cantractors
-
నిధుల దోపిడీకి పచ్చజెండా?
బి.కొత్తకోట: జిల్లాలో 2005 నుంచి 2009 వరకు హంద్రీ–నీవా సహా మిగిలిన ప్రాజెక్టుల పనులు చేపట్టి పూర్తిచేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్లకు అదనపు నిధులు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులను ఇటీవల జారీ చేసింది. 2014 తర్వాత నుంచి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు వర్తించదు. అయినప్పటికీ టీడీపీ కాంట్రాక్టర్ల ఒత్తిళ్లతో అందినంత దోచుకునేందుకు రంగం సిద్ధమవుతోం ది. దీనికి అవినీతి ముద్ర లేకుండా, అనుకూలమైన ఒకరిద్దరు టీడీపీ కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ధి్ద కలిగేలా జీఓ జారీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఇందులో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు అప్పనంగా రూ.160కోట్ల ప్రభుత్వ నిధులు దోచి పెట్టేందుకు పక్కా ప్రణాళిక సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు తరలించే కుప్పం ఉపకాలువ పనులను 4శాతం అదనంతో రూ.430.27 కోట్లకు హెఈఎస్, ఆర్కే, కోయా జాయింట్ వెంచర్ పనులు దక్కించుకోగా ఈ సంస్థల వినతిమేరకు ప్రభుత్వం రిత్విక్ ప్రాజెక్ట్స్, మరో కాంట్రాక్టు సంస్థను పనుల్లో భాగస్వామ్యం కల్పించింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వం ముందుగా తెలిపిన పనుల అంచనా వ్యయాన్ని తెలిపింది. దీనిని పరిశీలించాకే కాంట్రాక్టు సంస్థలు పనులు దక్కిం చుకొన్నాయి. నిబంధనల మేరకు ప్రతిపాదిత పనులు పూర్తి చేయాల్సిన సంస్థలు తమకు అనుకూలంగా పనులు చేశాయి. కాలువ దూరం తగ్గించడం, కొత్తగా పనులను చేర్చుకొంటూ వచ్చా యి. నిబంధనల మేరకు నిర్ణయించిన అంచనాకు పనులు పూర్తిచేసి ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాకర్లది. ఇక్కడ మాత్రం పనులు అనుకూలంగా చేసుకోవడంతో పాటు అదనపు భారం పడిందంటూ రూ.160కోట్లు చెల్లించాలని మెలిక పెట్టా రు. ఈ విషయాన్ని మదనపల్లె సర్కిల్ అధికారులు చీఫ్ ఇంజినీర్ల కమిటీకి నివేదించారు. అదనపు చెల్లింపులకు సంబం ధించిన వివరాలతో కమిటీ ఆర్థికశాఖకు నివేదిక పంపింది. ఆర్థికశాఖ ఈ నివేదికను మూడురోజుల క్రితం చీఫ్ ఇంజనీర్ల కమిటీకి తిప్పిపంపినట్టు సమాచారం. కుప్పం కోసమే? చీఫ్ ఇంజినీర్ల కమిటీ ప్రతిపాదనలో కుప్పం కాలువకు అదనంగా రూ.160 కోట్ల చెల్లింపుల ప్రస్తావన లేకుండానే 2014 తర్వాత పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా జీఓ 22,63 తరహాలో కొంత ప్రయోజనం కలిగించాలని మరో ప్రతిపాదనను మళ్లీ ఆర్థికశాఖకు పంపింది. ఈ శాఖ కాంట్రాక్టర్లకు అదనపు ధరలు ఎందుకు చెల్లించాలి, అందుకు కారణాలు, వివరాలను సమగ్రంగా నివేదిం చాలని చీఫ్ ఇంజనీర్ల కమిటికి నివేదిం చిందినట్టు తెలిసింది. దీనికి చీఫ్ ఇంజనీర్ల కమిటి నిర్ణయం, చెల్లింపులకు అనుకూలంగా ఎలాంటి ప్రతిపాదన అందిస్తుం దో తేలాలి. కుప్పం ఉపకాలువతోపాటు టీడీపీ ముఖ్యనేతలు చేపట్టిన పనులకు సంబంధించిన కొన్నింటికి మాత్రమే ఈ అదనపు నిధులు అందే విధంగా జీఓ జారీచేసే అవకాశాలు లేకపోలేదని భావి స్తున్నారు. కాంట్రాక్టర్లందరికీ వర్తించకుండా తమ కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులందించేలా నిబంధనలు సవరించి చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుప్పం కాలువ పనులు పూర్తిగా ఆగిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పనులు చేయించేందుకు భయపడుతున్నారు. టీడీపీ ముఖ్యనేత ఒకరు ఈ పనుల్లో భాగస్వామిగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. -
జుట్టు జగడం..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మేడారం జాతర సమయం దగ్గర పడుతున్నా తలనీలాలు సేకరించే పని ఎవరికి అప్పగించాలనే అంశం ఓ కొలిక్కి రాలేదు. గత జాతరల్లాగే నామినేషన్ పద్ధతినే కొనసాగించాలని పూజారుల సంఘం కోరుతుండగాæ. టెండర్‌తో మరింత ఆదాయం సమకూరుతుందని దేవాదాయశాఖ వాదిస్తోంది. మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జాతర సాగుతోంది. జాతరలో హుండీ ద్వారా సమకూరే ఆదాయంలో 33 శాతాన్ని పూజారుల సంఘానికి చెల్లిస్తున్నారు. అదేవిధంగా.. జాతరలో భక్తులు మొక్కుగా సమర్పించే తలనీలాలను సేకరించే పనిని నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికి అప్పగిస్తున్నారు. ఈ తలనీలాల సేకరణ ద్వారా పూజారుల సంఘానికి మరికొంత ఆదాయం సమకూరుతోంది. గత రెండు జాతరల (2014, 2016) నుంచి తలనీలాల సేకరణ పనులను నామినేషన్ పద్ధతిలో పూజారుల సంఘానికి అప్పగించడంపై దేవాదాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో నామినేషన్ పద్ధతిన పూజారుల సంఘానికి ఇవ్వకుండా.. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కువ «ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది. టెండర్లు నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో 33 శాతం పూజారుల సంఘానికి ఇస్తామని చెబుతోంది. చేదు అనుభవాలు.. టెండర్ల పద్ధతిలో కాంట్రాక్టర్లు రింగైతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని పూజారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో 2004, 2006 జాతర సమయాల్లో తలానీలాల సేకరణకు టెండర్లు పిలిస్తే పది లక్షలకు మించి ధర రాలేదు. దీంతో దేవాదాయశాఖకు వచ్చే రాబడి తగ్గిపోయింది. ఫలితంగా తమకు వచ్చే 33 శాతం ఆదాయంపై కోత పడుతోందని పూజారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల పద్ధతిలో చేదు అనుభవాలు ఎదురుకావడంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. మళ్లీ విఫలమైన ప్రయోగాన్ని తమ నెత్తిన ఎందుకు రుద్దుతారంటూ పూజారుల సంఘం వాదిస్తోంది. మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు తగ్గట్లుగా సరైన ధర చెల్లిస్తూ పనులు దక్కించుకుంటున్నామని వారు అంటున్నారు. 2016 జాతరకు రూ. 1.5 కోట్లు, 2014 జాతరలో కోటి రూపాయలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రాధాన్యం తగ్గిస్తున్నారు మేడారం జాతరలో రానురాను తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందని సమ్మక్క–సారలమ్మ పూజారులు ఆందోళన చెందుతున్నారు. క్రమంగా హిందు మత ప్రభావానికి తోడు జాతరలో వ్యాపార ధోరణి పెరిగిపోతోందని చెబుతున్నారు. వీటి కారణంగా తమ ఆచారాలకు ప్రాధాన్యం తగ్గుతుందన్న ఆవేదన ఆదివాసీల నుంచి వ్యక్తమవుతోంది. తమ చేతి నుంచి ఒక్కో వ్యవహారాన్ని క్రమక్రమంగా దేవాదాయ శాఖ దూరం చేస్తోందని, అందులో భాగంగా ఈ జాతరలో తలనీలాల పనులను తమకు కాకుండా చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. జాతర గడువు సమీపిస్తున్నా ఏ విషయం తేల్చకపోవడం తమను అవమానించడమేనని గిరిజన పూజారులు అంటున్నారు. తలనీలాల సేకరణ విషయంలో 2014 జాతర సందర్భంగా దేవాదాయశాఖ, పూజారుల సంఘానికి మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడింది. దీంతో తలనీలాల పనులు తమకు కేటాయించకుంటే జాతర పనులకు సహకరించబోమంటూ అప్పుడు పూజారుల సంఘం సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. మరోసారి అదే తరహా పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది. -
చీకటి బతుకులు
ఒంగోలు, మార్టూరు:సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. కార్మికులు పని చేసే చోట వివక్ష రూపుమాపాలి. శాశ్వత పని ప్రదేశాల్లో కాంట్రాక్టు వ్యవస్థ ఉండకూడదు.. కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2015లో వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులే లేరని, ఉన్న వారంతా ఔట్సోర్సింగ్ కార్మికులని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్పీడీసీఎల్ సంస్థలో 24 వేల మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. వీరిలో కార్మికులుగా, అమాన్యులుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా జిల్లాలో పని చేస్తున్న వారు రెండు వేల మందికి పైగానే ఉన్నారు. వీరు 20 ఏళ్ల నుంచి చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు. ఎప్పటికైనా తమ జీవితాల్లోకి వెలుగులు రాకపోతాయా..అని ఆశగా ఎదురు చూస్తూ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. 74 రకాల పనులకు వినియోగం సంస్థ కాంట్రాక్ట్ కార్మికులను 74 రకాల పనులకు వినియోగించుకుంటోంది. రోజుకు కనీస వేతనం 150 రూపాయల నుంచి గరిష్టంగా 300 రూపాయల వరకు ఇస్తారు. సబ్‌స్టేషన్ పరిధిలో మాత్రమే రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉండగా దూర ప్రాంతాలకు సైతం ఎలాంటి భత్యాలు, రవాణ ఖర్చులు ఇవ్వకుండా తీసుకెళ్లి అదనపు గంటలు కూడా పని చేయిస్తుంటారు. సబ్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుల కుంటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇచ్చి సంస్థ చేతులు దులుపుకుంటోంది. సబ్‌స్టేషన్ పరిధిలో కాకుండా బయట ప్రాంతాల్లో మరణిస్తే రూపాయి కూడా ఇవ్వరు. ప్రమాదవశాత్తు శాశ్వతంగా కానీ పాక్షికంగా కానీ అంగవైకల్యం ఏర్పడితే పట్టించుకునే నాథుడే ఉండడు. ఇచ్చే వేతనాలైనా సమయానికి వస్తాయా..అంటే అదీ లేదు. రెండు మూడు నెలలకు ఒకసారి.. అదీ కాంట్రాక్టర్ దయాదాక్షణ్యాల మీద ఆధార పడి ఉంటుంది. వర్షాకాలం, తుఫాన్ సమయంలో వీరి బాధలు వర్ణనాతీతం. కరెంటు స్తంభాలు విరిగి రోడ్లకు అడ్డంగా చెట్టు పడితే వాటిని తొలగించాల్సింది కూడా కాంట్రాక్ట్ కార్మికులే. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరెంటు బిల్లులు సైతం వీరే వసూలు చేయాలి. సగం మందికి పైగా 20 ఏళ్ల సర్వీసు జిల్లాలో నాలుగు 220 కేవీఏ స్టేషన్లు, 18 132 కేవీఏ స్టేషన్లు, 280 సబ్ స్టేషన్లు ఉన్నాయి. కార్మికుల్లో సగం మంది 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న వారు కూడా ఉండటం గమనార్హం. ఏపీఎస్పీడీసీఎల్కు సంబంధించిన పనులు కాంట్రాక్టర్లు దక్కించుకుని పనులు కాంట్రాక్ట్ కార్మికులతో చేయించుకుంటారు. ఒక కార్మికుడు ఒక ఇంటి మీటరు రీడింగ్ తీస్తే 2 రూపాయలు ఇస్తారు. ఈ పద్ధతిన ఎక్కువ లబ్ధి పొందేది కాంట్రాక్టర్లే కావడం గమనార్హం. కాంట్రాక్టులు దక్కించుకునే వారు ఎక్కువ మంది సంస్థలోని ఉన్నతాధికారులకు బంధువులు. ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో 7400 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015లో 20 వేల మంది కార్మికులను రెగ్యులర్ చేసేందుకు ప్రయత్నించగా న్యాయ సంబంధ అంశాలు అడ్డు రావడంతో వారందరినీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో విలీనం చేసి నెలకు 23 వేల రూపాయల కనీస వేతనం ఇస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీని ఆయన తుంగలో తొక్కారు. తమిళనాడు రాష్ట్రంలో దశలవారీగా 35 వేల మంది కార్మికులను రెగ్యులర్ చేశారని, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో రెగ్యులర్ చేసేందుకు చట్టాలు తీసుకొచ్చినట్లు మన ప్రాంత కార్మికులు చెబుతున్నారు. ఇక్కడ తమ సమస్య పరిష్కారం కాకపోవడానికి కొన్ని యూనియన్లు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఉద్యమాలను నీరు కార్చాయని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం, దీర్ఘకాలంగా పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను విద్య, వయో పరిమితి లేకుండా రెగ్యులర్ చేయడం లేదా విలీనం చేయడం, కనీస వేతన చట్టాన్ని అమలు పరచడం, పని ప్రదేశాల్లో మరణించిన వారికి 10 లక్షల రూపాయల నష్ట పరిహారం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు విధిగా అమలు చేసి ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు బ్యాంకుల ద్వారా చెల్లించాలని కార్మికులు నెల నుంచి తిరుపతిలోని సీఎండీ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్ల స్థాయి కార్యాలయాల వరకు సమ్మె నోటీసులిచ్చారు. -
ప్రిస్టేజ్ పోయింది!
ఐసీడీఎస్‌లో కుక్కర్ల కుంభకోణం రూ.74 లక్షలతో కుక్కర్ల కొనుగోలుకు టెండర్లు సరఫరా చేయకముందే కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపు ఎనిమిది నెలలకు ప్రిస్టేజ్ స్థానంలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా లోపాయికారి ఒప్పందంతో నోరు మెదపని అధికారులు సాక్షి ప్రతినిధి, కడప : వక్ర మార్గానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఐసీడీఎస్ కార్యాలయం తయారైంది. పిల్లల పౌష్టికాహారం మొదలు ప్రతి సందర్భంలోనూ అక్రమ ఆదాయమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. ఓ వైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఆ శాఖ పనితీరులో మార్పు కనిపించడం లేదు. తాజాగా కుక్కర్ల కొనుగోల్‌మాల్ వ్యవహారం బహిర్గతమైంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించిన ఎనిమిది నెలల అనంతరం లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఐసీడీఎస్ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు కుక్కర్లు సరఫరా చేయదలిచింది. ఆ మేరకు 7.5 లీటర్ల కెపాసిటి గల 3621 కుక్కర్లు, 5 లీటర్లు కెపాసిటిగల 2861 కుక్కర్ల కోసం టెండర్లు ఆహ్వానించారు. 7.5 లీటర్ల కుక్కర్ రూ.1320 చొప్పున, 5 లీటర్ల కుక్కర్ రూ.940 చొప్పున సరఫరా చేసేందుకు ఎంఅండ్ఎస్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. ఈ ప్రక్రియ గత ఏడాది ఫిబ్రవరి 14న ముగిసింది. టెండర్లు దక్కించుకున్న నెలలోపు కాం ట్రాక్టర్ బిల్లు పెట్టుకున్నాడు. మార్చి 10న బిల్లు పెట్టుకోగా మార్చి 12న రూ.74.69 లక్షలు ఐసీడిఎస్ యంత్రాంగం కాం ట్రాక్టర్‌కు చెల్లించి ంది. వాస్తవానికి కుక్కర్లు సరఫరా చేసిన అనంతరం బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ ఇచ్చిన కాసులకు కక్కుర్తిపడిన యంత్రాంగం ముందుస్తుగా బిల్లు చెల్లించి స్వామి భక్తి ప్రదర్శించినట్లు సమాచారం. అనంతరం ఎనిమిది నెలల పాటు కుక్కర్లు సరఫరా చేయకపోయినా యంత్రాంగం ‘నిమ్మకు నీరెత్తినట్లు’గా ఉండిపోయారు. నవంబర్ 12న కుక్కర్లు సరఫరా చేశారు. లోపాయి కారి ఒప్పందం వల్లే అధికారులు ఇంత ఆలస్యమైనా నోరు మెదపనట్లు సమాచారం. ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్ స్థానంలో లోకల్‌మేడ్ నిబంధనల మేరకు ఎంఅండ్ఎస్ ఎంటర్ ప్రైజెస్ ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్లు సరఫరా చేయాల్సి ఉంది. అయితే లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, కమలాపురం, ప్రొద్దుటూరు, పులివెందుల, సిద్ధవటం సీడీపీఓ ప్రాజెక్టు పరిధిలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మండల కేంద్రాల పరిధిలో నిబంధన మేరకు కంపెనీ కుక్కర్లు సరఫరా చేసి, గ్రామాల పరిధిలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు సమాచారం. దాదాపు 3500 పైగా లోకల్‌మేడ్ కుక్కర్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు సుమారు రూ.20 లక్షలు పైగా అక్రమంగా కాంట్రాక్టర్ సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు ప్రత్యక్షంగా ఐసీడీఎస్ యంత్రాంగం సహకారం స్పష్టంగా కన్పిస్తోంది. వాస్తవమే.. విచారిస్తున్నాం : ఐసీడీఎస్ పీడీ రాఘవరావు అంగన్వాడీ కేంద్రాలకు ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్ల స్థానంలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేశారని కొంత మంది సీడీపీఓలు నా దృష్టికి తెచ్చారు. ఆ మేరకు విచారణ చేపడుతున్నాం. బిల్లులు ముందుస్తుగా ఎందుకు చెల్లించారనే విషయమై కూడా విచారణ సాగుతోంది. లోకల్ మేడ్ కుక్కర్లు ఉన్నట్లు గుర్తించాం. శాఖపరంగా విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం.