భారీగా పడిన బంగారం
♦ అంతర్జాతీయ మార్కెట్‌లో 20 డాలర్లు పతనం
♦ డాలర్ ఇండెక్స్ బలోపేతం నేపథ్యం
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో శుక్రవారం ముగింపు ధరతో పోల్చితే పసిడి సోమవారం భారీగా 20 డాలర్లు పడిపోయింది. ఒకదశలో ఔన్స్(31.1గ్రా)కు 1,220 డాలర్ల స్థాయికి పడిపోయిన పసిడి, తుది సమాచారం అందే సరికి 1,223 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ శుక్రవారం పసిడి ముగింపు 1,240 డాలర్లు. గడచిన రెండు వారాల్లో ఈ స్థాయికి ఐదు సార్లు వచ్చి పైకెగసిన పసిడి, తాజాగా ఈ మద్దతును కోల్పోవడం గమనార్హం.
సోమవారం డాలర్ ఇండెక్స్ 95.30 స్థాయి నుంచి 96 స్థాయికి చేరడం...పుత్తడి తాజా భారీ పతనం నేపథ్యం. మేలో 54.9 పాయింట్ల వద్ద ఉన్న తన మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్), జూన్‌లో అంచనాలకు మించి 57.8 పాయింట్లకు చేరిందన్న ఐఎస్‌ఎం నివేదిక డాలర్ ఇండెక్స్ బలోపేతానికి కారణం. ఆయా వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్ డోజోన్స్ కూడా రికార్డు స్థాయిలను తాకింది. ఈ అంశాలన్నీ పసిడిపై ప్రభావం చూపాయి.
దేశీయంగానూ కిందకే..: మరోవైపు అంతర్జాతీయ ధోరణే దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా కనబడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్– ఎంసీఎక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారంలో రూ.305 తగ్గి రూ.28,439కి పడిపోయిన బంగారం– సోమవారం రాత్రి కడపటి సమాచారం అందే సరికి మరో రూ.313 నష్టంలో 28,126 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి ట్రేడింగ్ చివరివరకూ కొనసాగితే మంగళవారం స్పాట్ మార్కెట్‌లో బంగారం మరింత పడే వీలుంది. ఇదిలావుండగా, ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.285 తగ్గి, రూ.28,485కు దిగింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో తగ్గి రూ.28,335కు చేరింది. కేజీ వెండి ధర రూ.420 తగ్గి రూ.38,660కి పడిపోయింది.