న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర మే 24వ తేదీతో ముగిసిన వారంలో దాదాపు 6 డాలర్లు పెరిగి 1,284 డాలర్ల వద్ద ముగిసింది. వారంలో ఒక దశలో 1,270 డాలర్లను కూడా తాకింది. గడచిన నెల రోజులుగా పసిడి దాదాపు 1,270–1,300 డాలర్ల స్థాయిలో తిరుగుతోంది. ఈ స్థాయి నుంచి బులిష్ ధోరణిలోకి ప్రవేశించడం పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం, అమెరికా ఆర్థికాభివృద్ధి, ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 2.25–2.50 శాతం), అమెరికా ఉపాధి గణాంకాలు, ద్రవ్యోల్బణం, డాలర్ ఇండెక్స్ కదలికల (ప్రస్తుతం 94.48) వంటి పలు అంశాలు మున్ముందు పసిడి బాటను నిర్ణయిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. పసిడి తదుపరి పరుగుకు 1,300, 1,320, 1,350 డాలర్ల కీలక అవరోధాలన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే దిగువస్థాయిలో 1,240 డాలర్ల దిగువను మళ్లీ తాకే అవకాశాలు తక్షణం కనబడ్డం లేదని కూడా వారు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆ స్థాయి దిగువకు పడినా, తిరిగి పటిష్ట కొనుగోళ్ల మద్దతు ఉంటుందన్నది వారి విశ్లేషణ.
దేశీయంగా రూపాయే కీలకం
ఇక భారత్‌లో చూస్తే, డాలర్‌తో రూపాయి మారకం విలువ (ప్రస్తుతం 69.52) కదలికలు పసిడి ధరలను నిర్దేశిస్తాన్న అంచనా ఉంది. రూపాయి విలువ ప్రస్తుతం దేశంలో 71–69 శ్రేణిలో తిరుగుతోంది. 71 దిగువకు పతనమైతే పసిడి ధర దేశీయంగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. సమీప కాలంలో దేశంలో పసిడి ధర 10 గ్రాములకు దేశీయంగా రూ. 32,000–33,000 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో శుక్రవారం పసిడి ధర 31,530 వద్ద ముగిసింది. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో ధరలు 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,450, రూ.30,900గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment