భారీగా క్షీణించిన బంగారం
ముంబై/న్యూయార్క్: అటు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లలోనూ, దానికి అనుగుణంగా ఇటు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు శుక్రవారం బాగా తగ్గాయి. అమెరికా డాలర్ బల పడటం, స్టాక్ మార్కెట్ల ర్యాలీ దీనికి ప్రధాన కారణాలు. అంతర్జాతీయ మార్కెట్లో నాలుగేళ్ల కనిష్టానికి పసిడి ధర పతనమయ్యింది. కడపటి సమాచారం అందేసరికి న్యూయార్క్‌లోని నెమైక్స్ కమోడిటీ విభాగంలో ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం ముగింపుతో పోల్చితే 33 డాలర్లు (2.78 శాతం) తగ్గి, 1,165 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ధర 3.15 శాతం క్షీణించి 16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇక దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్- మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. శుక్రవారం కడపటి సమాచారం అందేసరికి చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్టులో 10 గ్రాముల పసిడి ధర గురువారం ముగింపుతో పోల్చితే రూ.653 తగ్గి(2.45%) రూ.25,950 వద్ద ఉంది. వెండి కేజీ ధర రూ.1,156 (3.16%) తగ్గి రూ.35,418 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణిలో ముగిస్తే, శనివారం స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. శుక్రవారం ముంబైసహా దేశంలోని పలు నగరాల బులియన్ స్పాట్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు తగ్గడం ఇక్కడ ప్రస్తావనాంశం.