చీకటి బతుకులు | wages low in apcdpcl contract workers | Sakshi
Sakshi News home page

చీకటి బతుకులు

Published Tue, Oct 10 2017 6:55 AM | Last Updated on Tue, Oct 10 2017 6:55 AM

wages low in apcdpcl contract workers

ఒంగోలు, మార్టూరు:సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. కార్మికులు పని చేసే చోట వివక్ష రూపుమాపాలి. శాశ్వత పని ప్రదేశాల్లో కాంట్రాక్టు వ్యవస్థ ఉండకూడదు.. కాంట్రాక్ట్‌ కార్మికులను ఉద్దేశించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2015లో వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులే లేరని, ఉన్న వారంతా ఔట్‌సోర్సింగ్‌ కార్మికులని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్‌పీడీసీఎల్‌ సంస్థలో 24 వేల మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. వీరిలో కార్మికులుగా, అమాన్యులుగా, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా జిల్లాలో పని చేస్తున్న వారు రెండు వేల మందికి పైగానే ఉన్నారు. వీరు 20 ఏళ్ల నుంచి చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు. ఎప్పటికైనా తమ జీవితాల్లోకి వెలుగులు రాకపోతాయా..అని ఆశగా ఎదురు చూస్తూ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు.

74 రకాల పనులకు వినియోగం
సంస్థ కాంట్రాక్ట్‌ కార్మికులను 74 రకాల పనులకు వినియోగించుకుంటోంది. రోజుకు కనీస వేతనం 150 రూపాయల నుంచి గరిష్టంగా 300 రూపాయల వరకు ఇస్తారు. సబ్‌స్టేషన్‌ పరిధిలో మాత్రమే రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉండగా దూర ప్రాంతాలకు సైతం ఎలాంటి భత్యాలు, రవాణ ఖర్చులు ఇవ్వకుండా తీసుకెళ్లి అదనపు గంటలు కూడా పని చేయిస్తుంటారు. సబ్‌స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుల కుంటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇచ్చి సంస్థ చేతులు దులుపుకుంటోంది. సబ్‌స్టేషన్‌ పరిధిలో కాకుండా బయట ప్రాంతాల్లో మరణిస్తే రూపాయి కూడా ఇవ్వరు. ప్రమాదవశాత్తు శాశ్వతంగా కానీ పాక్షికంగా కానీ అంగవైకల్యం ఏర్పడితే పట్టించుకునే నాథుడే ఉండడు. ఇచ్చే వేతనాలైనా సమయానికి వస్తాయా..అంటే అదీ లేదు. రెండు మూడు నెలలకు ఒకసారి.. అదీ కాంట్రాక్టర్‌ దయాదాక్షణ్యాల మీద ఆధార పడి ఉంటుంది. వర్షాకాలం, తుఫాన్‌ సమయంలో వీరి బాధలు వర్ణనాతీతం. కరెంటు స్తంభాలు విరిగి రోడ్లకు అడ్డంగా చెట్టు పడితే వాటిని తొలగించాల్సింది కూడా కాంట్రాక్ట్‌ కార్మికులే. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరెంటు బిల్లులు సైతం వీరే వసూలు చేయాలి.

సగం మందికి పైగా 20 ఏళ్ల సర్వీసు
జిల్లాలో నాలుగు 220 కేవీఏ స్టేషన్లు, 18 132 కేవీఏ స్టేషన్లు, 280 సబ్‌ స్టేషన్లు ఉన్నాయి. కార్మికుల్లో సగం మంది 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న వారు కూడా ఉండటం గమనార్హం. ఏపీఎస్‌పీడీసీఎల్‌కు సంబంధించిన పనులు కాంట్రాక్టర్లు దక్కించుకుని పనులు కాంట్రాక్ట్‌ కార్మికులతో చేయించుకుంటారు. ఒక కార్మికుడు ఒక ఇంటి మీటరు రీడింగ్‌ తీస్తే 2 రూపాయలు ఇస్తారు. ఈ పద్ధతిన ఎక్కువ లబ్ధి పొందేది కాంట్రాక్టర్లే కావడం గమనార్హం. కాంట్రాక్టులు దక్కించుకునే వారు ఎక్కువ మంది సంస్థలోని ఉన్నతాధికారులకు బంధువులు. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో 7400 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015లో 20 వేల మంది కార్మికులను రెగ్యులర్‌ చేసేందుకు ప్రయత్నించగా న్యాయ సంబంధ అంశాలు అడ్డు రావడంతో వారందరినీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలో విలీనం చేసి నెలకు 23 వేల రూపాయల కనీస వేతనం ఇస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీని ఆయన తుంగలో తొక్కారు.

తమిళనాడు రాష్ట్రంలో దశలవారీగా 35 వేల మంది కార్మికులను రెగ్యులర్‌ చేశారని, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో రెగ్యులర్‌ చేసేందుకు చట్టాలు తీసుకొచ్చినట్లు మన ప్రాంత కార్మికులు చెబుతున్నారు. ఇక్కడ తమ సమస్య పరిష్కారం కాకపోవడానికి కొన్ని యూనియన్లు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఉద్యమాలను నీరు కార్చాయని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం, దీర్ఘకాలంగా పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను విద్య, వయో పరిమితి లేకుండా రెగ్యులర్‌ చేయడం లేదా విలీనం చేయడం, కనీస వేతన చట్టాన్ని అమలు పరచడం, పని ప్రదేశాల్లో మరణించిన వారికి 10 లక్షల రూపాయల నష్ట పరిహారం, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు విధిగా అమలు చేసి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు బ్యాంకుల ద్వారా చెల్లించాలని కార్మికులు నెల నుంచి తిరుపతిలోని సీఎండీ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్ల స్థాయి కార్యాలయాల వరకు సమ్మె నోటీసులిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement