సాక్షి ప్రతినిధి, వరంగల్ : మేడారం జాతర సమయం దగ్గర పడుతున్నా తలనీలాలు సేకరించే పని ఎవరికి అప్పగించాలనే అంశం ఓ కొలిక్కి రాలేదు. గత జాతరల్లాగే నామినేషన్ పద్ధతినే కొనసాగించాలని పూజారుల సంఘం కోరుతుండగాæ. టెండర్‌తో మరింత ఆదాయం సమకూరుతుందని దేవాదాయశాఖ వాదిస్తోంది. మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జాతర సాగుతోంది. జాతరలో హుండీ ద్వారా సమకూరే ఆదాయంలో 33 శాతాన్ని పూజారుల సంఘానికి చెల్లిస్తున్నారు. అదేవిధంగా.. జాతరలో భక్తులు మొక్కుగా సమర్పించే తలనీలాలను సేకరించే పనిని నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికి అప్పగిస్తున్నారు.
ఈ తలనీలాల సేకరణ ద్వారా పూజారుల సంఘానికి మరికొంత ఆదాయం సమకూరుతోంది. గత రెండు జాతరల (2014, 2016) నుంచి తలనీలాల సేకరణ పనులను నామినేషన్ పద్ధతిలో పూజారుల సంఘానికి అప్పగించడంపై దేవాదాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో నామినేషన్ పద్ధతిన పూజారుల సంఘానికి ఇవ్వకుండా.. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కువ «ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది. టెండర్లు నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో 33 శాతం పూజారుల సంఘానికి ఇస్తామని చెబుతోంది.
చేదు అనుభవాలు..
టెండర్ల పద్ధతిలో కాంట్రాక్టర్లు రింగైతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని పూజారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో 2004, 2006 జాతర సమయాల్లో తలానీలాల సేకరణకు టెండర్లు పిలిస్తే పది లక్షలకు మించి ధర రాలేదు. దీంతో దేవాదాయశాఖకు వచ్చే రాబడి తగ్గిపోయింది. ఫలితంగా తమకు వచ్చే 33 శాతం ఆదాయంపై కోత పడుతోందని పూజారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల పద్ధతిలో చేదు అనుభవాలు ఎదురుకావడంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. మళ్లీ విఫలమైన ప్రయోగాన్ని తమ నెత్తిన ఎందుకు రుద్దుతారంటూ పూజారుల సంఘం వాదిస్తోంది. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు తగ్గట్లుగా సరైన ధర చెల్లిస్తూ పనులు దక్కించుకుంటున్నామని వారు అంటున్నారు. 2016 జాతరకు రూ. 1.5 కోట్లు, 2014 జాతరలో కోటి రూపాయలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ప్రాధాన్యం తగ్గిస్తున్నారు
మేడారం జాతరలో రానురాను తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందని సమ్మక్క–సారలమ్మ పూజారులు ఆందోళన చెందుతున్నారు. క్రమంగా హిందు మత ప్రభావానికి తోడు జాతరలో వ్యాపార ధోరణి పెరిగిపోతోందని చెబుతున్నారు. వీటి కారణంగా తమ ఆచారాలకు ప్రాధాన్యం తగ్గుతుందన్న ఆవేదన ఆదివాసీల నుంచి వ్యక్తమవుతోంది. తమ చేతి నుంచి ఒక్కో వ్యవహారాన్ని క్రమక్రమంగా దేవాదాయ శాఖ దూరం చేస్తోందని, అందులో భాగంగా ఈ జాతరలో తలనీలాల పనులను తమకు కాకుండా చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. జాతర గడువు సమీపిస్తున్నా ఏ విషయం తేల్చకపోవడం తమను అవమానించడమేనని గిరిజన పూజారులు అంటున్నారు. తలనీలాల సేకరణ విషయంలో 2014 జాతర సందర్భంగా దేవాదాయశాఖ, పూజారుల సంఘానికి మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడింది. దీంతో తలనీలాల పనులు తమకు కేటాయించకుంటే జాతర పనులకు సహకరించబోమంటూ అప్పుడు పూజారుల సంఘం సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. మరోసారి అదే తరహా పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment