ఆగస్టులో 9.3 శాతం క్షీణత...
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యం
భారీ దిగుమతులతో 10 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి భారత్ వస్తు ఎగుమతులపై ప్రభావం చూపింది. ఆగస్టులో ఎగుమతులు గడచిన 13 నెలల్లో ఎన్నడూ లేని స్థాయిలో 9.3 శాతం క్షీణించి (2023 ఆగస్టు నెలతో పోల్చి) 34.71 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. జూలైలో కూడా ఎగుమతుల విలువ పడిపోయినప్పటికీ అది కేవలం 1.5 శాతంగా ఉండడం గమనార్హం.
దిగుమతులు రికార్డు...
ఇక దిగుమతులుసైతం రికార్డు స్థాయిలో 3.3 శాతం పెరిగి 64.36 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం – వాణిజ్యలోటు 10 నెలల గరిష్ట స్థాయిలో 29.65 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
బంగారం, వెండి ప్రభావం..
బంగారం, వెండి దిగుమతులు భారీగా పెరగడం తీవ్ర స్థాయి వాణిజ్యలోటుకు ఒక కారణం. 2023 ఆగస్టులో బంగారం దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లుకాగా,
ఈ ఆగస్టులో రెట్టింపై 10.06 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులుసైతం ఇదే సమయంలో 159 మిలియన్ డాలర్ల నుంచి 727 మిలియన్ డాలర్లకు ఎగశాయి. బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాలను (15% నుంచి 6%కి) తగ్గించడం, పండుగ సీజన్ డిమాండ్ దిగుమతులు భారీగా పెరగడానికి కారణం. కాగా, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య వస్తు ఎగుమతుల విలువ 1.14% పెరిగి 178.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment