భ్రమరాంబకాలనీలో చెంచులతో మాట్లాడుతున్న ఎన్‌ఏఎస్‌సీ స్టేట్ కో–ఆర్డినేటర్ వాసుదేవరావు
కొల్లాపూర్ రూరల్: వెట్టి కార్మికులుగా పనిచేస్తున్న చెంచులకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విముక్తి కలిగింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి సమీపంలోని చెంచు భ్రమరాంబకాలనీకి చెందిన పిల్లలతో కలిపి 21 మంది చెంచులను ఆరు నెలల క్రితం పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగడకు చెందిన మేస్త్రీ గోపాల్‌నాయక్ కర్ణాటక రాష్ట్రం బెంగళూర్‌లోని ఓ ప్రాంతంలో కాంక్రీట్ పని నిమిత్తం ఏడాదికి రూ.20వేల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తూ వలస తీసుకెళ్లాడు. ఈ సమాచారం అందుకున్న నేషనల్ ఆదివాసీ సాలిడ్ ఆర్టికౌన్సిల్ (ఎన్‌ఏఎస్‌సీ) రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాసుదేవరావు, ఐడి మహేష్ తదితరులు మూడు రోజుల క్రితం అక్కడికి వెళ్లారు.
బెంగళూరు కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి వారికి విముక్తి కల్పించి పోలీసుల భద్రతతో బుధవారం భ్రమరాంబకాలనీకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ తమ సంస్థ దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెంచుల విముక్తి కోసం పనిచేస్తోందన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీ ధర్ వద్దకు ఈ చెంచులను తీసుకెళ్లి స్థానికంగానే జీవనోపాధి కల్పించాలని కోరుతామన్నారు. బాధితుల్లో నర్సింహ, బయ్యన్న, బుడ్డయ్య, మంగమ్మ, ఈదమ్మ, వీరస్వామి, శేకర్, కుర్మ య్య, ఎల్లమ్మతోపాటు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment