సాక్షి, పెద్దపప్పూరు: తాత ముత్తాతల కాలం నాటి నుంచి సున్నం బట్టీలపైనే ఆధారపడి బతుకుతున్నాం. పగలు రాత్రి ఇంటిల్లిపాది కష్టపడినా కూలీ కూడ గిట్టదు. మరోపని చేతకాకపోవడంతో బట్టీలతోనే కాలం వెళ్లదీస్తున్నాం ఇవి మండలంలోని వరదాయపల్లి లో సున్నం బట్టీలపై ఆధారపడి జీవిస్తున్న వారి నిస్సహాయ పరిస్థితి. రాత్రి పగలు తేడా లేదు. చిన్న వర్షం వస్తే చాలు చేసిన పని పడ్డశ్రమ అంతా బూడిద పాలే. మండలంలోని వరదాయపల్లి శివారు ప్రాంతంలో దాదాపు 50 సున్నంబట్టీల్లో గ్రామంలోని బెస్తకులానికి చెందిన దాదాపు 400 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
ఆడమగ, రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడూ బట్టీల వద్దనే శ్రమిస్తూ కనిపిస్తారు. చాలా మంది సున్నం బట్టీలను ఏర్పాటు చేసుకోవడానికి తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో మరొకరి దగ్గర కూలీలుగా పనిచేస్తున్నారు. సున్నం తయారు చేయడానికి కావల్సిన ముడి రాయి దగ్గరి నుండి కాల్చడానికి ఉపయోగించే కట్టెల వరకు అన్నీ కొనాల్సిన పరిస్థితి. ఇంటిల్లి పాది కలిసి ముడిరాయి, కట్టెలను చిన్న ముక్కలుగా చేసుకోవడానికి, సున్నం కాల్చడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. ఒక్కసారి బట్టీ నుండి వచ్చిన సున్నం దాదాపు టన్నున్నర వుంటుంది.
బెంగుళూరుకు చెందిన వ్యాపారులు సున్నం కొంటారు. ప్రస్తుతం టన్ను సున్నం రూ.4వేలు వుంది. ముడిరాయి ఖర్చు రూ.600, టన్ను కట్టెలు రూ.1600, కూలీల ఖర్చుపోను ఆదాయం అంతంత మాత్రమే. ముడిరాయి సున్నంగా తయారవుతున్న సమయంలో (ముడిరాయిని బట్టీలో కాల్చే సమయంలో) ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా వారం రోజులు పడ్డ శ్రమ అంతా వృథా అవుతుందన్నారు. దీంతో సున్నం బట్టీలపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలు దుర్బర పరిస్థితిని అనుభవిస్తున్నాయి. సున్నం బట్టీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
గిట్టుబాటు కావడం లేదు
సున్నం పనులు గిట్టుబాటు కావడం లేదు. కుటుంబసభ్యులం అందరం కష్టపడ్డా పూట గడవని పరిస్థితి. ముడి సరుకుల ధరలు పెరగడంతో కష్టానికి తగిన ఫలితం లేకుండా పోయింది. చిన్న వర్షం వచ్చినా చేసిన పనిఅంతా వ్యర్థం అవుతుంది. ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించి ఆదుకోవాలి. –నారాయణస్వామి, సున్నం బట్టీ నిర్వాహకుడు, వరదాయపల్లి
ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది
ఎన్నో ఏళ్లుగా సున్నం కాల్చి బతుకీడుస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. కుటుంబం అంతా ఎండనక వాననక కష్టపడినా కుటుంబం గడవని పరిస్థితి. ప్రజాప్రతినిధులు మాపై దయచూపాలి. మాకు ప్రభుత్వం రుణాలు అందించి ఆదుకోవాలి. –లక్ష్మీనారాయణ, సున్నం బట్టీ నిర్వాహకుడు, వరదాయపల్లి
Comments
Please login to add a commentAdd a comment