రుద్రంపూర్: పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీఎంఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తదనంతరం బీఎంఎస్ నాయకులు మంత్రికి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార మెడికల్ సిబ్బందికి క్యాడర్ స్కీంను కోలిండియాలో అమలు చేస్తున్నారని, కానీ సింగరేణిలో మాత్రం అమలు చేయటం లేదని, ఫలితంగా వారు కొంత కాలంగా ఉద్యోగోన్నతులు లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని, అంతేకాకుండా నర్స్‌గా అపాయింట్ అయిన వారు నర్స్‌గానే పదవీవిరమణ పొందాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణిలో గిరిజన బ్యాక్‌లాగ్ 665 బదిలీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మీ సమస్యలపై సంబంధిత అ«ధికారులకు లేఖలు రాయించి వీలైనంత త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీఎంఎస్ కార్యదర్శి మాధవ నాయక్, చింతల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.