
సాక్షి, భూపాలపల్లి: భూపాలపల్లి కుగ్రామం నుంచి మునిసిపాలిటీ, నియోజకవర్గం, జిల్లాకేంద్రం వరకు విస్తరించింది. సింగరేణి గనులతో భూపాలపల్లి ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతోంది. కేటీపీఎస్ ఏర్పాటుతో భూపాలపల్లి కార్మిక ప్రాంతంగా రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారే పట్టణంలో అధికంగా ఉన్నారు. 2008లో ఏర్పడ్డ భూపాలపల్లి నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించడంలో కార్మికులే కీలకంగా మారారు. రైతులు సైతం ప్రభావితం చేయనున్నారు.
ఇతర ప్రాంతాల వారే అధికం
భూపాలపల్లి పట్టణానికి విలక్షణమైన గుర్తింపు ఉంది. ఇక్కడ స్థిరపడిన వారిలో అధికశాతం వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారే. గోదావరి ఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపెల్లి, చెన్నూర్ వంటి ప్రాంతాల్లో కొన్ని గనులు మూతపడటంతో పాటు ఇక్కడ కొత్తగా గనులు ప్రారంభం అవ్వడంతో ఆయా ప్రాంతాల్లోని కార్మిక కుటుంబాలు భూపాలపల్లికి వచ్చి స్థిరపడ్డాయి. వీరితో పాటు కాటారం, మహాదేవ్‌పూర్ ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారు.ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, గణపురం, రేగొండ మండలాలతోపాటు వరంగల్ రూరల్ జిల్లా నుంచి శాయంపేట మండలం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. చిట్యాల నుంచి కొత్తగా టేకమట్ల మండలం కొత్తగా ఏర్పడింది.
కార్మిక ఓటర్లే కీలకం
భూపాలపల్లి నియోజకవర్గంలో కార్మిక ఓట్లే గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. ఏడు వేల కార్మిక కుటుంబాలు భూపాలపల్లిలో నివాసముంటున్నారు. దాదాపుగా 20వేల ఓట్లు కార్మిక వర్గాల వారివే ఉన్నాయి. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు నల్లేరు మీద నడకే అని ప్రతి అభ్యర్థి భావిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం కూడా కార్మికులకు సెలవు దినమైన ఆదివారం నాడే కార్మిక వాడల్లో నాయకులు కలియతిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో గెలుపొందిన వారు భూపాలపల్లి మండలంలో ముఖ్యంగా పట్టణ పరిధిలో అధికం ఓట్లు రావడం వల్లే గెలుపొందారు. ఈ సారి ఓ పార్టీకి ఓటు వేసి గెలుపిస్తారో వేచి చూడాలి.
2009లో నియోజకవర్గంగా..
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భూపాలపల్లి ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చీఫ్ విప్‌గా పనిచేశారు. 2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి గెలుపొంది తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనసభాపతిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికలు.
పెరిగిన ఓటర్లు
జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో ములుగు కన్నా భూపాలపల్లిలోనే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో 2లక్షల 22వేల 582 మంది ఓటర్లు ఉంటే 2014 ఎన్నికల్లో 2లక్షల 37వేల 803 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన తుది జాబితా ప్రకారం నియోజకవర్గంలో 2లక్షల 45వేల 307 మంది ఓటర్లు ఉన్నారు.