International futures markets
-
బంగారం ధర మరింత దిగొస్తుందా? లేదా?
ముంబై/న్యూయార్క్: పసిడి ధరల కదలికలపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న ఆగస్టు 2020లో పసిడి ధరలు 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత ధరలు దేశంలోని ప్రధాన మార్కెట్ ముంబైలో రూ.56 వేల గరిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం దాదాపు రూ.45 వేల వద్ద ట్రేడవుతోంది. అంటే గరిష్టం నుంచి చూస్తే, దాదాపు 20 శాతం పడ్డాయి. ఆగస్టు 2020లో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1 గ్రా) దాదాపు 2,072 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. 2021 ఏప్రిల్ 1వ తేదీ గురువారంతో ముగిసిన వారంలో 1,730 డాలర్లకు చేరింది. గడచిన నెలరోజుల్లో పసిడికి 1,640 డాలర్ల వద్ద రెండుసార్లు పటిష్ట మద్దతు లభించింది. అలాగే 1,750 డాలర్ల వద్ద నిరోధం ఎదురయ్యింది. 1,750 డాలర్ల స్థాయిని అధిగమిస్తే, తిరిగి పసిడి 1,850 డాలర్ల స్థాయికి ఎగసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అంశాల ప్రాతిపదికన, ప్రపంచవ్యాప్తంగా పసిడి వినియోగంలో రెండవ అతిపెద్ద దేశమైన భారత్‌లో– 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర సమీప భవిష్యత్తులో రూ.40వేల కిందకి దిగిరాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశ్లేషణలు ఇవీ... అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, వ్యాక్సినేషన్ విస్తృతి, సెకండ్ వేవ్ వంటి అంశాలపై పసిడి భవిష్యత్ ధర ఆధారపడి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే పసిడి ఇప్పట్లో తిరిగి గరిష్టాల దిశగా వెళ్లే అవకాశం లేదన్నది నిపుణుల వాదన. అలాగే దేశీయంగా సమీప భవిష్యత్తులో పసిడి పూర్తి స్వచ్ఛత రూ.40,000 కిందకి పడకపోవచ్చనీ భావిస్తున్నారు. దేశంలో పసిడి ధర అంతర్జాతీయ ఆర్థిక అంశాలతోపాటు డాలర్ మారకంలో రూపాయి విలువపై ఆధారపడి ఉంటుంది. రూపాయి బలహీనపడితే పసిడి ధర పెరిగే వీలుంది. అయితే రూపాయి ప్రస్తుతం మరీ అంతగా బలహీనపడే అవకాశం లేదన్నది విశ్లేషణ. ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ 73కు 50 పైసలు అటు ఇటుగా కదలాడుతోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి రూపాయికి పటిష్టతను ఇస్తాయన్న అంచనాలు ఉన్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). రూపాయి పటిష్టానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ తన ‘ఫారెక్స్ ఇంటర్వెన్షన్’ ద్వారా రూపాయి బలోపేతానికి దాదాపు 80 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. వెరసి ‘అంతర్జాతీయంగా ధర భారీగా పెరిగిపోతే తప్ప’ దేశంలో పసిడి ధర తగ్గడానికే అధిక అవకాశాలు ఉన్నాయని అంచనా. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్స్ రేటు (ప్రస్తుతం 0.25 శాతం), అమెరికా డాలర్ కదలికల (ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన వారంలో డాలర్ ఇండెక్స్ ముగింపు 93), కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం, అమెరికా సహా ప్రపంచ ఎకానమీ రికవరీ ధోరణి వంటి కీలక అంశాలు అంతర్జాతీయంగా పసిడి ధరను ప్రభావితం చేసే అవకాశం ఉంది. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,458 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,089 డాలర్లు. ఇక డాలర్ ఇండెక్స్ 52 వారాల కనిష్ట, గరిష్టాలు 89.16 – 104 శ్రేణిలో ఉంది. లాక్డౌన్ భయాలు... 2020 మార్చితో పోల్చితే 2021 మార్చిలో పసిడి దిగుమతులు 471 శాతం పెరిగి, దాదాపు 160 టన్నులుగా నమోదయ్యాయి. దిగుమతి సుంకాల తగ్గింపు, గరిష్ట స్థాయిల నుంచి ఎల్లో మెటల్ దిగిరావడం వంటి అంశాలు రిటైల్ కొనుగోలుదారులను పసిడి పట్ల ఆకర్షణకు గురిచేసినట్లు విశ్లేషణలు ఉన్నాయి. మార్చిలో గోల్డ్ ఫ్యూచర్ ఏడాది కనిష్టం రూ.43,320 కనిష్టానికి పడింది. రిటైల్ డిమాండ్ భారీగా ఉండడంతో వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపారని ముంబైకి చెందిన ఒక బులియన్ డీలర్ పేర్కొన్నారు. ఆభరణాలకు డిమాండ్ నెలకొనడంతో పసిడి ధర మరీ పడిపోకుండా కొంత మద్దతు పొందినట్లు ఆయన వివరించారు. ఇక ఏప్రిల్ నెలలో పసిడి దిగుమతులు 100 టన్నుల లోపునకు పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్డౌన్ భయాలు నెలకొనడం దీనికి కారణం. ఆయా అంశాలు కూడా పసిడి ధరలను సమీప కాలంలో రూ.40,000పైన నిలబెడతాయన్న అంచనాలు ఉన్నాయి. -
క్రూడ్‌కు కోవిడ్ దెబ్బ!
న్యూయార్క్: కోవిడ్–19 ప్రపంచ ఆర్థిక వృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందన్న భయాందోళనలు క్రూడ్ ధరలపై ప్రభావం చూపాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో గురువారం ఒక దశలో క్రూడ్ ధర 5 శాతానికి పైగా పడిపోయింది. ఈ వార్త రాసే రాత్రి 11 గంటల సమయానికి నైమెక్స్ లైట్ స్వీట్ ధర బ్యారెల్‌కు 47.10 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ 54.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ ధరలు వరుసగా 45.88 డాలర్లు, 50.39 డాలర్లనూ తాకడం గమనార్హం. నైమెక్స్ క్రూడ్‌కు కీలక మద్దతు 42 డాలర్లు కాగా, ఇదీ కోల్పోతే 26 డాలర్లను తాకే అవకాశం ఉంది. ఇదే జరిగితే క్రూడ్‌కు ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. 250 బిలియన్ డాలర్ల నష్టం: పీహెచ్‌డీసీసీఐ ఇదిలావుండగా, పారిశ్రామిక చాంబర్ పీహెచ్‌డీసీసీఐ గురువారం కరోనా వైరెస్ వ్యాధిపై తమ అంచనాలను విడుదల చేస్తూ, దీనివల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటుపై 30 బేసిస్ పాయింట్ల ప్రతికూల ప్రభావం లేదా 250 బిలియన్ డాలర్ల మేర నష్టం జరుగుతుందని అంచనా వేసింది. సరఫరాపరమైన సమస్య ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతుందని వివరించింది. -
1,300 డాలర్లపైన నిలబడ్డం కష్టమే!
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర మే 24వ తేదీతో ముగిసిన వారంలో దాదాపు 6 డాలర్లు పెరిగి 1,284 డాలర్ల వద్ద ముగిసింది. వారంలో ఒక దశలో 1,270 డాలర్లను కూడా తాకింది. గడచిన నెల రోజులుగా పసిడి దాదాపు 1,270–1,300 డాలర్ల స్థాయిలో తిరుగుతోంది. ఈ స్థాయి నుంచి బులిష్ ధోరణిలోకి ప్రవేశించడం పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం, అమెరికా ఆర్థికాభివృద్ధి, ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 2.25–2.50 శాతం), అమెరికా ఉపాధి గణాంకాలు, ద్రవ్యోల్బణం, డాలర్ ఇండెక్స్ కదలికల (ప్రస్తుతం 94.48) వంటి పలు అంశాలు మున్ముందు పసిడి బాటను నిర్ణయిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. పసిడి తదుపరి పరుగుకు 1,300, 1,320, 1,350 డాలర్ల కీలక అవరోధాలన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే దిగువస్థాయిలో 1,240 డాలర్ల దిగువను మళ్లీ తాకే అవకాశాలు తక్షణం కనబడ్డం లేదని కూడా వారు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆ స్థాయి దిగువకు పడినా, తిరిగి పటిష్ట కొనుగోళ్ల మద్దతు ఉంటుందన్నది వారి విశ్లేషణ. దేశీయంగా రూపాయే కీలకం ఇక భారత్‌లో చూస్తే, డాలర్‌తో రూపాయి మారకం విలువ (ప్రస్తుతం 69.52) కదలికలు పసిడి ధరలను నిర్దేశిస్తాన్న అంచనా ఉంది. రూపాయి విలువ ప్రస్తుతం దేశంలో 71–69 శ్రేణిలో తిరుగుతోంది. 71 దిగువకు పతనమైతే పసిడి ధర దేశీయంగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. సమీప కాలంలో దేశంలో పసిడి ధర 10 గ్రాములకు దేశీయంగా రూ. 32,000–33,000 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో శుక్రవారం పసిడి ధర 31,530 వద్ద ముగిసింది. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో ధరలు 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,450, రూ.30,900గా ఉన్నాయి. -
పసిడికి బలాన్నిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి!
అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర శుక్రవారం (22వ తేదీ)తో ముగిసిన వారంలో 17 డాలర్లు పెరిగి 1,319 డాలర్లకు చేరింది. రేటు (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) పెంచని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రిజర్వ్, అమెరికా వృద్ధి ధోరణి మందగమనంలో ఉందని విశ్లేషణ, డాలర్ ఇండెక్స్ బలహీనత (96), దీనికితోడు కొనసాగుతున్న అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ తీవ్రత, దీనితో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై వీడని అనిశ్చితి వంటి అంశాలు పసిడి బలానికి తోడవుతున్నాయి. నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, తిరిగి రెండు వారాల నుంచి ఆ పటిష్ట మద్దతుపైనే కొనసాగుతోంది. సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందన్నది నిపుణుల విశ్లేషణ. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ... కాగా డాలర్ మారకంలో రూపాయి (22వ తేదీ ముగింపు 68.95) ఒడిదుడుకులు, డాలర్ కదలికలపై అనిశ్చితుల వంటి అంశాల నేపథ్యంలో దేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 32,140 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,810, రూ.31,250 వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా పసిడి భారీగా పెరిగినా, దేశీయంగా వారంవారీగా ధరలు దాదాపు అక్కడక్కడే ఉన్నాయి. రూపాయి బలోపేత ధోరణి దీనికి కారణం. -
పసిడి భవితపై ‘ఫెడ్’ రేటు ప్రభావం
అమెరికా ఆర్థిక పరిస్థితి, కీలక వడ్డీ రేట్లపై (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) బుధవారం (20వ తేదీ) ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షా కమిటీ తీసుకునే నిర్ణయంపై పసిడి సమీప భవిష్యత్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, పటిష్టంగా కొనసాగుతోంది. 15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 4 డాలర్ల లాభంతో 1,302 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వృద్ధి, డాలర్ కదలికలు (15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 96), అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలపై తదుపరి పసిడి కదలికలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ... కాగా డాలర్ మారకంలో రూపాయి పటిష్టత దేశీయ పసిడి ధరపై ప్రభావం చూపుతోంది. దేశీయ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 24పైసలు లాభపడి 69.10కి చేరిన సంగతి తెలిసిందే. గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. అందువల్ల పసిడి అంతర్జాతీయ భారీగా పెరిగినా, దేశీయంగా సమీప కాలంలో అంతర్జాతీయ పెరుగుదల ధోరణి పూర్తిస్థాయిలో ప్రతిబింబించకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఆయా అంశాల నేపథ్యంలోదేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 31,826 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,870, రూ.31,300 వద్ద ముగిశాయి. -
భారీగా క్షీణించిన బంగారం
ముంబై/న్యూయార్క్: అటు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లలోనూ, దానికి అనుగుణంగా ఇటు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు శుక్రవారం బాగా తగ్గాయి. అమెరికా డాలర్ బల పడటం, స్టాక్ మార్కెట్ల ర్యాలీ దీనికి ప్రధాన కారణాలు. అంతర్జాతీయ మార్కెట్లో నాలుగేళ్ల కనిష్టానికి పసిడి ధర పతనమయ్యింది. కడపటి సమాచారం అందేసరికి న్యూయార్క్‌లోని నెమైక్స్ కమోడిటీ విభాగంలో ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం ముగింపుతో పోల్చితే 33 డాలర్లు (2.78 శాతం) తగ్గి, 1,165 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ధర 3.15 శాతం క్షీణించి 16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్- మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. శుక్రవారం కడపటి సమాచారం అందేసరికి చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్టులో 10 గ్రాముల పసిడి ధర గురువారం ముగింపుతో పోల్చితే రూ.653 తగ్గి(2.45%) రూ.25,950 వద్ద ఉంది. వెండి కేజీ ధర రూ.1,156 (3.16%) తగ్గి రూ.35,418 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణిలో ముగిస్తే, శనివారం స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. శుక్రవారం ముంబైసహా దేశంలోని పలు నగరాల బులియన్ స్పాట్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు తగ్గడం ఇక్కడ ప్రస్తావనాంశం.