ మండలం బీరసాగర్ వద్ద మినీకాళేశ్వరం ఎత్తిపోతల పనులు నడుస్తున్నాయి. ఈ పనులకు సంబంధించి మహదేవపూర్ వద్ద అయ్యప్పస్వామి ఆలయం ఎదుట పైప్‌లైన్ వెల్డింగ్ పనులు చేయడానికి బిహార్ నుంచి 11 మంది కూలీలను సంబంధిత కాంట్రాక్టర్ నందకిశోర్ తీసుకువచ్చినట్లు కూలీలు పేర్కొన్నారు. రెండు నెలలుగా పనులు చేయించుకుంటూ డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. రెండు రోజులుగా తిండి పెట్టడం లేదని ఆకలితో చస్తున్నామని మొరపెట్టుకుంటు కన్నీరుమున్నీరయ్యారు. నందకిశోర్‌ను నిలదీస్తే తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని.. తమ గ్రామానికి తిరిగి వెళ్లి పోతామని చేతులెత్తి దండం పెట్టారు. ఈ విషయమై సంబంధిత మినీ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లును వివరణ కోరగా కాంట్రాక్టర్‌తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానన్నారు. ఈ విషయం ఇంత వరకు తన దృష్టికి రాలేదన్నారు. -
గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
భూపాలపల్లి రూరల్ : గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారులు హరికృష్ణ, సీవీ రావులు అన్నారు. పట్టణంలోని వేశాలపల్లిలో షేర్వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వారు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుపేదలకు నీడనిచ్చే గొప్ప ఆలోచన డబుల్ బెడ్ రూం ఇళ్లని, పనులు వేగంగా కొనసాగడానికి కలెక్టర్ అమయ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ప్రశంసించారు. గ్రామపంచాయతీలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో రూపుదిద్దుకొని అంబేద్కర్ జయంతి నాటి నుంచి అమలులోకి వచ్చిన ప్రధానమంత్రి గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం క్రింద జిల్లాలో ఎంపికైన గ్రామాల్లో వంద శాతం ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లు, రూ.125 విద్యుత్ కనెక్షన్ ఇప్పించడం, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమం ద్వారా పౌరలందరికీ బ్యాంక్ ఖాతాలను తెరిపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఆర్డీఓ వీరబ్రహ్మచారి, సీపీఓ కొమురయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ నరేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, ఎల్డీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పల్ మెట్రో స్టేషన్లో తుపాకీ కలకలం
ఉప్పల్ : ఉప్పల్ మెట్రోస్టేషన్లో రైలు ఎక్కబోతున్న వ్యక్తి వద్ద తుపాకీ లభ్యం కావడంతో కలకలం సృష్టించింది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. భూపాలపల్లి జిల్లా, కాటారం గ్రామానికి చెందిన తోట సతీష్ అదే ప్రాంతానికి చెందిన జెడ్పీటీసీ సల్ల నారాయణరెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నారాయణరెడ్డి వ్యాపార పనుల నిమిత్తం పూణె వెళుతూ తన తుపాకీని డ్రైవర్‌కు ఇచ్చి వెళ్లాడు. డ్రైవర్ సతీష్ మంగళవారం రాత్రి కూకట్పల్లి వెళ్లేందుకు ఉప్పల్ మెట్రోస్టేషన్‌కు వెళ్లాడు. తన వద్ద తుపాకీ ఉండటంతో ఇదే విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఉప్పల్ పోలీసులు సతీష్ వద్ద ఉన్న 7.65 ఎంఎం తుపాకీ, 8 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ను అదుపులోకి తీసుకుని, అతనితో పాటు నారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా తుపాకీకి లైసెన్స్ ఉన్నట్టు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. -
కాళేశ్వరా... ముక్తీశ్వరా..
తెలంగాణాలోని మహా శైవక్షేత్రాలలో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల భక్తుల పూజలతో విరాజిల్లుతుంది. ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. ఈ లింగాలలో ఒకటి కాలుడు (యముడు), మరొకటి ముక్తీశ్వరుడు(శివుడు). ముక్తీశ్వర లింగానికి రెండు నాసికారంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్ళు పోసినా, బయటికి కనిపించవు. ఆ నీరు భూ అంతర మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని స్కాందపురాణం చెబుతోంది. గర్భగుడికి నాలుగుదిక్కులా నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం ప్రత్యేకత. కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుండి ప్రవహిస్తున్న ప్రాణహితనది, మంచిర్యాల జిల్లా నుండి ప్రవహిస్తున్న గోదావరినది, అంతర్వాహిని సరస్వతీ నదులు కలసిన ముచ్చటైన క్షేత్రం కాళేశ్వరం. ఇది మూడు నదుల సంగమం. క్షేత్రపురాణం యమధర్మరాజు ఒకసారి ఇంద్రలోకం వెళ్లాడు. అక్కడ ప్రజలందరూ యమలోకానికి రావడానికి ఇష్టపడక ఆ మహాశివుని పూజిస్తూ, ఎంతో వైభవంగా ఉన్నట్లు తెలుసుకొన్నాడు. విశ్వకర్మ వద్దకు వెళ్ళి స్వర్గలోకాన్ని మించిన మహానగరాన్ని నిర్మించాలని వేడుకొన్నాడు. ఈ మేరకు విశ్వకర్మ గోదావరి, ప్రాణహిత నదుల సంగమానికి దక్షిణదిశలో కాళేశ్వర పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత యముడు ఘోర తపస్సుతో శివుని ప్రత్యక్షం చేసుకుని, తనకు శివుని పక్కన చోటుకావాలని కోరగా శివుడు సమ్మతించాడు. ఒకే పానవట్టంపై యముడు, శివుడు కొలువైనారు. అప్పటినుంచి యుముని కొలిచిన తరువాతనే శివుణ్ని కొలుస్తారు. జీర్ణోద్ధరణ 11వ శతాబ్దం అనంతరం దేవాలయం శిధిలావస్థకు చేరుకుంది. రోడ్డు, రవాణా సౌకర్యాలు లేవు. దేవతామూర్తుల విగ్రహాలు పూర్తిగా భిన్నమై ఉండేవి. ఆ తర్వాత శ్రీశృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు విద్యాతీర్థ మహాస్వామి, భారతీ తీర్థ మహాస్వామి వార్లచే కాళేశ్వర మహాక్షేత్రంలో మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటినుంచి కాళేశ్వర క్షేత్ర ప్రాÔ¶ స్త్యం దేశ నలుమూలలకూ పాకింది. ఇతర సందర్శనీయ స్థలాలు ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం, శుభానందదేవి, సరస్వతి, రామాలయం, సంగమేశ్వర, దత్తాత్రేయ ఆలయాలు, దుర్గాదేవి, మహాగణపతి, వీరభద్ర, విజయ గణపతి, అన్నపూర్ణ, చింతామణి, బైరవ, ఆంజనేయ, మత్స్యనారాయణ, మహావిష్ణు, జ్యేష్టాదేవి, సుబ్రమణ్యస్వామి, బాలరాజేశ్వర, కాశీవిశ్వేర, కాలభైరవ, సూర్యాలయాలున్నాయి. కాలసర్ప, శని పూజలకు ప్రసిద్ధి శ్రీ కాళహస్తి తరువాత కాలసర్ప, శనిదోష నివారణ పూజలకు కాళేశ్వర క్షేత్రం ప్రసిద్ధి పొందింది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కాలసర్పదోష నివారణ పూజలు, నవగ్రహాలయంలో శనిదోష నివారణకు శనిపూజలను నిర్వహిస్తున్నారు. పితృదేవతలకు పిండప్రదానాలు పితృదేవతలకు పిండ ప్రధాన పూజలు, కర్మకాండలు ఇక్కడ ప్రత్యేకత. అస్థికలను త్రివేణీ సంగమంలో కలుపుతారు. ప్రతి సోమవారం స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. వసతి సౌకర్యాలు వేములవాడ రాజరాజేశ్వరస్వామి వసతి గృహం, సింగరేణి వసతిగృహం, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహం, హనుమంతరావు కాటేజీ, పర్యాటకశాఖ త్రివేణి వసతి గృహం ఉన్నాయి. క్షేత్రానికి చేరే మార్గం.... హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి కాళేశ్వరానికి రావచ్చు. రైలు మార్గంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు వస్తే, అక్కడి నుంచి బస్సులో వెళ్ళొచ్చు. వరంగల్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సులున్నాయి. ప్రయివేటు వాహనాల ద్వారా అయితే, హైదరాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, కరీంగనర్, పెద్దపల్లి, మంథని, కాటారం మహదేవపూర్ నుంచి కాళేశ్వరం రావచ్చు. లేదా బోనగిరి, జనగామ, ఆలేరు, వరంగల్, పరకాల, భూపాలల్లి, కాటారం, మహదేవపూర్‌ల నుండి కూడా రావచ్చు. – షేక్ వలీ హైదర్ సాక్షి, కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా -
భూపాలపల్లిలో మోదీ దిష్టిబొమ్మ దహనం
భూపాలపల్లి: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆందోళన నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రాస్తారోకో నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఛీఫ్ విప్ గండ్రా వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు. -
ములుగు బంద్ సంపూర్ణం
ములుగు : ములుగులోని డివిజన్ కార్యాలయాలను భూపాలపల్లికి తరలించే ప్రయత్నాలు మానుకోవాలని, సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులతోపాటు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. అఖిలపక్ష నాయకులు జాతీయరహదారిపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. అనంతరం గేదెకు వినతిపత్రం అందించారు. రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచాయి. ఎస్సై మల్లేశ్‌యాదవ్ సిబ్బందితో చేరుకొని ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం అధ్యక్షుడు నల్లెల్ల కుమార్, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్ మాట్లాడారు. ఓవైపు ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాల సేకరణ కొనసాగుతుండగానే కొన్నేళ్లుగా ములుగులో ఉన్న డివిజన్ కార్యాలయాలను భూపాలపల్లికి తరలించడం సరికాదన్నారు. ములుగు ప్రజల ఆకాంక్ష నెరవేర్చలేని మంత్రి చందూలాల్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 21వ తేదీ వరకు నిత్యం పలు రకాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో వెంకటాపురం జడ్పీటీసీ సభ్యురాలు బానోతు విజయ, ఎంపీపీ దేవరనేని స్వామిరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అ««దl్యక్షుడు వేముల బిక్షపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు బాణాల రాజు, జిల్లా సాధన సమితి ప్రధానకార్యదర్శి నూనె శ్రీనివాస్, నాయకులు ఎండి.యూనుస్, కోగిల రాంబాబు, దూడబోయిన శ్రీనివాస్, మహేందర్, సిరికొండ బలరాం, రవీంద్రాచారి పాల్గొన్నారు. -
అటెండర్
భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్ : జిల్లాలో సంచలనం సృష్టించిన భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీ బ్యాంకుల దోపిడీ ఘటన ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. జిల్లా లో ఎప్పుడూ జరగని విధంగా భూపాలపల్లి, ఆజంనగర్ శాఖ బ్రాంచీల్లో ఒకేసారి చోరీ జరగడం తో ఏదో పెద్ద ముఠానే ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్ని సవాల్‌గా తీసుకున్నరూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా భూపాలపల్లిలోనే తిష్టవేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్నంతా ఇక్కడికి రప్పించి విచారణ ముమ్మరం చేశారు. అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ, ములుగు డీఎస్పీ మురళీధర్‌తోపాటు జిల్లాలోని వివిధ డివి జన్ల డీఎస్పీలు, సీఐలు.. అర్బన్, రూరల్ సీసీఎస్ పోలీసులు అక్కడే మకాం వేశారు. భూపాలపల్లి బ్రాంచిలో పని చేసే తాత్కాలిక ఉద్యోగి ఈ దోపిడీకి సూత్రధారిగా తేలి నట్లు సమాచారం. అతడికి ఒకరిద్దరు మాత్రమే సహకరిం చినట్లు తెలుస్తోంది. రెండు బ్యాంకుల్లో రూ.9,44,83,100 విలువైన బంగారం, నగదును దోచుకెళ్లగా.. దొంగల కోసం జిల్లా పోలీసు యంత్రాంగం సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. రెండు బ్రాంచీల ఉద్యోగులందరినీ సోమవారం అదుపులోకి తీసుకుని ఠాణాలో విచారిస్తున్నారు. భూపాలపల్లి బ్రాంచి తాత్కాలిక ఉద్యోగి అటెండర్ రమేష్ విధులకు హాజరు కాలేదు. అతని మొబైల్ స్విచాఫ్ ఉండడంతో పట్టణంలోని అతడి నివాసానికి పోలీసులు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో వారి బంధువులు, స్నేహితులను ఆరా తీయగా.. తిరుపతి వెళ్తున్నానని చెప్పినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. బ్యాంకుల సిబ్బందికి చెందిన ఫోన్ కాల్ లిస్ట్‌ను పరిశీలించగా.. రమేష్ ఇతర బ్రాంచీలకు చెందిన ఉద్యోగులతో పలుమార్లు మాట్లాడినట్లు తేలింది. ఈ నెల 16న కూడా అతడు సెల్‌ఫోన్‌ను వినియోగించినట్లు వెల్లడైంది. సోమవారం నుంచి సెల్‌ఫోన్ స్విచాఫ్ వస్తోంది.ఈ నేపథ్యంలో పోలీసులకు రమేష్‌పై అనుమానం బలపడింది. లాకర్ తయారు చేసిన గోద్రెజ్ సంస్థ ప్రతినిధులను పోలీసులు రప్పిం చి చూపించారు. అది అసలు తాళపు చెవులతోనే తెరిచినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు చోరీ పని రమేషేనని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బ్యాంకుకు డబ్బు రవాణా చేసే వాహనంలో పరారీ.. ఏపీజీవీబీలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల్లో 28 ఏళ్ల లోపు వారిని వచ్చే నెల రెగ్యులరైజ్ చేయనున్నట్లు రమేష్‌కు తెలిసింది. అతడికి సుమారు 40 ఏళ్లు ఉండడంతో తనకు ఉద్యోగం రాదని భావించి నిరాశకు గురయ్యాడు. బ్యాంకుకు కన్నం వేయాలనే దురాశ పుట్టింది. రమేష్ 12 ఏళ్లుగా బ్యాంకులో పనిచేస్తుండడంతో మేనేజర్‌తోపాటు ఉద్యోగులందరు అతడిని నమ్మేవారు. బ్యాంకు తాళాలు అతని చేతిలోకి వచ్చేవి. దీంతో శనివారం రాత్రి దోపిడీకి పాల్పడేందుకు నిర్ణయించుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం ఉద్యోగులు వెళ్లిపోయాక ముందస్తుగా బ్యాంకు షెట్టర్ అలారమ్‌ను తొలగించాడు. సీసీ కెమెరా పుటేజీల కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను వెంట తీసుకుపోయాడు. బ్యాంకులో ఉన్న ఆజంనగర్ బ్రాంచి తాళాలను తీసుకుని పై అంతస్తు నుంచి కిందికి వచ్చాడు. కింద ఉన్న బేకరీ షాపులో భూపాలపల్లి బ్రాంచి తాళాలు ఇచ్చి ‘నేను తిరుపతికి వెళ్తున్నా.. తాళాలు ఇక్కడ ఇస్తానని మా సార్లకు చెప్పిన. వారు వచ్చాక తాళాలు ఇవ్వండి’ అని చెప్పి వెళ్లాడు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి మొదట ఆజంనగర్ బ్రాంచికి చేరుకుని వెంట తెచ్చుకున్న తాళాలతో బ్యాంకులోకి వెళ్లి దోచుకున్నాడు. అక్కడ ఉంచిన భూపాలపల్లి బ్రాంచి అదనపు తాళాలను తీసుకుని బ్యాంకుకు చేరుకున్నాడు. లాకర్లలోని డబ్బు, బంగారు నగలు తీసుకున్నాడు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను పని చేసే బ్యాంకు కు డబ్బు తీసుకువచ్చే సుమోను హన్మకొండ నుంచి రప్పించుకున్నట్లు తెలిసింది. అదే వాహనంలో కుటుంబంతో శ్రీశైలం వెళ్లి... అక్కడి నుంచి నిజామాబాద్, బాసర వెళ్లాడు. అక్కడ సుమో డ్రైవర్ని తిరిగి పంపాడు. అనంతరం రమేష్ కుటుంబంతో చెన్నైకి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు సుమో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. చోరీకి ముందు రమేష్‌తో ఫోన్లో మాట్లాడిన వారందరినీ పోలీసులు విచారిస్తున్నారు. ‘రమేషే చోరీకి పాల్పడినట్లు ఇప్పుడే చెప్పలేం. అతడి గురించి ఆరా తీయడంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.’ అని ములుగు డీఎస్పీ మురళీధర్ చెప్పారు.