commodity market
-
ఎగుమతులు ఢమాల్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి భారత్ వస్తు ఎగుమతులపై ప్రభావం చూపింది. ఆగస్టులో ఎగుమతులు గడచిన 13 నెలల్లో ఎన్నడూ లేని స్థాయిలో 9.3 శాతం క్షీణించి (2023 ఆగస్టు నెలతో పోల్చి) 34.71 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. జూలైలో కూడా ఎగుమతుల విలువ పడిపోయినప్పటికీ అది కేవలం 1.5 శాతంగా ఉండడం గమనార్హం. దిగుమతులు రికార్డు... ఇక దిగుమతులుసైతం రికార్డు స్థాయిలో 3.3 శాతం పెరిగి 64.36 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం – వాణిజ్యలోటు 10 నెలల గరిష్ట స్థాయిలో 29.65 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బంగారం, వెండి ప్రభావం.. బంగారం, వెండి దిగుమతులు భారీగా పెరగడం తీవ్ర స్థాయి వాణిజ్యలోటుకు ఒక కారణం. 2023 ఆగస్టులో బంగారం దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లుకాగా, ఈ ఆగస్టులో రెట్టింపై 10.06 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులుసైతం ఇదే సమయంలో 159 మిలియన్ డాలర్ల నుంచి 727 మిలియన్ డాలర్లకు ఎగశాయి. బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాలను (15% నుంచి 6%కి) తగ్గించడం, పండుగ సీజన్ డిమాండ్ దిగుమతులు భారీగా పెరగడానికి కారణం. కాగా, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య వస్తు ఎగుమతుల విలువ 1.14% పెరిగి 178.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో సోమవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,300 (22 క్యారెట్స్), రూ.72,330 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఆదివారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.220, రూ.220 తగ్గింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.66,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.72,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,450.. 24 క్యారెట్ల ధర రూ.72,480కు చేరాయి. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.95,600 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ద్రవ్యోల్బణం మార్కెట్‌కా, మందికా?
ఒకప్పుడు ఉపాధి కల్పనకు పునాదులుగా ఉండే వ్యవసాయ, పారిశ్రామిక సరుకు ఉత్పత్తి, సేవారంగాలు ఆర్థిక వ్యవస్థలో పైచేయిలో ఉండేవి. కానీ 1980ల అనంతరం, ఈ రంగాలకు కేవలం పెట్టుబడిని సరఫరా చేసే ఫైనాన్స్ రంగానిది పైచేయి అయింది. అంటే, కుక్కను తోక ఊపసాగింది. దీంతో ఎటువంటి ఉత్పత్తి లేకుండా డబ్బును మరింత డబ్బుగా మార్చే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల హవా పెరిగింది. ఈ నేపథ్యంలో, షేర్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడుల విలువను కాపాడేందుకు ద్రవ్యోల్బణం అదుపు తప్పనిసరి అయింది. పూర్తి స్థాయి ఉపాధి కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంపుదలలు కూడా ఈ ఫైనాన్స్ పెట్టుబడులకూ, మార్కెట్లకూ పొసగనిదిగా మారింది. కొద్ది రోజుల క్రితం, అమెరికాలో నెలవారీ ఉపాధి కల్పన గణాంకాలు ఊహించిన దాని కంటే మెరుగైనవిగా వెలువడ్డాయి. కానీ ఈ వార్త అమెరికా షేర్ మార్కెట్ సూచీలలో పతనానికి కారణమైంది. నిజానికి, మార్కెట్ విశ్లేషకులు చెప్పే ఫండమెంటల్స్ బాగుంటే, అది షేర్ మార్కెట్ సూచీలలో పెరుగుదలకు కారణం కావాలి. పైన జరిగింది దీనికి పూర్తిగా విరుద్ధమైనది. ఇక్కడ ఉపాధి కల్పన గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అంటే, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, ప్రజల కొనుగోలు శక్తి బాగున్నాయన్నమాట. ఇదే, వాస్తవంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మౌలిక అంశాలు లేదా ఫండమెంటల్స్ బాగుండటం అంటే. ఇది, స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం. ఈ స్థూల ఆర్థిక వ్యవస్థ బాగున్నదంటే దానిలో అంతర్భాగమైన వివిధ రంగాలకు చెందిన సంస్థలూ, పరిశ్రమలూ, ఇతరత్రా వ్యాపారాల ఫండమెంటల్స్ కూడా బాగున్నట్లే. మరి అటువంటప్పుడు అమెరికా షేర్మార్కెట్లు ఎందుకు పతనం అయినట్లు? ఇక్కడ గమనించవలసింది 1980ల అనంతరం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో మౌలికంగా జరిగిన మార్పులను. ఈ మార్పులు, మనం పైన చెçప్పుకున్న ఫండమెంటల్స్‌కు భిన్నమైన వాతావరణాన్ని తెచ్చి పెట్టాయి. ఉపాధి కల్పనకు పునాదులుగా ఉండే వ్యవసాయ, పారిశ్రా మిక సరుకు ఉత్పత్తి, సేవారంగాల (నిజ ఆర్థిక వ్యవస్థగా పిలవ బడేవి) కంటే... అటువంటి రంగాలకు కేవలం పెట్టుబడిని సరఫరా చేసే ఫైనాన్స్ రంగానిది పైచేయి అయింది. నిజ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ విధంగా సమతూకం మారింది. అంటే, కుక్కను తోక ఊపసాగింది. ఈ క్రమంలోనే, ఎటువంటి ఉత్పత్తి లేకుండానే కేవలం డబ్బును మరింత డబ్బుగా మార్చివేసే రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటి సట్టా వ్యాపార రంగాలది పైచేయి అయ్యింది. ఇటువంటి పరిస్థితిలో, షేర్ మార్కెట్‌కు సంబంధించి కూడా ఫండమెంటల్స్ ఏవి అన్నది పూర్తిగా మారిపోయింది. ఈ కారణం చేతనే అమెరికాలో అంచనా కంటే మెరుగ్గా ఉన్న ఉపాధి గణాంకాలు మార్కెట్ల పతనానికి కారణం అయ్యాయి. అయితే, ఈ సరికొత్త ఫైనాన్స్ రంగ ఫండమెంటల్స్ తాలూకు ఏ పనితీరు ఈ మార్కెట్ల పతనానికి దారితీసింది అన్నది ఇక్కడి ప్రశ్న. షేర్ మార్కెట్ల వంటి ఈ ఫైనాన్స్ రంగాలలో, మదుపుదారులు పెట్టిన పెట్టుబడి విలువను కాపాడుకోవడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ షేర్ మార్కెట్లలో కొంత మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టినప్పుడు, అది దాని నుంచి లాభాలను ఆశిస్తుంది. లాభాల సంగతి కాసేపు పక్కన పెట్టినా, కనీసం తను పెట్టిన పెట్టుబడి తాలూకు విలువను కాపాడుకోవాలని కోరుకుంటుంది. దీనికోసం మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన కరెన్సీ విలువ స్థిరంగా ఉండాలి. అది తీవ్ర ఒడుదుడుకులకు లోనవ్వడం లేదా క్షీణించడం జరగకూడదు. ఇది, షేర్మార్కెట్ల పెట్టుబడుల తాలూకు ప్రధాన అవసరం. మరి ఇక్కడ కరెన్సీల విలువల పతనానికి కారణంగా లేదా దాని వ్యక్తీకరణగా ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది. ఒక కరెన్సీ విలువ తగ్గినప్పుడే, దాని కొనుగోలు శక్తి తగ్గుతుంది. కరెన్సీ తాలూకు ఈ కొనుగోలు శక్తి తగ్గుదలనే ద్రవ్యోల్బణం అంటాం. ఈ నేపథ్యంలోనే, షేర్ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడుల విలువను కాపాడేందుకు గానూ ద్రవ్యోల్బణం అదుపు తప్పనిసరి అవసరంగా మారింది. ఫలితంగానే, ఫైనాన్స్ పెట్టుబడుల ఆధిపత్యం పెరిగిన 1980ల అనంతరం, అంటే సుమారుగా 1990ల నుంచీ ప్రపంచంలోని దరిదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులూ ద్రవ్యోల్బణం అదుపును తమ ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. ఉదాహరణకు మన రిజర్వ్ బ్యాంకుకు ఈ ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యం, రెండు శాతం అటూ ఇటుగా నాలుగు శాతంగా నిర్ణయించబడింది. అంటే, మన దేశీయ రిజర్వ్ బ్యాంక్, దేశంలో ద్రవ్యోల్బణాన్ని 26 శాతం నడుమన నియంత్రించి ఉంచాలి. అలా అయితేనే భారత షేర్ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడుల విలువకు కాస్త భరోసా ఉంటుంది. ఇక్కడ మరో ఉదాహరణగా అమెరికా నుంచి భారతదేశ షేర్ మార్కెట్లలోకి ఒక అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థ డాలర్లను పెట్టుబడిగా తెచ్చింది అనుకుందాం. ఆ సంస్థ డాలర్లను నేరుగా పెట్టుబడిగా పెట్టలేదు. దానికోసం కరెన్సీని రూపాయలలోకి మార్చుకుంటుంది. ఇక, ఆ సంస్థకు కీలక ప్రాధాన్యత గల అంశంగా రూపాయి విలువ కాపాడబడటం అనేది ఉంటుంది. ఆ విదేశీ మదుపు సంస్థ, తన షేర్ మార్కెట్ పెట్టుబడులను అమ్ముకుని దేశం నుంచి మరోచోటకి వెళ్ళిపోయే నాటికి రూపాయి విలువ గణనీయంగా తగ్గిపోయి ఉంటే అది పెట్టుబడి + లాభాల విలువ తగ్గుదలకు కారణం అవుతుంది. మార్కెట్లో తన పెట్టుబడులను అమ్మివేసినప్పుడు ఆ మదుపు దారుడికి రూపాయల్లో డబ్బు వస్తుంది. తిరిగివెళ్ళిపోయే క్రమంలో రూపాయలను వేరే దేశంలోకి తీసుకుని వెళ్ళలేడు గనుక తిరిగి ఆ మదుపుదారుడు తనకు లభించిన రూపాయలను డాలర్లుగా మార్చుకుంటాడు. ఇక్కడ అతను పెట్టుబడి పెట్టేనాటికీ, వాటిని అమ్ముకుని వెనక్కు వెళ్ళేనాటికీ మధ్యన రూపాయి విలువ తగ్గితే, అతనికి ఈ రూపాయలను తిరిగి డాలర్లుగా మార్చుకుంటే, లభించే డాలర్ల మొత్తం కూడా తక్కువగానే వుంటుంది. ఈ మొత్తం పరిస్థితిని మదింపు చేసుకోవడం కోసమే మన దేశంలోకి లేదా ఇతరేతర దేశాలలోకి కూడా పెట్టుబడులను తీసుకువెళ్ళే మదుపుదారులు వాటిపై లభించే లాభాలను అటు, ఆ దేశం తాలూకు కరెన్సీలతో పాటుగా, మరొక కొలబద్ద అయిన డాలెక్స్ (డాలర్లలో లభించిన లాభం ) రూపంలో కూడా లెక్కించుకుంటారు. అదీ కథ! కాబట్టి, నేటి ఫైనాన్స్ యుగంలో ఫండమెంటల్స్ అనేవాటి అర్థం మారిపోయింది. నేడు ఫండమెంటల్స్‌గా పరిగణించబడుతున్నవి ప్రధానంగా ఫైనాన్స్ పెట్టుబడుల కొలబద్ద అయిన ద్రవ్యోల్బణం సూచీలు. ఈ కారణం చేతనే, అమెరికాలో ఉపాధి కల్పన బాగా జరిగిన క్రమంలో షేర్ మార్కెట్లు దిగజారాయి. ఇక్కడ, మరో చిన్న విషయం... ఈ మార్కెట్లు ఆ రోజు మధ్యాహ్నానికి తిరిగి కాస్త కోలు కున్నాయి. దీనికి కారణం, ఈ మెరుగైన ఉపాధి గణాంకం అనేది, వేతనాల పెరుగుదల రూపంలో పెద్దగా ప్రభావం చూపలేదు. అంటే, ఉపాధి మెరుగ్గానే కనబడిందిగానీ... దాని వలన వేతనాల మొత్తం పెరిగిపోయి అది మార్కెట్లో పెరిగిన ప్రజల కొనుగోలు శక్తీ లేదా డిమాండ్ రూపంలో ప్రభావం చూపగలిగిందిగా లేదన్నమాట. ఈ వాస్తవాన్ని మధ్యాహ్నానికి గ్రహించిన అమెరికా మార్కెట్ సూచీలు తిరిగి మళ్ళీ పుంజుకున్నాయి. ప్రజల కొనుగోలుశక్తీ, లేదా డిమాండ్ పెరగకుంటే మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరగదనే సూక్ష్మమే దీనికి కారణం. 1980ల ముందరినాటి కాలం ఫండమెంటల్స్ వేరుగా ఉన్నాయి. అవి, ఒక కంపెనీ తాలూకు బ్యాలెన్స్ షీట్, అలాగే స్థూలంగా నిజ ఆర్థిక వ్యవస్థ తాలూకు బలంపై ఆధారపడి వున్నాయి. కానీ నేడు అది పూర్తిగా నిజంకాదు. ద్రవ్యోల్బణం, దాని కట్టడి అనేవి నేడు మార్కెట్లో ప్రధాన అంశంగా మారింది. కాబట్టి నేడు వివిధ దేశాలలో పూర్తి స్థాయి ఉపాధి కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంపుదలలు కూడా ఈ ఫైనాన్స్ పెట్టుబడులకూ, మార్కెట్లకూ పొసగనిదిగా మారింది. వినాశ కాలే విపరీత బుద్ధి... ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
అంతర్జాతీయంగా పసిడి పరుగు
వాషింగ్టన్: ఆర్థిక అనిశ్చితి ధోరణుల్లో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం 35 డాలర్లకుపైగా పెరిగి 1,752 డాలర్లపైన ట్రేడవుతోంది (రాత్రి 11 గంటల సమయంలో). అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, మాంద్యం పరిస్థితుల్లో ఇకముందు ఫెడ్ ఫండ్ రేటు మరింత దూకుడుగా ఉండబోదన్న అంచనాలు, 20 సంవత్సరాల గరిష్టం 109 నుంచి వెనక్కు తగ్గిన డాలర్ ఇండెక్స్ (ఈ వార్త రాస్తున్న సమయంలో 106.4 వద్ద ట్రేడింగ్) వంటి కీలక అంశాలు దీనికి నేపథ్యం. ఇక అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో ధర రూ.500 వరకూ లాభపడింది. -
కమోడిటీ ట్రేడింగ్‌కు సెబీ దన్ను
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో విధానాలను సవరించడం ద్వారా లిక్విడిటీని పెంచే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా కన్సల్టేషన్ పేపర్‌ను రూపొందించింది. తద్వారా ప్రతీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రత్యేకించిన విధానాల ద్వారా లిక్విడ్ కాంట్రాక్టుల నిర్వహణకు తెరతీయాలని భావిస్తోంది. ఇందుకు వన్ కమోడిటీ వన్ ఎక్స్ఛేంజ్ పేరుతో ఒక విధానానికి ప్రతిపాదించింది. వెరసి కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లలో లావాదేవీల వికేంద్రీకరణను తగ్గించడం ద్వారా లిక్విడిటీని మెరుగుపచాలని సెబీ చూస్తోంది. ఎక్సే్చంజ్ ఆధారిత ప్రత్యేక కమోడిటీస్ సెట్‌ను రూపొందించడం ద్వారా కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఈ విధానాలను నేరో అగ్రికమోడిటీలు, కొన్ని వ్యవసాయేతర కమోడిటీలకు మాత్రమే ఉద్ధేశించినట్లు తెలుస్తోంది. ఈ విధానాలపై జనవరి 7వరకూ సెబీ అభిప్రాయాలను సేకరించనుంది. -
ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి బిగ్‌బాస్కెట్
న్యూఢిల్లీ: ఆన్లైన్లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్‌బాస్కెట్ తాజాగా ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలోకి ప్రవేశించింది. కొత్తగా టెక్నాలజీ ఆధారిత, సెల్ఫ్ సర్వీస్ ’ఫ్రెషో’ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించింది. 2023 నాటికి దేశవ్యాప్తంగా 200 భౌతిక స్టోర్లు, 2026 నాటికి 800 స్టోర్లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికల్లో భాగంగా దీన్ని ఆవిష్కరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను పోటీ సంస్థలతో పోలిస్తే మరింత చౌకగా వీటి ద్వారా అందించాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ స్టోర్స్‌లో తాజా పండ్లు, కూరగాయలతో పాటు బ్రెడ్, గుడ్లు మొదలైన నిత్యావసరాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బిగ్‌బాస్కెట్‌లో 50,000 ఉత్పత్తుల శ్రేణి నుంచి కొనుగోలుదారులు తమకు కావాల్సినవి ఆన్లైన్లో ఆర్డర్ చేసి, తమ వీలును బట్టి ఫ్రెషో స్టోర్స్ నుంచి వాటిని తీసుకోవచ్చని మీనన్ చెప్పారు. కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులను తీసుకుని, ఆటోమేటిక్ కంప్యూటర్ విజన్ ఉండే కౌంటర్లో తూకం వేయొచ్చని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్లు ఆటోమేటిక్‌గా బిల్లును రూపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
పసిడికి బలాన్నిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి!
అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర శుక్రవారం (22వ తేదీ)తో ముగిసిన వారంలో 17 డాలర్లు పెరిగి 1,319 డాలర్లకు చేరింది. రేటు (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) పెంచని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రిజర్వ్, అమెరికా వృద్ధి ధోరణి మందగమనంలో ఉందని విశ్లేషణ, డాలర్ ఇండెక్స్ బలహీనత (96), దీనికితోడు కొనసాగుతున్న అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ తీవ్రత, దీనితో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై వీడని అనిశ్చితి వంటి అంశాలు పసిడి బలానికి తోడవుతున్నాయి. నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, తిరిగి రెండు వారాల నుంచి ఆ పటిష్ట మద్దతుపైనే కొనసాగుతోంది. సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందన్నది నిపుణుల విశ్లేషణ. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ... కాగా డాలర్ మారకంలో రూపాయి (22వ తేదీ ముగింపు 68.95) ఒడిదుడుకులు, డాలర్ కదలికలపై అనిశ్చితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 32,140 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,810, రూ.31,250 వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా పసిడి భారీగా పెరిగినా, దేశీయంగా వారంవారీగా ధరలు దాదాపు అక్కడక్కడే ఉన్నాయి. రూపాయి బలోపేత ధోరణి దీనికి కారణం. -
భారీగా పడిన బంగారం
♦ అంతర్జాతీయ మార్కెట్లో 20 డాలర్లు పతనం ♦ డాలర్ ఇండెక్స్ బలోపేతం నేపథ్యం న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో శుక్రవారం ముగింపు ధరతో పోల్చితే పసిడి సోమవారం భారీగా 20 డాలర్లు పడిపోయింది. ఒకదశలో ఔన్స్(31.1గ్రా)కు 1,220 డాలర్ల స్థాయికి పడిపోయిన పసిడి, తుది సమాచారం అందే సరికి 1,223 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ శుక్రవారం పసిడి ముగింపు 1,240 డాలర్లు. గడచిన రెండు వారాల్లో ఈ స్థాయికి ఐదు సార్లు వచ్చి పైకెగసిన పసిడి, తాజాగా ఈ మద్దతును కోల్పోవడం గమనార్హం. సోమవారం డాలర్ ఇండెక్స్ 95.30 స్థాయి నుంచి 96 స్థాయికి చేరడం...పుత్తడి తాజా భారీ పతనం నేపథ్యం. మేలో 54.9 పాయింట్ల వద్ద ఉన్న తన మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్), జూన్‌లో అంచనాలకు మించి 57.8 పాయింట్లకు చేరిందన్న ఐఎస్ఎం నివేదిక డాలర్ ఇండెక్స్ బలోపేతానికి కారణం. ఆయా వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్ డోజోన్స్ కూడా రికార్డు స్థాయిలను తాకింది. ఈ అంశాలన్నీ పసిడిపై ప్రభావం చూపాయి. దేశీయంగానూ కిందకే..: మరోవైపు అంతర్జాతీయ ధోరణే దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా కనబడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్– ఎంసీఎక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారంలో రూ.305 తగ్గి రూ.28,439కి పడిపోయిన బంగారం– సోమవారం రాత్రి కడపటి సమాచారం అందే సరికి మరో రూ.313 నష్టంలో 28,126 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి ట్రేడింగ్ చివరివరకూ కొనసాగితే మంగళవారం స్పాట్ మార్కెట్లో బంగారం మరింత పడే వీలుంది. ఇదిలావుండగా, ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.285 తగ్గి, రూ.28,485కు దిగింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో తగ్గి రూ.28,335కు చేరింది. కేజీ వెండి ధర రూ.420 తగ్గి రూ.38,660కి పడిపోయింది. -
అక్షయ్ ఖన్నాను 50 లక్షలు మోసగించిన కేసులో ఇద్దరు అరెస్ట్!
50 లక్షల రూపాయల చీటింగ్ చేశారని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా దాఖలు చేసిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఓ ప్రైవేట్ కంపెనీ అధినేత, అతని భార్యను పోలీసులు విచారించారు. కమాడిటీ మార్కెట్ పెట్టుబడి పెడితే 45 రోజుల్లో రెండింతలు ఇస్తామని చెప్పి తన వద్ద 50 లక్షల రూపాయలు తీసుకుని మోసానికి పాల్పడ్డారని అక్షయ్ ఖన్నా ఫిర్యాదు చేశారని పోలీసుల అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంటెక్ ఇమేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని సత్యబ్రత చక్రవర్తి, అతని భార్యను సోనాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే వారు కమాడిటి మార్కెట్ లో పెట్టుబడిపెట్టారని.. అయితే లాభాలు వచ్చాయా లేక నష్ణపోయారా అనే విషయాన్ని వెల్లడించడం లేదని పోలీసులు ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. వారి వద్దనుంచి సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అక్టోబర్ 2010 అక్టోబర్ నెలలో అక్షయ్ ఖన్నా పెట్టుబడి పెట్టారని.. గత మూడు సంవత్సరాలుగా సొమ్ము చెల్పించమంటే తప్పించుకుతిరుగుతుండటంతో ముంబైలోని మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.