కాళేశ్వరా... ముక్తీశ్వరా.. | Kaleshwaram temple special | Sakshi
Sakshi News home page

కాళేశ్వరా... ముక్తీశ్వరా..

Published Tue, Oct 3 2017 11:47 PM | Last Updated on Tue, Oct 3 2017 11:47 PM

 Kaleshwaram temple special

తెలంగాణాలోని మహా శైవక్షేత్రాలలో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల భక్తుల పూజలతో విరాజిల్లుతుంది. ఈ ఆలయం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. ఈ లింగాలలో ఒకటి కాలుడు (యముడు), మరొకటి ముక్తీశ్వరుడు(శివుడు). ముక్తీశ్వర లింగానికి రెండు నాసికారంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్ళు పోసినా, బయటికి  కనిపించవు. ఆ నీరు భూ అంతర మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని స్కాందపురాణం చెబుతోంది. గర్భగుడికి నాలుగుదిక్కులా నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం ప్రత్యేకత.

కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుండి ప్రవహిస్తున్న ప్రాణహితనది, మంచిర్యాల జిల్లా నుండి ప్రవహిస్తున్న గోదావరినది, అంతర్వాహిని సరస్వతీ నదులు కలసిన ముచ్చటైన క్షేత్రం కాళేశ్వరం. ఇది మూడు నదుల సంగమం.

క్షేత్రపురాణం
యమధర్మరాజు ఒకసారి ఇంద్రలోకం వెళ్లాడు. అక్కడ ప్రజలందరూ యమలోకానికి రావడానికి ఇష్టపడక ఆ మహాశివుని పూజిస్తూ, ఎంతో వైభవంగా ఉన్నట్లు తెలుసుకొన్నాడు. విశ్వకర్మ వద్దకు వెళ్ళి స్వర్గలోకాన్ని మించిన మహానగరాన్ని నిర్మించాలని వేడుకొన్నాడు. ఈ మేరకు విశ్వకర్మ గోదావరి, ప్రాణహిత నదుల సంగమానికి దక్షిణదిశలో కాళేశ్వర పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత యముడు ఘోర తపస్సుతో శివుని ప్రత్యక్షం చేసుకుని, తనకు శివుని పక్కన చోటుకావాలని కోరగా శివుడు సమ్మతించాడు. ఒకే పానవట్టంపై యముడు, శివుడు కొలువైనారు. అప్పటినుంచి యుముని కొలిచిన తరువాతనే శివుణ్ని కొలుస్తారు.

జీర్ణోద్ధరణ
11వ శతాబ్దం అనంతరం దేవాలయం శిధిలావస్థకు చేరుకుంది.   రోడ్డు, రవాణా సౌకర్యాలు లేవు. దేవతామూర్తుల విగ్రహాలు పూర్తిగా భిన్నమై ఉండేవి. ఆ తర్వాత శ్రీశృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు విద్యాతీర్థ మహాస్వామి, భారతీ తీర్థ మహాస్వామి వార్లచే కాళేశ్వర మహాక్షేత్రంలో మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటినుంచి కాళేశ్వర క్షేత్ర ప్రాÔ¶ స్త్యం దేశ నలుమూలలకూ పాకింది.

ఇతర సందర్శనీయ స్థలాలు
ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం, శుభానందదేవి, సరస్వతి, రామాలయం, సంగమేశ్వర, దత్తాత్రేయ ఆలయాలు, దుర్గాదేవి, మహాగణపతి, వీరభద్ర, విజయ గణపతి, అన్నపూర్ణ, చింతామణి, బైరవ, ఆంజనేయ, మత్స్యనారాయణ, మహావిష్ణు, జ్యేష్టాదేవి, సుబ్రమణ్యస్వామి, బాలరాజేశ్వర, కాశీవిశ్వేర, కాలభైరవ, సూర్యాలయాలున్నాయి.

కాలసర్ప, శని పూజలకు ప్రసిద్ధి
శ్రీ కాళహస్తి తరువాత కాలసర్ప, శనిదోష నివారణ పూజలకు కాళేశ్వర క్షేత్రం ప్రసిద్ధి పొందింది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కాలసర్పదోష నివారణ పూజలు, నవగ్రహాలయంలో శనిదోష నివారణకు శనిపూజలను నిర్వహిస్తున్నారు.

పితృదేవతలకు పిండప్రదానాలు
పితృదేవతలకు పిండ ప్రధాన పూజలు, కర్మకాండలు ఇక్కడ ప్రత్యేకత. అస్థికలను త్రివేణీ సంగమంలో కలుపుతారు. ప్రతి సోమవారం స్వామికి అభిషేకం నిర్వహిస్తారు.

వసతి సౌకర్యాలు
వేములవాడ రాజరాజేశ్వరస్వామి వసతి గృహం, సింగరేణి వసతిగృహం, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహం, హనుమంతరావు కాటేజీ, పర్యాటకశాఖ త్రివేణి వసతి గృహం ఉన్నాయి.

క్షేత్రానికి చేరే మార్గం....
హైదరాబాద్‌ నుంచి 270 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి కాళేశ్వరానికి రావచ్చు. రైలు మార్గంలో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు వస్తే, అక్కడి నుంచి బస్సులో వెళ్ళొచ్చు. వరంగల్‌ నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సులున్నాయి. ప్రయివేటు వాహనాల ద్వారా అయితే, హైదరాబాద్‌ నుంచి ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, కరీంగనర్, పెద్దపల్లి, మంథని, కాటారం మహదేవపూర్‌ నుంచి కాళేశ్వరం రావచ్చు. లేదా బోనగిరి, జనగామ, ఆలేరు, వరంగల్, పరకాల, భూపాలల్లి, కాటారం, మహదేవపూర్‌ల నుండి కూడా రావచ్చు.
 – షేక్‌ వలీ హైదర్‌ సాక్షి, కాళేశ్వరం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement