కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణపై ఎన్డీఎస్‌ఏ స్పష్టికరణ
గతంలో నిర్దేశించిన పరీక్షలన్నీ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచన
దావరిలో నిరంతర వరద ప్రవాహం... నవంబర్‌లోనే పరీక్షలు పూర్తిచేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు వరద తగ్గిపోయాక జియోఫిజికల్, జియోటెక్నికల్, ఎలక్టోర్రెసిస్టివిటీ టోమోగ్రఫీ, సాయిల్ (భూసార) పరీక్షలను నిర్వహించి నివేదిక సమర్పించాలని, ఆ తర్వాతే ఈ మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన శాశ్వత చర్యలను సిఫారసు చేస్తూ తుది నివేదిక అందిస్తామని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) స్పష్టం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం ఈ నెల 11న ఢిల్లీలో ఎన్డీఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్‌తో సమావేశమైంది.
బరాజ్‌ల పునరుద్ధరణకు శాశ్వత చర్యలను సాధ్యమైనంత త్వరగా అందించాలని కోరింది. అయితే మధ్యంతర నివేదికలో తాము సిఫారసు చేసిన అన్ని పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహించి నివేదికలు అందిస్తేనే తుది నివేదిక ఇవ్వగలమని ఎన్డీఎస్‌ఏ స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం మూడు బరాజ్‌లకు నిరంతరం వరద కొనసాగుతుండడంతో పరీక్షలు ముందుకు సాగడం లేదు. దీంతో నవంబర్‌లో వరదలు తగ్గుముఖం పట్టాక పరీక్షలు పునరుద్ధరించాలని నీటిపారుదల శాఖ యోచిస్తోంది. అయితే మేడిగడ్డ బరాజ్‌కు ప్రాణహిత నది నుంచి ఫిబ్రవరి వరకు వరద కొనసాగనుంది. దీంతో అక్కడ పరీక్షలు పూర్తి చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.
రబీకి సాగునీటిపై నీలినీడలు
ప్రస్తుత రబీలో లోయర్, మిడ్, అప్పర్ మానేరుతో పాటు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల కింద 20 లక్షల ఎకరాల వరి సాగు జరగనుంది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేసి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తేనే ఈ మేరకు ఆయకట్టుకు సాగునీరుతో పాటు వేసవిలో తాగునీటి సరఫరాకు వీలు కలగనుంది. దీంతో కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్‌కి దిగువన గోదావరిపై జియోట్యూబ్‌లతో మట్టికట్ట కట్టి నిల్వ చేసిన నీళ్లను అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు ఎత్తిపోసి అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కానీ బరాజ్‌లలో నీళ్లు నిల్వ చేసేందుకు ఎన్డీఎస్‌ఏ అనుమతి ఇవ్వడం లేదు. తాము తుది నివేదిక ఇచ్చేవరకు ఆగాలని స్పష్టం చేస్తుండడంతో రబీలో శ్రీరాంసాగర్, లోయర్, మిడ్, అప్పర్ మానేరు, కడెం ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై సందిగ్ధత నెలకొంది. కాగా నవంబర్‌లో బరాజ్‌లకి పరీక్షలన్నీ పూర్తి చేసి నివేదిక సమరి్పస్తే, డిసెంబర్‌లో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
షీట్‌పైల్స్‌తో బరాజ్‌లకు రక్షణ
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ర్యాఫ్ట్ (పునాది)కి రక్షణగా దాని కింద భూగర్భంలో వేసిన సికెంట్ పైల్స్ విఫలం కావడంతోనే బరాజ్‌లు విఫలమైనట్టు నీటిపారుదల శాఖలోని నిపుణులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. దీంతో సికెంట్ పైల్స్‌కు ప్రత్యామ్నాయంగా బరాజ్‌ల పునాదికి రెండు వైపులా భూగర్భంలో 8–9 మీటర్ల వరకు షీట్‌పైల్స్‌తో కటాఫ్ వాల్ నిర్మిస్తే బరాజ్‌లలోని లోపాలను సరిదిద్దినట్టు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఆ తర్వాత అన్నారం, సుందిళ్లలో నీళ్లను నిల్వ చేసినా సీపేజీ సమస్యలు రావని అంటున్నారు. అయితే బరాజ్‌ల పునరుద్ధరణ చర్యలను సిఫారసు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్‌ఏకు అప్పగించిన నేపథ్యంలో ఆ సంస్థ సిఫారసులు చేసేవరకు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్ కుంగిన నేపథ్యంలో బరాజ్ పునరుద్ధరణ సాధ్యమేనా? కుంగిపోయిన భాగాన్ని తొలగించి మళ్లీ 7వ బ్లాక్‌ను పునరి్నర్మించాలా? బరాజ్ పునరుద్ధరణ సాధ్యంకాని పక్షంలో ఇతర ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటి? అనే అంశంపై ఎన్డీఎస్‌ఏ తన తుది నివేదికలో తేల్చి చెప్పే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment