పసిడికి బలాన్నిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి! | Gold takes a hit ahead of Fed call | Sakshi
Sakshi News home page

పసిడికి బలాన్నిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి!

Published Mon, Mar 25 2019 4:36 AM | Last Updated on Mon, Mar 25 2019 4:36 AM

Gold takes a hit ahead of Fed call - Sakshi

అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌– నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) పసిడి ధర శుక్రవారం (22వ తేదీ)తో ముగిసిన వారంలో 17 డాలర్లు పెరిగి 1,319 డాలర్లకు చేరింది. రేటు (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) పెంచని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌ రిజర్వ్, అమెరికా వృద్ధి ధోరణి మందగమనంలో ఉందని విశ్లేషణ, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత (96), దీనికితోడు కొనసాగుతున్న అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ తీవ్రత, దీనితో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై వీడని అనిశ్చితి వంటి అంశాలు పసిడి బలానికి తోడవుతున్నాయి.

నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) 1,200 డాలర్ల  నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, తిరిగి రెండు వారాల నుంచి ఆ పటిష్ట మద్దతుపైనే కొనసాగుతోంది. సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందన్నది నిపుణుల విశ్లేషణ. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ...
కాగా డాలర్‌ మారకంలో రూపాయి (22వ తేదీ ముగింపు 68.95) ఒడిదుడుకులు, డాలర్‌ కదలికలపై అనిశ్చితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 32,140 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్‌ మార్కెట్‌లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,810, రూ.31,250 వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా పసిడి భారీగా పెరిగినా, దేశీయంగా వారంవారీగా ధరలు దాదాపు అక్కడక్కడే ఉన్నాయి. రూపాయి బలోపేత ధోరణి దీనికి కారణం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement